ఓ మ‌హిళా.. నీకు జోహార్లు (విమెన్స్ డే స్పెష‌ల్‌)

Updated By ManamWed, 03/07/2018 - 23:54
women's day spl article

women's day spl''మానవ జాతి మ‌నుగ‌డ‌కే ప్రాణం పోసింది మ‌గువ‌.. త్యాగ‌ములో అనురాగ‌ములో త‌ర‌గ‌ని పెన్నిధి మ‌గువ‌..'' అంటూ మ‌హాన‌టి సావిత్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'మాతృదేవ‌త‌'లో ఓ పాట ఉంటుంది. మ‌గువ గొప్ప‌త‌నం గురించి చాటి చెప్పే ఆ పాట అప్ప‌టికి, ఇప్ప‌టికి, ఎప్ప‌టికి నిత్యనూత‌న‌మే. మ‌గువ‌లేని మాన‌వ జాతిని ఊహించ‌డం ఎంత‌ క‌ష్టమో ఆ పాట చెప్ప‌క‌నే చెబుతుంది. అంత‌టి విశిష్ట‌త ఉన్న‌ మ‌గువ‌కు ప్ర‌త్యేకంగా ఒక రోజు ఏమిటి? ప‌్ర‌తి రోజు కూడా వారిదే క‌దా! అయితే.. 364 రోజుల పాటు ఆమె చేసిన సేవ‌ల‌ను రివ్యూ వేసుకోవ‌డం కోసమే.. మ‌న పెద్ద‌వాళ్ళు ఇలా సంవ‌త్స‌రంలో ఒక రోజు వారి కోసం కేటాయిస్తే బావుంటుందేమోన‌ని ఆలోచించి ఉండొచ్చు. ఏదేమైనా.. రోజులు మారినా.. త‌రాలు మారినా.. మ‌హిళ ఎప్పుడూ ఉన్న‌త స్థానంలోనే ఉంటుంది. ఇక.. ప్ర‌తి మ‌గాడి వెనుక ఓ స్త్రీ ఉంటుంద‌న్న‌ట్టే.. ప్ర‌తి సినిమా విజ‌యంలోనూ క‌థానాయిక పాత్ర ఎంతో కొంత ఉంటుంది. క‌థానాయ‌కుడు ఎంత‌టి స్టారాధిస్టార్ అయినా.. అస‌లు క‌థానాయిక పాత్ర లేకుండా విజ‌యాలు అందుకున్న వైనాలు అత్యంత‌ అరుదు. అదే.. క‌థానాయ‌కుడు లేకుండా క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాలు విజ‌యాలు అందుకున్న వైనాల‌కు లెక్కే లేదు. దీన్నిబ‌ట్టి.. క‌థానాయిక లేని సినిమాల‌ను ఊహించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా.. తెలుగు తెర‌పై సంద‌డి చేసిన‌ క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల గురించి ఓ సారి గుర్తు చేసుకుందాం..

తెలుగు సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి క‌థానాయిక‌కు ప్రాముఖ్య‌త‌నిచ్చిన‌ ఎన్నో సినిమాలు వెండితెర‌పై అల‌రించాయి. నాటి 'మాల‌పిల్ల' నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'అ!' వ‌ర‌కు క‌థానాయిక పాత్ర చుట్టూ తిరిగే సినిమాలు తెలుగునాట కోకొల్ల‌లు.

అలాంటి పాత్ర‌ల‌కు చిరునామాగా..

క‌థానాయిక చుట్టూ తిరిగే క‌థ‌లు.. తెలుగు సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్నో వ‌చ్చాయి. వ‌స్తున్నాయి. అలాంటి పాత్ర‌ల‌కు చిరునామాగా నిలిచిన తార‌లు ప్ర‌తి త‌రంలోనూ ఉన్నారు. తొలి త‌రంలో సావిత్రి, భానుమ‌తి, జ‌మున‌, అంజ‌లీ దేవి త‌దిత‌రులు త‌మ న‌ట‌నా ప‌టిమ‌తో ఇలాంటి పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. 'మిస్స‌మ్మ‌, దేవ‌త‌, మాతృదేవ‌త‌, చివ‌ర‌కు మిగిలేది' త‌దిత‌ర చిత్రాలు.. సావిత్రి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయాయంటే.. ఆ పాత్ర‌ల్లో ఆమె ఎంత‌లా ఒదిగిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలా ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని పాత్ర‌లు చేసి.. సాధార‌ణ న‌టి స్థాయి నుంచి మ‌హాన‌టి స్థాయికి ఆమె ఎదిగారు. ఇక‌ 'మ‌ల్లీశ్వ‌రి' చిత్రంలో భానుమ‌తి అభిన‌యం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. 'సువ‌ర్ణ సుంద‌రి, ల‌వ‌కుశ' త‌దిత‌ర చిత్రాల‌తో అంజ‌లీ దేవి మెప్పించారు. 'బంగారు పాప, మంగ‌మ్మ శ‌ప‌థం' చిత్రాల‌లో జ‌మున త‌న అభిన‌యంతో మెప్పించారు. ఆ త‌రువాత కాలంలో 'జీవ‌న జ్యోతి, కృష్ణ‌వేణి, గంగ మంగ‌, గోరంత దీపం' వంటి సినిమాల‌లో త‌న న‌ట‌న‌తో క‌థానాయిక స్థాయిని పెంచారు వాణిశ్రీ‌. అలాగే 'కాలం మారింది, శార‌ద' వంటి చిత్రాలు న‌టి శార‌ద కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయాయి. ఆ త‌రువాతి కాలంలో ల‌క్ష్మి, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీ‌దేవి, విజ‌య‌శాంతి, భాను ప్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌, ఆమ‌ని, సౌంద‌ర్య‌, రోజా, రాశి, భూమిక‌, ఛార్మి, అనుష్క, నిత్యా మీన‌న్‌ వంటి తార‌లు నాయికా ప్రాధాన్య‌మున్న చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

