పెద్దింటి పెళ్లి 

Updated By ManamTue, 11/06/2018 - 00:16
wedding

ఓ పెద్దింటి అబ్బాయికి మరో పెద్దింటి అమ్మాయితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.  రెండు కుటుంబాలు చాలా పేరున్నవి కావడంతో భారీ సంఖ్యలో వీఐపీలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.. సీన్ కట్ చేస్తే.. ఆరు నెలలు కూడా తిరక్కుండానే ఈ పెళ్లి పెటాకులైంది. అదేంటని యావత్ దేశం ఆసక్తిగా చర్చిస్తోంటే.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

నాకొద్దీ..
imageతల్లిదండ్రులు ఇద్దరూ మాజీ సీఎంలు.. తాను కూడా రాబోయే కాలానికి సీఎం కావాలని కలలు కంటున్న సమయంలో పెళ్లీడు వచ్చిందని మరో మాజీ సీఎం మనువరాలు, మాజీ మంత్రి కుమార్తె కూడా అయిన అమ్మాయితో వివాహం జరిపించారు.  అల్లారు ముద్దుగా పెరిగిన పెద్దింటి అమ్మాయి.. ఎంబీఏ చదివిన మహిళ.. పిల్లన గ్రోవి ఊపుతూ గొడ్ల చావిట్లో పిచ్చి పిచ్చి ఫొటోలు దిగే కుర్రాడిని చూసి బిత్తరపోయి.. నాకొద్దు బాబోయ్ ఈ కుర్రాడు అంటూ వెర్రెక్కినట్టు పుట్టింటికి పారిపోయింది. అంతేనా.. నావల్ల కాదు ఆ బైరాగితో వేగడం.. పక్కా నాటు మనుషులు, పల్లెటూరి వ్యవహారాలు.. అంటూ శివాలెత్తింది ఆ అమ్మాయి. చేసేది లేక.. ‘‘నాకు కూడా ఆ అమ్మాయితో ఏగడం వల్లకాదు.. ఇద్దరివీ భిన్న ధృవాలు.. నేను ఉత్తర ధృవం అయితే తాను దక్షిణ ధృవం’’ అంటూ అబ్బాయి కూడా కోర్టుకెక్కి... ఆతరువాత మీడియాకెక్కాడు. ఇద ంతా పరిచయం అక్కర్లేని లాలూ కుటుంబం వ్యవహారమే. 
 

రాజకీయ నాటకం
రెండు సంపన్న, రాజకీయ కుటుంబాలు వియ్యమందితే..ఇంకేముంది సూపర్ డీల్స్ అనుకున్న పెద్దలు తమ పిల్లల అభిరుచులను ఏమాత్రం పట్టించుకోకుండా పెళ్లి జరిపించేశారు. హై ప్రొఫైల్ వెడ్డింగ్‌గా లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీల తొలి సంతానం తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహాన్ని చంద్రికా రాయ్ అనే మాజీ మంత్రి కుమార్తె ఐశ్వర్య రాయ్‌తో 2018, మార్చ్ 12న జరిపించారు. ఇరు కుటుంబాలకు ఉన్న అనుచరగణం ఈ దంపతులను ఆకాశానికి ఎత్తుతూ..సాక్షాత్తూ ఆది దంపతులే అంటూ పోస్టర్లు సైతం వేసి విస్తుపోయేలా చేశారు.  ఇంతలోనే.. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగ క పోవడంతో ఇంకెంత కాలం ఇలా జాప్యం చేసి జీవితాన్ని వృథా చేసుకోవాలంటూ తేజ్ ప్రతాప్ విడాకులకు అప్లై చేసేశారు. దీంతో అసలు ఏం జరిగిందంటూ అందరూ షాక్ తిన్నారు. గతంలోనూ ఓ సినిమాలో నటించిన తేజ్.. తాజాగా ‘రుద్ర.. ద అవతార్’ అనే సినిమా షూటింగ్ అంటూ బిజీగా ఉంటూండడం.. వెరసి ఆయన భార్య ఐశ్వర్య రాయ్‌కు చాలా విసుగు తెప్పించాయి.
 

