ధరలు తగ్గాయ్...!

Updated By ManamMon, 04/16/2018 - 18:12
representational
  • దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం

representationalన్యూఢిల్లీ: సామాన్యుడికి నిత్యావసరాలైన కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, చక్కెర వగైరావగైరా ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పరిస్థితి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. వాటి ధరలు తగ్గిన ఫలితంగా విపణిలో టోకు (హోల్‌సేల్), రిటైల్ (చిల్లర) ద్రవ్యోల్బణాలు కూడా దిగొచ్చాయి. పోయిన నెల (ఫిబ్రవరి), పోయిన ఏడాది ఇదే మార్చితో పోలిస్తే టోకు ద్రవ్యోల్బణం కాస్తంత ఉపశమించింది. ఫిబ్రవరి మాసంలో 2.48 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం (టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం) మార్చిలో కాస్తంత తగ్గి 2.47 శాతం వద్ద నిలిచింది. విపణిలో ఆహార పదార్థాల ధరలు భారీగా పడిపోతుండడంవల్లే టోకు ద్రవ్యోల్బణం తగ్గింది. ఇక, గత ఏడాది ఇదే మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 5.11 శాతంగా ఉంది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది టోకు ద్రవ్యోల్బణం భారీగానే తగ్గిందని చెప్పాలి. సోమవారం దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ నివేదికను విడుదల చేసింది.

ప్రభుత్వ నివేదిక ప్రకారం మార్చిలో ఆహార పదార్థాల ధరలు సగటున 0.29 శాతం పడిపోయాయి. ఫిబ్రవరిలో 0.88 శాతం పడిపోతే.. మార్చికి వచ్చేటప్పటికి ధరల పరిస్థితులు చాలా మారిపోయాయి. అందులో భారీగా తగ్గినవి కొన్ని అయితే.. ఓ మోస్తరుగా ధరలు తగ్గినవి మరికొన్ని ఆహార పదార్థాలున్నాయి. టోకు మార్కెట్లో పప్పుధాన్యాల ధరలు 20.58 శాతం మేర పడిపోయాయి. కూరగాయల ధరలు 2.70 శాతం మేర తగ్గాయి. గోధుమలు 1.19 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 0.82 శాతం మేర దిగొచ్చాయి. ఇక, ఉల్లి పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. 42.22 శాతం మేర ఉల్లి ధరలు పడిపోయాయి. ఆలుగడ్డల ధర 43.25 శాతం మేర తగ్గిపోయింది. ఇక, చక్కెర కూడా 10.48 శాతం పడిపోయింది. వీటి ధరలు పడిపోయినా.. చమురుకు సంబంధించి మాత్రం ధరలు, ద్రవ్యోల్బణం చుక్కల్లోనే ఉందని చెప్పాలి. ఫిబ్రవరిలో ‘చమురు, ఇంధనం’ వర్గానికి సంబంధించి 3.81 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం.. మార్చిలో 4.70 శాతానికి ఎగబాకింది.

చిల్లర (రిటైల్) ద్రవ్యోల్బణమూ అంతే..
ఇటు టోకు ద్రవ్యోల్బణంతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఫిబ్రవరిలో 4.44 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.28 శాతానికి దిగొచ్చింది. ఐదు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోయినా.. ఆర్బీఐ నిర్దేశించుకున్న దాని కన్నా ఎక్కువగానే నమోదైందని వాణిజ్య శాఖ తన నివేదికలో పేర్కొంది. కాగా, గత ఏడాది మార్చితో (3.89 శాతం) పోలిస్తే ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగానే రికార్డయింది. రిటైల్‌కు సంబంధించి కూరగాయల ధరలు 11.7 శాతం దిగొచ్చాయి. ఫిబ్రవరిలో 17.57 శాతం తగ్గగా ఇప్పుడు ధరలు దాదాపు 6 శాతం పడిపోయాయి. 

English Title
WholeSale Inflation Deflated
Related News