'నంది' అలాంటి సినిమాల‌కే..

స‌మైక్యాంధ్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా ఇచ్చే ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం నంది.. ఎక్కువ‌గా క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాల‌లోని పాత్ర‌ల‌కే వ‌రించేది. 'జ్యోతి, ఇది క‌థ కాదు' చిత్రాల‌తో జ‌య‌సుధ‌.. 'అంతులేని క‌థ' చిత్రంతో జ‌య‌ప్ర‌ద‌.. 'పంతుల‌మ్మ‌, శ్రావ‌ణ మేఘాలు' చిత్రాల‌తో ల‌క్ష్మి.. 'స్వాతి'తో సుహాసిని.. 'ప్ర‌తిఘ‌ట‌న‌, భార‌త‌నారి, క‌ర్త‌వ్యం, ఒసేయ్ రాములమ్మ' చిత్రాల‌తో విజ‌య‌శాంతి.. 'స్వ‌ర్ణ క‌మ‌లం'తో భానుప్రియ‌.. 'రాజేశ్వ‌రి క‌ళ్యాణం'తో మీనా.. 'మిష్ట‌ర్ పెళ్ళాం'తో ఆమ‌ని.. 'ఆమె'తో ఊహ‌.. 'ప‌విత్ర బంధం'తో సౌంద‌ర్య‌.. 'స్వ‌ర్ణ‌క్క‌'తో రోజా.. 'ప్రేమించు'తో ల‌య‌.. 'మిస్స‌మ్మ‌'తో భూమిక‌.. 'ఆనంద్‌'తో క‌మ‌లిని ముఖ‌ర్జీ.. ఆయా సినిమాల్లో ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు చేసే నంది అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

క‌థానాయికల ద‌ర్శ‌కులు..

