ఏది సత్యం.. ఏది అసత్యం

Updated By ManamWed, 02/21/2018 - 04:12
IMAGE

‘డిసెప్టివ్ అడ్వర్‌టైజ్‌మెంట్స్’ (మోసపూరిత ప్రకటనలు) : వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించే చర్య లేదా వ్యక్తీకరణ లేదా కార్యక్రమం లేదా ఉపమానం వంటివి మోసపూరిత ప్రకటనల కిందికి వస్తాయి. ఇలాంటి విషయాల్లో ఫిర్యాదు లు అందినట్టయితే, ఆయా ప్రకటనల్లోని అభ్యంతరకర సమాచారాన్ని ఫిర్యాదుదారు నిరూపించాల్సి ఉంటుంది.

సంశయాత్మకంగా భారతీయ వాణిజ్య ప్రకటనల శైలి

IMAGEవాణిజ్య ప్రకటనలన్నీ చట్టబద్ధమైన అబద్ధాలే’ అని ఆంగ్ల రచయిత హెచ్.జి. వెల్స్ ఏనాడో చెప్పారు. వాణిజ్య ప్రకటనలు అంటే వినియోగదారుల్ని ఆకర్షించి, వారి నుంచి డబ్బు రాబట్టే కళ. నిజానికి ఇది నూటికి తొంభై శాతం డబ్బు తప్ప మరే ఇతర ప్రయోజనాల్ని ఆశించి చేసే పని కాదు. యాక్స్ డియోడరెంట్ (శరీర సుగంధాన్ని పెంచే ద్రవ్యం) తాలూకు వాణిజ్య ప్రకటనలో చెప్పినట్టు, తన జీవితంలో ఎలాంటి  మార్పు జరగలేదని ఒక వ్యక్తి ఆ మధ్య కోర్టుకెక్కాడు. యాక్స్ కంపెనీ వాగ్దాన భంగం చేసిందన్నది ఆ వ్యక్తి అభియోగం. ఆ వాణిజ్య ప్రకటనలో ఫలానా డియోడరెంట్‌ను వాడితే అమ్మాయిలు అబ్బాయిల కోసం క్యూలు కడతారని చెప్పారు. అయితే తాను అదే డియోడరెంట్‌ను వాడినా ఒక్కమ్మాయి కూడా తన వెంట పడలేదని ఆ వ్యక్తి ఆవేదన చెందుతూ కోర్టును ఆశ్రయించాడు! మరో తాజా వాణిజ్య ప్రకటన చూద్దాం, బడికి ఆలస్యమై పోయింది. స్కూలు తలుపులు మూసేశారు. కొందరు పిల్లలు ఆలస్యంగా వచ్చారు. వాళ్ళని స్కూలు వాచ్‌మ్యాన్ లోపలికి రానివ్వలేదు. ఎంత వేడుకున్నా అతను తలుపులు తీయడం లేదు. అంతలో ఒక కుర్రాడు మోకాలు పట్టుకుని, కుంటుతూ వచ్చి, ‘కింద పడిపోయాను....’ అంటూ దీనంగా మొహం పెడతాడు. ఆ పిల్లవాడి మోకాలికి గాయమై ఉంటుంది. వాచ్‌మ్యాన్‌కు జాలేస్తుంది. గేటు తీసి ఆ పిల్లవాణ్ణి లోపలికి రమ్మంటాడు. పిల్లవాడు లోపలికి వచ్చి, గేటు బయట నిలబడి పోయిన మిగతా పిల్లల్ని చూస్తూ, ‘ఫలానా టాటూ వేసుకో..., వెధవని చేసెయ్...!’ అంటూ వెర్రిగా నవ్వుతాడు. అంటే వాడి మోకాలికి తగిలిన దెబ్బ నిజంగా దెబ్బ కాదు, అదొక టాటూ అన్న మాట. ఏదో మిఠాయో, చాక్లెట్టో ... గుర్తు లేదు కానీ, దాన్ని కొంటే దెబ్బల్లాంటి టాటూల్ని ఉచితంగా ఇస్తారట. అయితే, ఇక్కడ గుండెల్లో కలుక్కుమనే విషయం ఏమిటంటే, దెబ్బ తగిలిన పిల్లవాడు కదాని, జాలి తలచి బడిలోకి రానిస్తే, ఐదేళ్ళ పిల్లవాడు ఆ జాలిని, మానవతా దృక్పథాన్ని హేళన చేస్తూ, ‘వెధవని చేసెయ్...’ అనడం మాత్రం ఒకింత ఆలోచనలో పడేస్తుంది. ఒకానొక కంపెనీ తాలూకు నూడుల్స్‌లో హానికారక పదార్థాలున్నట్టు ఇటీవల వెల్లడైన  నేపథ్యంలో పెద్దదుమారమే చెలరేగింది కదా, ఆ సమయంలో ఇతర నూడుల్ కంపెనీలు తమ ఉత్పాదనల్లో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని చెప్పుకుంటూ వాణిజ్య ప్రకటనల్ని తయారు చేయాల్సి వచ్చింది. తమ మీద వచ్చిన ఆరోపణల్ని తప్పని నిరూపించడానికి అప్పటికప్పుడు నడుం బిగించే వాణిజ్య సంస్థలు, తమ వస్తువుల్ని అమ్ముకోవడానికి ప్రకటనల పేరిట నానా అబద్ధాలు ఆడతాయన్నది జగద్వితం. 