image

లైఫ్ స్టైల్స్ వేరు
నిజానికి ఇద్దరిదీ ఒకే రాష్ట్రం.. ఒకే సంప్రదాయం.. దాదాపు ఒకే నేపథ్యమే అయినా.. తేజ్, ఐశ్వర్యల లైఫ్‌స్టైల్స్ పూర్తిగా భిన్నమైనవి. ఢిల్లీలో చదువుకుని ఆధునిక జీవన శైలి గడుపుతున్న ఐశ్వర్య కేవలం ఇంటిపట్టున ఉంటూ జీవితాన్ని గడపలేక.. అలాగని తనకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ లేక పంజరంలో చిలుకలా ఉండిపోవాల్సి వచ్చిందని సన్నిహితులతో వాపోయినట్టు మీడియాలో వచ్చింది. ఆధునిక భావాలు, స్వతంత్ర మనస్తత్వం ఉన్న తాను లాలూ, రాబ్రీ, తేజ్‌ల వంటి మనస్తత్వమున్న వారి మధ్య ఇమడలేక పోయినట్టు తల్లిదండ్రులతో ఆమె మొరపెట్టుకున్నట్టు.. దీంతో చేసేది ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంతపాడినట్టు హిందీ మీడియా ఘోషిస్తోంది. మరోవైపు.. ఇదంతా కేవలం రాజకీయ లబ్దికోసమే జరిగిన వివాహమని స్వయంగా మరో బాంబు పేల్చారు తేజ్. రాజకీయ సమీకరణాల కోసం తమ జీవితాలను బలి చేశారని మీడియా ముందు తేజ్ వాపోవడంతో అసలు విషయం కాస్త బయటికి పొక్కింది. తాను కృష్ణుడినని, రాధ కోసం వేచి చూస్తున్నట్టు తేజ్ ప్రతాప్ విచిత్రమైన వ్యాఖ్యలు చేసి మీడియానే ఖంగు తినిపించారు. ఐశ్వర్యతో వివాహం తనకు మొదటి నుంచీ ఇష్టం లేదని లేటెస్టుగా చె ప్పడం.. చాలా మంది తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా ఉంది. ఓవైపు తన సోదరుడు తేజస్వీ యాదవ్‌కే పార్టీ పగ్గాలు అప్పగించడంపై గుర్రుగా ఉన్న తేజ్, తన భార్య రాజకీయ ఆరంగేట్రం చేయాలని కలలు కనడం.. అందునా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తుండడం మరింత ఆగ్రహాన్ని తెప్పించిందని బిహార్ మీడియా పుంఖాను పుంఖాలుగా వార్తలు ప్రసారం చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం

ప్రకారం పెళ్లైన 15 రోజులకే నవదంపతుల మధ్య తీవ్రస్థాయిలో కలహాలు చెలరేగగా, బృందావనంలోని తన ఆధ్యాత్మిక గురువు సలహా మేరకు తేజ్ ప్రతాప్ భార్యతో విడిపోయేందుకే మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే ఐశ్వర్య ఉన్నట్టుండి తమ ఇంటికి వచ్చిందని..తన కుటుంబసభ్యులంతా అమెకే మద్దతిస్తున్నట్టు..ఇది తనపై పన్నిన కుట్ర అంటూ తేజ్ విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. వ్యక్తిగత జీవితం పట్ల ఎంత అసహనంతో రగిలిపోతున్నాడో చెప్పకనే చెబుతున్నాడు. ‘‘కుళ్లి కుళ్లి ఏడుస్తూ బతకటం కంటే డైవర్సు తీసుకోవడం బెటర్’’అంటూ సోషల్ మీడియాలో విషయాన్ని కక్కుతున్నారు. మొత్తానికి ఈ విషయమంతా సినిమా స్టోరీలా అందరికీ ఆసక్తి కలిగిస్తూనే పెళ్లీడుకు వచ్చిన యువతను ఆలోచించేలా చేస్తోంది.

English Title
The wedding of the rich family
Related News