చెప్పేది బారెడు చేసేది జానెడు

Updated By ManamFri, 03/16/2018 - 02:32
kishan reddy
  • ప్రభుత్వం అప్పులపై ఆధారపడింది

  • బీజేపీ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 

kishan reddyహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని, చెప్పేది బారెడు, చేసేది జానెడు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద  గురువారం ఆయన బడ్జెట్ గురించి మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ 25,588 ఉద్యోగాలు భర్తీ చేసిందని, లక్షకు పైగా భర్తీలు చేపడుతామన్న కేసీఆర్.. బడ్జెట్ లెక్కల ప్రకారం మిగిలిన 85 వేల ఉద్యోగాలు భర్తీ పూర్తి చేయాలంటే మరో 14 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. 2017 చివరికల్లా  హైదరాబాద్‌లో లక్ష , గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్ష డబుల్ బెడ్ ఇళ్లు కడతానని, అవి పూర్తిచేయకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ గతంలో చెప్పారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు అడిగే  నైతిక హక్కు లేదన్నారు. మూత పడిన పరిశ్రమలకు ఒక్క నయాపైసా కూడా కేటాయించ లేదన్నారు. రైతు రుణమాఫీల  ప్రస్తావన లేదన్నారు. హరితహారానికి నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలు అమలు కావాలంటే  3 లక్షల కోట్లు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర సర్కారు అప్పులపై ఆధారపడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఉన్న 35 వేల కోట్ల బకాయిలపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదని విమర్శించారు. ఉద్యోగులకు, విలేకరులకు వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని కేసీఆర్ చెప్పారని, పథకం ప్రారంభం కాకముందే దానిని ఆరోగ్య శ్రీలో కలిపారన్నారు. హెల్త్‌కార్డ్‌లకు మొండిచెయ్యి చూపిందన్నారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదని, పెరిగిందన్నారు. పెట్రోల్, డీజీల్‌లపై వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ఎత్తేసి, జీఎస్‌టీలో కలిపితే, లీటరు పెట్రోల్‌పై రూ.30ల వరకు తగ్గుతుందన్నారు. కోట్లాది మందికి లాభం చేకూర్చే ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందన్నారు. 

English Title
What is it to say
Related News