భారతీయ వాణిజ్య ప్రకటనల చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలున్నాయి. ఒక వస్తువుకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను కల్పించడంలో వాణిజ్య ప్రకటన ప్రధాన పాత్రను పోషిస్తుంది. వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్ళు, అంతర్జాలం వంటి మీడియా వేదికగా ఈ వాణిజ్య ప్రకటనలు సమాజం ముందుకు వస్తుంటా యి. మార్కెట్ వస్తువుల రూపంలో మన ఆర్థిక సామర్థ్యాన్ని, ఉద్వేగాల రూపంలో మన కుటుంబ సంబంధాల్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది.  
శరవేగం

ఛలోక్తులతో, హాస్యరస స్ఫోరకమైన వ్యక్తీకరణలతో, సున్నితమైన, సునిశితమైన సందేశాలతో పాటు చవకబారు సంస్కృతిని కూడా సమాజం మీద వెదజల్లుతోంది భారతీయ వాణిజ్య ప్రకటనల రంగం. కొన్ని వాణిజ్య ప్రకటనలు పాఠకు ల్ని, ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడుతుంటే, మరికొన్ని వారి సహనాన్ని పరీక్షిస్తుంటాయి. భారతీయ వాణిజ్య ప్రకటనల రంగం చిన్న పాటి వ్యాపారంగా మొదలై, ఇవాళ స్థూల జాతీయ ఆదాయం లో గరిష్టశాతం వాటాను కలిగి ఉండేంత పెద్ద పరిశ్రమగా మారిపోయింది. ఆసియా ఖండంలో చైనా తరువాత భారతీయ వాణిజ్య ప్రకటనల రంగమే శరవేగంతో ముందుకు దూసుకు వెళుతోంది. భారతీయ గరిష్ట జాతీయ ఆదాయంలో వాణిజ్య ప్రకటనల వాటా ప్రస్తుత ఏడాదికి 0.45 శాతానికి పెరిగింది. దేశంలో వాణిజ్య ప్రకటనల రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా పలు అవకాశాల్ని కల్పిస్తోంది. ప్రకటనల మీద పెట్టే ఖర్చు ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి ఉపయోగపడుతుందన్న భావనతో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రంగానికి అనుకూలంగా తన విధివిధానాల్ని రూపొందిం చుకుంది. వాణిజ్య ప్రకటనల ఆదాయంలో వార్తాపత్రికలు 41.2 శాతాన్ని, టెలివిజన్ రంగం 38.2 శాతాన్ని, డిజిటల్ ప్రకటనల రంగం 11 శాతా న్ని, రేడియో, సినిమా, తదితర మాధ్యమాలు పదిశాతాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ డిజిటల్ వాణిజ్య ప్రకటనల ఆదాయం 2020 నాటికి 25,500 కోట్ల రూపాయలకు పెరగనున్నదని కొన్ని అంచనాల్లో తేలింది. ఆన్‌లైన్ వాణిజ్య ప్రకటనల ఆదాయం 2013 నుంచి 2018 నాటికి పదివేల కోట్ల రూపాయలకు పెరిగింది. 

