కేసీఆర్ దూకుడుకు అర్థమేమిటి?

Updated By ManamSat, 09/08/2018 - 01:03
editorial

imageరాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్న ‘ఆకస్మిక’ నిర్ణయం రాష్ట్ర ప్రజలను, పార్టీ శ్రేణులను నిర్ఘాంత పరిచి ఉండొచ్చు. కానీ, ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక దాదాపు మూడు నెలల కసరత్తు ఉందని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతు న్నారు. ఆయన చాలా కాలం క్రితమే తన సన్నిహి తులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పార్టీ సీనియర్లతో కూడా చర్చించారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో కూడా దాదాపు అర గంటసేపు చర్చించారు. ఈ కసరత్తు జరిగిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చారన్నది సన్నిహి తులు చెబుతున్న మాట. శాసనసభను రద్దు చేసిన తర్వాత విధిగా ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహిం చాల్సి ఉంటుంది. శాసనసభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించీ ప్రకటించగానే ఆయన తన ఎన్నికల ప్రచా రాన్ని కూడా ప్రారంభించేశారు. తీవ్ర పదజాలంతో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని బఫూన్ అని అభివర్ణిస్తూ దాడికి శ్రీకారం చుట్టారు. ఎప్పటి మాదిరిగానే తెలుగుదేశం పార్టీని దుయ్యబట్టారు.
 

image


కేసీఆర్ తీరు చూసి, కాంగ్రెస్ పార్టీ నేతలే కాక, తెలుగుదేశం పార్టీ నేతలు సైతం తీవ్రంగా స్పందిం చారు. కేసీఆర్ అహంభావంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. శాసనసభ రద్దు కావడానికి ఇంకా 8 నెలల సమయం ఉండగానే కేసీఆర్ ఈ విధంగా శాసనసభను రద్దు చేసి, ప్రచా రం కూడా ప్రారంభించడం ప్రతిపక్షాలకు కొరుకుడు పడలేదు. పైగా ఆయన మొత్తం 119 స్థానాలకు 105 స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ప్రతిపక్షాల కంటే చాలా ముందుండబోతున్నారు. శుక్రవారం నాడు హుస్నా బాద్‌లో తన మొదటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిం చడమే కాకుండా, 50 రోజుల్లో వంద అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రచార యాత్ర చేపట్టబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయాలు, చర్య లన్నీ ఇతర రాజకీయ పక్షాలకు అంత త్వరగా మింగుడు పడని విషయాలే. ఆయన చాలా జాగ్రత్తగా వీటన్నిటికీ ప్లాన్ చేసుకున్నారని చెప్పక తప్పదు. ‘రాష్ట్ర సమస్యల మీద’ కొద్ది కాలం క్రితం ప్రధానితో సమావేశమైన రోజే ఈ విషయంలో కొన్ని సూచనలు లభించాయి. రాష్ట్ర సమస్యల మీద ప్రధానితో చర్చ లన్న కారణంపై ఆయన ప్రధానితో రాజకీయ అంశా లే ఎక్కువగా చర్చించారు. నిజానికి, శాసనసభను రద్దు చేయడానికి ప్రధాని నుంచి అనుమతి అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రికి రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం ఉంటుంది. అయి నా తనకు మున్ముందు ఎటువంటి అడ్డంకులూ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఆయన ముందు  ప్రధాని చెవిన కూడా తన అభిప్రాయం వేశారు.

రాష్ట్ర శాసనసభను రద్దు చేయాలన్న కేసీఆర్ సూచనలకు బహుశా ప్రధాని, కేంద్ర నాయకత్వం కూడా వెనువెంటనే అంగీకరించి ఉంటుంది. అయితే గియితే, ఎన్‌డీఏలోకి టీఆర్‌ఎస్ వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుంది. ఎన్నికలు ఆలస్యం కాకుండా ఆయన ముందుగానే ఎన్నికల కమిషనర్‌తో కూడా చర్చించారు. మొత్తం మీద ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటే తెలంగాణ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే, లోక్‌సభకు, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలన్న కేంద్రం ప్రతిపాదనకు మొదటగా అంగీకారం తెలిపింది కేసీఆరే. కానీ, ఆయనే ముందుస్తు ఎన్నికలకు తెర తీయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందుకు ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. అవి పూర్తిగా రాజకీయ కారణాలే. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే పక్షంలో అందరి దృష్టీ బీజేపీ మీదా, మోదీ మీదా ఉంటుంది తప్ప తన మీదా, తన టీఆర్‌ఎస్ మీదా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే రాష్ట్రంలో మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ లబ్ధి పొందుతుందనేది ఆయన ఉద్దేశం. 
 
టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం
రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎన్ని చర్యలు చేపడుతున్నా, ఎన్నికల్లో ఎంత తీవ్ర స్థాయి ప్రచారం చేసినా, జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంటుంది కనుక, దాని ప్రభావం రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కొద్ది టీఆర్‌ఎస్ వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ లబ్ధి పొందుతుందని కూడా ఆయనకు తెలుసు. రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ఆయ నకు కాంగ్రెస్‌తోనే సమస్య. తెలుగుదేశం, వైఎస్ ఆర్‌సీపీ, జనసేన తదితర పార్టీలతో తనకు ఎన్నికల్లో వచ్చే ముప్పేమీ లేదని ఆయన అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీయే కొద్ది కొద్దిగా బలం పుంజుకుంటోంది. ఆ పార్టీయే తనకు కాస్తో కూస్తో పోటీ ఇవ్వబోతోంది. అందుకనే ఆయన శాసనసభను రద్దు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మరుక్షణం కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదని ఆయనకు తెలుసు. తనకు బీజేపీ నుంచి వచ్చే బెడదేమీ లేదు. పైగా ఇప్పుడు బీజేపీతో సాన్నిహిత్యం నెరపితే, సెక్యు లర్ పార్టీగా తనకున్న ప్రతిష్ఠకు మచ్చ ఏర్పడుతుంది. అందుకని ఆయన బీజేపీని అన్ని విధాలా దూరంగా ఉంచారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే ఆయన మజ్లిస్‌తో చేతులు కలపడాన్ని ప్రశ్నించేవారు ఉండకపోవచ్చు. రాష్ట్రంలో ముస్లింల సంఖ్య పది శాతానికి పైగానే ఉంది. వారి ఓట్ల మీద ఆయనకు కన్నుంది. రాష్ట్రంలో ముస్లింలని అంత తేలికగా తీసిపారేయలేమని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన అనంతర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందివ్వడంలో ఘోరంగా విఫలమైందని, అది తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది ఆంధ్రప్రదేశ్ వారికి మనస్తాపం కలిగిస్తోందని కేసీఆర్‌కు తెలుసు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు ఎక్కువ. వారిని తన వైపునకు తిప్పుకోవడానికి కూడా ఆయన బీజేపీని పక్కన పెట్టారని రాజకీయ విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. ఎన్నికల తర్వాత అయినా ఆయన బీజేపీతో టీఆర్‌ఎస్ చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. బీజేపీ కనుక 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే దానితో చేతులు కలపాలన్నది కేసీఆర్ ఆలోచన. కేంద్రంతో భేదాభిప్రాయాలకు దిగడం ఆయనకు నచ్చని విషయం. రాష్ట్రానికి ప్రయో జనాలు చేకూర్చే ఎటువంటి పొత్తుకైనా, ఎటువంటి సాన్నిహిత్యానికైనా ఆయన సిద్ధం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

శాసనసభను రద్దు చేయడం అనేది ఆకస్మిక నిర్ణయం కాకపోవచ్చు కానీ, ఆయన అభ్యర్థులను ప్రకటించడం మాత్రం ఆశ్చర్యకర విషయమే. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీతో సహా వివిధ రాజకీయ పార్టీలు ఇంకా ప్రచారమే ప్రారంభించలేదు. అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి  ఆ పార్టీలకు ఇంకా సమయం ఉంది. శాసనసభ రద్దు కన్నా వాటిని షాక్‌కు గురిచేసిన అంశం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయడమే. కాంగ్రెస్‌కు సంబం ధించినంత వరకూ అది ఇంకా సీట్ల పంపకం, పొత్తులు వగైరాలను ఇంకా మొదలు పెట్టడం కూడా జరగలేదు. ఇక అభ్యర్థుల ఎంపిక, ప్రకటన ఎలా సాధ్యం? టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేం దుకు కాంగ్రెస్ రాష్ట్రంలో పొత్తుల కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. అవేవీ ఒక కొలిక్కి రాలేదు. తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ చేతులు కలిపే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చా యి కానీ, తెలుగుదేశం పార్టీలో పొత్తు ప్రసక్తే లేదని కాంగ్రెస్, కాంగ్రెస్‌తో పొత్తే ఉండదని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్పష్టం చేసి ఉండడంతో కొత్త పొత్తుల కోసం ఎదురు చూపులు ప్రారంభమయ్యాయి. 

కాంగ్రె స్‌తో పొత్తు ప్రసక్తి లేదని మార్క్సిస్టు పార్టీ ప్రకటించింది. పైగా బహుజన ఫ్రంట్ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ గట్టి ప్రయ త్నాలు సాగిస్తోంది. వీటన్నిటినీ బట్టి చూస్తే, అభ్య ర్థులను ప్రకటించడం ద్వారా కేసీఆర్ కొన్ని అడుగులు ముందుకు వేసినట్టు అర్థమవుతోంది. మజ్లిస్‌తో స్నే హం చేస్తున్న టీఆర్‌ఎస్ బీజేపీతో కూడా మెతకగానే వ్యవహరిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ రాజకీయ వ్యూ హం అదే అనిపిస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇతర పార్టీలు పొత్తులు, ఫ్రంట్‌లు ఖరారు చేసుకునే సమయానికి టీఆర్‌ఎస్ నాయకత్వం ఈ వంద నియోజక వర్గాల్లో నూ ఒక దఫా ఎన్నికల ప్రచారం పూర్తి చేసే అవకాశం ఉంది. అటు అభ్యర్థుల ఎంపికలోనూ, ఇటు ప్రచారం లోనూ మిగిలిన పార్టీలు బాగా వెనుకబడే అవకాశం ఉంది. 

English Title
What does KCR's aggressor mean?
Related News