కొంద‌రు ద‌ర్శ‌కుల సినిమాలు చూస్తే.. క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు తోస్తుంది. అలాంటి వారిలో బాపు, కె.విశ్వ‌నాథ్‌, కె.బాల‌చంద‌ర్‌, ముత్యాల సుబ్బ‌య్య‌, క్రాంతి కుమార్‌, కోడి రామ‌కృష్ణ‌, ఎస్వీ కృష్ణారెడ్డి, శేఖ‌ర్ క‌మ్ముల త‌దిత‌రుల‌ను ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు. విశ్వ‌నాథ్ సినిమాల్లోని పాత్ర‌ల‌ను గ‌మ‌నిస్తే.. 'శార‌ద‌, జీవ‌న జ్యోతి, సీతామాల‌క్ష్మీ, స్వ‌ర్ణ క‌మ‌లం' త‌దిత‌ర చిత్రాల‌లో ఆయ‌న క‌థానాయిక‌ని చూపించిన తీరు మ‌హిళా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. 'ముత్యాల ముగ్గు, గోరంత దీపం, పెళ్ళి పుస్త‌కం, మిష్ట‌ర్ పెళ్ళాం' చిత్రాల‌లో క‌థానాయిక పాత్ర‌ల‌ని త‌న‌దైన శైలిలో ఆవిష్క‌రించారు బాపు. ఇక కె.బాల‌చంద‌ర్ సినిమాల్లోని క‌థానాయిక‌ల పాత్ర‌లు.. నిజజీవితంలో మ‌న‌కు ఎదురుప‌డే పాత్ర‌ల్లానే ఉంటాయి. 'అంతులేని క‌థ‌, ఇది క‌థ కాదు, మ‌రో చ‌రిత్ర, ఆడ‌వాళ్ళూ మీకు జోహార్లు' ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. సెంటిమెంట్ చిత్రాల స్పెష‌లిస్ట్ ముత్యాల సుబ్బ‌య్య.. 'అమ్మాయి కాపురం, ప‌విత్ర‌ బంధం, పెళ్ళి చేసుకుందాం, గోకులంలో సీత‌, స్నేహితులు' చిత్రాల్లో నాయిక‌ల పాత్రల‌ని తీర్చిదిద్దిన తీరు ఆలోచింప‌జేసేలా ఉంటుంది. ఇక స్త్రీ ప‌క్ష‌పాతి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతి కుమార్.. 'స్వాతి' (త‌ల్లికి పెళ్ళి చేసే కూతురి క‌థ‌), స్ర‌వంతి, గౌత‌మి, సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు (తండ్రి చ‌నిపోయినా.. ఆ విష‌యాన్ని తాత‌య్య‌తో చెప్ప‌కుండా త‌న‌లో దాచుకుని కుమిలిపోయే పాత్ర‌), రాజేశ్వ‌రి క‌ళ్యాణం, అరుంధ‌తి, 9 నెల‌లు (భ‌ర్త ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం అద్దె గ‌ర్భం దాల్చే స్త్రీ క‌థ‌) వంటి విభిన్న చిత్రాల‌తో అల‌రించారు. ఇక కోడి రామ‌కృష్ణ విష‌యానికి వ‌స్తే.. 'త‌రంగిణి', త‌లంబ్రాలు, శ్రీ‌నివాస క‌ళ్యాణం (బావ‌పై ఉన్న ప్రేమ‌తో.. ఎంత‌వ‌ర‌కైనా వెళ్లే మ‌ర‌ద‌లు పాత్ర‌), అమ్మోరు, దేవి, అరుంధ‌తి వంటి క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాల‌తో అబ్బుర‌ప‌రిచారు. శుభ‌ల‌గ్నం (డ‌బ్బుపై ఆశ‌తో.. భ‌ర్త‌ను అమ్ముకుని.. త‌రువాత ప‌శ్చాత్తాపం చెందే పాత్ర‌), ఆహ్వానం (భ‌ర్త అడిగాడ‌ని విడాకులు ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డి.. ఆ విడాకుల మ‌హోత్స‌వానికి పెళ్ళికి వ‌చ్చిన వారిని ఆహ్వానించే పాత్ర‌), దీర్ఘ సుమంగ‌ళీభ‌వ (సినిమాలంటే ఉన్న ఆస‌క్తితో భ‌ర్త‌ని విడిచి వెళ్ళి.. తిరిగి భ‌ర్త ప్రేమ కోసం ఆరాట‌ప‌డే పాత్ర‌) వంటి చిత్రాల‌తో ఎస్వీ కృష్ణారెడ్డి మ‌హిళా ప్రేక్ష‌కులకు చేరువ‌య్యారు. ఇక ఆనంద్ (వెంట‌వెంట‌నే నిర్ణ‌యాలు తీసుకునే క‌థానాయిక పాత్ర‌), గోదావ‌రి, ఫిదా చిత్రాల‌తో ఈ త‌రంలో శేఖ‌ర్ క‌మ్ముల క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల‌కు చిరునామాలా నిలిచారు. వీరితో పాటు కె.రాఘవేంద్ర‌రావు (జ్యోతి, క‌ల్ప‌న‌, ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు, ఆమె క‌థ‌), దాస‌రి నారాయ‌ణ రావు (శివ‌రంజ‌ని, కంటే కూతుర్నే క‌ను), ఎ.కోదండ‌రామి రెడ్డి (న్యాయం కావాలి), ఎ.మోహ‌న గాంధీ (మౌన పోరాటం, క‌ర్త‌వ్యం), సింగీతం శ్రీ‌నివాస రావు (మ‌యూరి).. ఇలా ఎంద‌రో ద‌ర్శ‌కులు త‌మ త‌మ చిత్రాల్లో అద్భుత‌మైన క‌థానాయిక పాత్ర‌లు సృష్టించి మ‌హిళ‌ల ప‌ట్ల త‌మ‌కున్న‌ గౌర‌వాన్ని చాటుకున్నారు.

గ‌తంతో పోలిస్తే.. క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాలు ఇటీవ‌ల కాలంలో త‌క్కువగానే వ‌స్తున్న‌ప్ప‌టికీ.. అలా వ‌స్తున్న చిత్రాల‌కి ఆద‌ర‌ణ త‌క్కువేమీ కాదు. ఇటీవ‌ల కాలంలో అలా వ‌చ్చిన 'అనుకోకుండా ఒక రోజు, అన‌సూయ‌, అరుంధ‌తి, భాగ‌మ‌తి, అ!' త‌దిత‌ర చిత్రాలు ఈ విష‌యాన్ని నిరూపించాయి. మున్ముందు కూడా ఇలా కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌తో స్త్రీ ఔన్న‌త్యాన్ని చెప్పే సినిమాలు మ‌న ద‌ర్శ‌కులు మ‌రిన్ని రూపొందించాల‌ని మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కోరుకుందాం.

English Title
women's day spl article
Related News