182 దోషాలు
పెరుగుతున్న ప్రకటనల ఆదాయాన్ని చూసి సంతోషపడాలా, లేక తరుగు తున్న విలువల గురించి బాధపడాలా? భారతీయADD వాణిజ్య ప్రకటనల నియంత్రణ మండలిగా చెప్పుకోదగిన ‘భారతీయ వాణిజ్య ప్రకటనల ప్రమాణాల మండలి’ (ఎఎస్‌సిఐ) గత ఏడాది నవంబర్ నెలలో 182 వాణిజ్య ప్రకటనల్ని మోసపూరిత ప్రకటనలుగా తేల్చింది. వీటిలో కెల్లాగ్స్, ఇమామి, కెవిన్ కేర్, ఏషియన్ పెయింట్స్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, హోండాకార్స్ ఇండియా, రిలయెన్స్ రీటైల్ వంటి హేమాహేమీ వాణిజ్య సంస్థల తాలూకు ప్రకటనలు కూడా ఉన్నాయి. ఎఎస్‌సిఐకి చెందిన ఫిర్యాదుల విభాగం ‘కస్టమర్ కంప్లైంట్స్ కౌన్సిల్’ (సిసిసి) నవంబర్, 2017లో 243 ఫిర్యాదుల్ని స్వీకరించింది. ఎఎస్‌సిఐ ఏకమొత్తంగా స్వీకరించిన 243 ఫిర్యాదుల్లో 152 వాణిజ్య ప్రకటనల్ని సుమోటోగా స్వీకరించి, విచారణ జరిపింది. ఎఎస్‌సిఐ విచారణ జరిపిన ఫిర్యాదుల్లో ఆరోగ్య రంగానికి సంబంధించిన 65 ప్రకటనలు, విద్యారంగానికి సంబంధించిన 96 ప్రకటనలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన మూడు ప్రకటనలు, ఆహార, పానీయాలకు సంబంధించిన ఏడు ప్రకట నలు, ఇతర రంగాలకు సంబంధించిన 11 ప్రకటనలు ఉన్నాయి. ఫేస్‌బుక్ యాప్‌కు సంబంధించిన ఒక ప్రకటన మీద కూడా ఫిర్యాదు వచ్చింది. ఫేస్‌బుక్ యాప్ అన్నివిధాలా అందు బాటులో ఉందని చెప్పినప్పటికీ, ఆ యాప్ కేవలం వెబ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉందని తేలింది. ప్రకటనలో చెప్పిన విషయం అసత్యమని తెలుస్తోంది. కెల్లాగ్స్‌కు సంబంధించిన ఓట్స్, స్పెషల్ కె వాణిజ్య ప్రకటనలు కూడా ఎఎస్‌సిఐ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలింది. ‘ఇన్‌వర్టర్ లీనియర్’ సౌలభ్యంతో లభించే ఎల్‌జి రిఫ్రెజిరేటర్లలో వారం రోజుల పాటు కాయగూరల్ని నిల్వ చేసుకోవచ్చునంటూ చేసిన ప్రకటన కూడా అసత్యాల పుట్ట అని తేలింది. ఎందుకంటే ఈ సౌలభ్యం లేని ఫ్రిజ్‌లలో కూడా కాయగూరలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఏషియన్ పెయింట్స్ రాయల్ అట్మోస్ వాణిజ్య ప్రకటనలో గదిలోని గాలి కాలుష్యాన్ని ఆ పెయింట్ హరించి వేస్తుందని చెప్పారు. అది నిజానికి ఆచరణ సాధ్యం కాని విషయమని ఎఎస్‌సిఐ అభిప్రా యపడింది. రోజంతా సగటు మనిషి తన జీవనపోరాటంలో అలసిపోయి సేదతీరేం దుకు ఆధారపడేది టీవీ, సినిమా, తరువాత ఆన్‌లైన్ బ్రౌజింగ్‌ల వంటి సౌకర్యాల మీదే. కానీ ఈ వేదికలన్నీ ఇప్పుడు వాణిజ్య సంస్థలు తమ ఉత్పాదనల గురించి బాకాలు వాయించుకోవడానికి ప్రకటనల అడ్డాలుగా మారిపోతున్నాయి. రాజ కీయ పార్టీలు కూడా ఓట్ల పండుగ నాడు చేసిన వాగ్దా నాల్ని గాలికి వదిలేయడంలో కాకలు తీరిన అనుభవాన్ని ప్రదర్శిస్తున్నాయి. ‘సత్యం’ అనేది ఒక సంస్కారం. వ్యవస్థ లోని అణువణువూ ఆ సంస్కారం తో నిండితే తప్ప ఇక్కడ వాగ్దానా లకు అసలైన ప్రయోజనం సిద్ధించ దు. 
- కల్కి

సృ‘జనా’త్మకం
IMAGEసృజనాత్మకత కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందించే వాణిజ్య ప్రకటనల్లో వెదకడం నేతిబీర కాయలో నెయ్యి కోసం వెదకడం వంటిదే! అయినప్పటికీ కొన్ని వాణిజ్య ప్రకటనలు కొత్తతరహా ఆలోచనా విధానాన్ని ప్రజలకు పరిచయం చేయడం ముదావహమే. డబ్బు కోసం విడుదల చేసే వాణిజ్య ప్రకటనల్లో కొన్ని మనసును తాకే భావవ్యక్తీకరణను కలిగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ‘పాపా కి పప్పీ’ ప్రకటననే తీసుకుంటే, తల్లిదండ్రులు వృద్ధులైన తరువాత వారికి తమ పిల్లలే తల్లిదండ్రులవ్వాల్సిన అవసరాన్ని చెబుతుందీ వాణిజ్యప్రకటన. ‘డాబర్ వాటిక’ వారి ‘బేర్ అండ్ బ్యూటిఫుల్’ ప్రకటనలో ఒక మహిళా కాన్సర్ రోగి జబ్బు నుంచి కోలుకున్నప్పటికీ, కిమోథెరపీ వల్ల జుట్టంతాimage రాలిపోగా, ఆమెను తోటివారు ఎంత ఆప్యాయంగా స్వీకరిస్తారో ఈ వాణిజ్య ప్రకటన చెబుతుంది. అలాగే ‘నిర్మా’ వారి అంబులెన్స్ ప్రకటన కూడా మహిళల్ని సబలలుగా చూపుతుంది. ఏరియల్ వాషింగ్ పౌడర్ వాణిజ్యప్రకటనలో బట్టలు ఉతకడమన్నది కేవలం మహిళల పని మాత్రమే కాదని, అలాంటి పనుల్లో లైంగిక వివక్షకు తావులేదని చెబుతుంది. అలాగే సామాజిక సమస్యల మీద ప్రతిస్పందిస్తూ విడుదల చేసే ప్రకటనల్లో నిజమైన సృజనాత్మకత మనకు కళ్ళకు కడుతుంది.

 

మార్కెట్‌లో లభిస్తున్న వస్తువుల గురించి ఇవాళ వాణిజ్య ప్రకటనల ద్వారానే సమాచారం అందుతున్నప్పటికీ, ఆ సమాచారం తప్పుదోవ పట్టించేదిగానే ఉండడం శోచనీయం. ఇది ఎంతటి సామాజిక రుగ్మతలకు దారితీస్తుందో ఇక్కడ మానసిక నిపుణులు, సామాజిక కార్యకర్తల మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అబద్ధాలే!

- డాక్టర్ వీరేందర్, సైకాలజిస్ట్
 

ముద్ర: ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాల మీద వాణిజ్య ప్రకటనల ప్రభావం ఎలా ఉంటుందో చెబుతారా?
RAVEENDARడాక్టర్ వీరేందర్: సమాజంలో అత్యధికులు మార్కెట్‌లో లభించే వస్తువుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి వాణిజ్య ప్రకటనల మీదే ఆధారపడుతున్నారు. అయితే ముఖ్యంగా యువత..., అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ప్రకటనల మోజులో పడి శారీరక సౌందర్యమే నిజమైన సౌందర్యంగా నమ్ముతున్నారు. రోజంతా తమ శరీరాలు ప్రకటనల్లో చూపించిన విధంగా అందంగా లేవని అసంతృప్తి చెందుతున్నారు. వాణిజ్య ప్రకటనలు ప్రజల్ని భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. అందుకే మేము కొన్ని ప్రత్యేక రంగాల్లో ఇలాంటి ప్రకటనల్ని నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఉదాహరణకు పాలిచ్చే తల్లుల విషయమే తీసుకోండి, అందం గురించిన అవాస్తవాల్ని ఇలా ప్రకటనల ద్వారా వ్యాప్తి చేయడం వల్ల, పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందడం లేదు. దాంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.


అమానవీయం!
- దేవి, సామాజిక కార్యకర్త

 

ముద్ర: వాణిజ్య ప్రకటనల్లో మానవీయ, సామాజిక కోణాలు ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయి?
దేవి
: నిజానికి వాణిజ్య ప్రకటనలన్నవే మానవీయ విలువలకు వ్యతిరేకమైనవి. ఇవి DEVIకేవలం సరుకు అమ్మకాలకు మాత్రమే సంబంధించినవి. అయితే తమ వస్తువుల్ని అమ్ముకోవడం కోసం మనుషుల మనసులో ఏదో ఒక మూలను తాకే అంశాల్ని తీసుకుని, ఆ భావోద్వేగాల్ని కూడా దుర్వినియోగ పరుస్తున్నారు. ఉదాహరణకు వజ్రాల వ్యాపారానికి సంబంధించిన ఒక వాణిజ్య ప్రకటనలో ఒక గర్భవతికి భర్త వజ్రాల్ని బహూకరిస్తాడు. చూడ్డానికి ఇదంతా మనుషుల మధ్య ప్రేమానుబంధాలకు సంబంధించిన సానుకూల వ్యవహారంగానే కనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రకటనల ద్వారా వీళ్ళు ప్రేమానుబంధాల్నే ఏకమొత్తంగా అవమానిస్తున్నారు. వస్తువును దాని గుణగణాలతో అమ్మడం మానేసి, మానవసంబంధాల్ని వ్యాపార వస్తువును చేయడం మాత్రం అమానవీయం.

తప్పుడు సందేశాలే!
- రమణారెడ్డి, ప్రముఖ చిత్రకారులు, శిల్పి,
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు

 

ముద్ర: సృజనాత్మకత పేరుతో లక్షలాది వాణిజ్యప్రకటనల్ని రూపొందిస్తున్నారు. అయితే ఇదంతా సామాజిక బాధ్యతతోనే జరుగుతోందా?
RAMANA REDDYరమణారెడ్డి:
సృజనాత్మకతకు రెండు ముఖాలుంటాయి. దాన్ని మంచికి, చెడుకు కూడా ఉపయోగించుకునే వీలుంది. అయితే ఆర్టిస్టు లేదా వాణిజ్య ప్రకటనల రూపకర్త తన చేతిలో ప్రతిభ ఉంది కదాని సమాజానికి తప్పుడు సందేశాలు ఇవ్వకూడదు. తన సృజనాత్మకతను సమాజంలోని అత్యధిక ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగించకూడదు. సృజనాత్మకత అన్నది ఒక శక్తిమంతమైన ఆయుధం. అందుకే ఇలాంటి సృజనకారులకు ప్రజల పట్ల బాధ్యత ఉండితీరాలి. ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు. ఉన్నదాని కంటే అతిగా చూపించడం, ప్రలోభ పెట్టడం వంటివి చేయకూడదు. తాము ఏ వస్తువు గురించి చెబుతున్నారో, దాని గుణాల్ని, గొప్పతనాన్ని చెబితే చాలు. తప్పుడు సందేశాలు ఇవ్వకూడదు.
 

ఇంటర్వూలు : పసుపులేటి గీత 

 

 

English Title
What's the truth .. what's wrongRelated News