మీ ఇష్టం తమ్ముళ్లూ..

Updated By ManamSun, 09/09/2018 - 00:16
Chandra Babu
  • పొత్తులపై స్థానిక నేతలదే అధికారమన్న చంద్రబాబు

  • పార్టీకి, ప్రజలకు లబ్ధి చేకూరేలా ముందుకు పోవాలని సూచన

  • పూర్తి సహకారమందిస్తానని టీడీపీ అధినేత వెల్లడి

Chandra Babuహైదరాబాద్: మూడున్నర దశాబ్దాలకుపైగా ఉప్పు, నిప్పులా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఉమ్మడి శత్రువు కేసీఆర్‌ను ఓడించేందుకు.. టీడీపీతో పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటి స్తుండగా, టీటీడీపీ నాయకులు సైతం అదే అభిలాషను తమ నాయకుడు చంద్రబాబు ఎదుట వెల్లడించారు. ప్రజ లకు, పార్టీకీ ఏది మంచైతే అదే నిర్ణయం తీసుకోండని తమ్ముళ్లకూ బాబు నిర్ణయాధికారం కట్టబెట్టారు. తెలంగాణ ప్రజలకు, పార్టీకీ లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుని సమిష్టి గా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో పోరాటానికి తన పూర్తి సహకారమందిస్తానని భరోసానిచ్చారు. శని వారం, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుని హోదాలో చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగున్నరేండ్లలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని బాబు ప్రశ్నించారు. 2019లో రావాల్సిన ఎన్నికలు ఇప్పుడే రావడానికి గల కారణమేంటో ప్రజలు ఆలోచించాల న్నారు.  పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఎవరికీ ప్రయోజనముండదని హితవు పలికారు. తెలంగాణలో ఎన్నికలప్పుడొచ్చినా ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగు ణంగా ముందుకెళ్లాలన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడం చారిత్రక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయంతో అందరికీ సీట్లు రాకపోవచ్చుగానీ, పార్టీని నమ్ముకున్న వాళ్లందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడండి
విభజన హామీలను అమల్జేయకుండా తెలు గు రాష్ట్రాలను మోసం చేసిన బీజేపీకి సహకరిం చడం న్యాయమో, అన్యాయమో తెలుగు ప్రజలు ఆలోచించాలని బాబు సూచించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పానే తప్ప, తెలంగాణ విభజనను తానెప్పుడూ వ్యతిరేకిం చలేదన్నారు. తెలుగు జాతి ప్రయోజనాలకు కోసం నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడా మని, అనంతరరం ప్రజాప్రయోజనార్థం బీజేపీ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. న్యాయం చేస్తారని నాలుగేండ్లు ఎదురు చూశామన్నారు. న్యాయం చేయకపోగా, అన్యాయం చేసేందుకు ఎన్డీఏ కుట్ర చేయడంతో పొత్తులు తెగదెంపులు చేసుకున్నామన్నారు. పార్లమెంటు సాక్షిగా తనకు, కేసీఆర్‌కు మధ్య తగాదా పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల శంఖారావం
తెలుగుదేశం సర్వ సభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్నికల శంఖారావం మోగించాల్సిందిగా ఓ కార్యకర్త చంద్రబాబుకు శంఖువునందించారు. శంఖారావం పూరించాల్సిందిగా బాబు, రమణకు శంఖువు అందించబోయారు. రమణ సున్నితంగా నిరాకరిస్తూ బాబునే శంఖారావం పూరించాలని కోరారు. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహిస్తున్నందున రమణ పూరించడమే సబబుగా ఉంటుందని చెప్పిన బాబు, అందుకు ఆయన్ను ఒప్పించి చేతిలో శంఖువు పెట్టారు. అనంతరం రమణ ఆనందంగా శంఖువు ఊది ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు.  కేసీఆర్ బలవంతంగా టీడీపీ నాయకులను లాక్కున్నా, పార్టీ కేడర్ చెక్కుచెదరలేదన్నారు. టీడీపీ మద్దతు లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ ఆంధ్ర పార్టీ కాదని, అందరి పార్టీ అని రమణ పేర్కొన్నారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి పన్జేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు నామా నాగేశ్వర్‌రావు, దేవేందర్‌గౌడ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, నన్నూరి నర్సిరెడ్డి, బండ్రు శోభారాణి తదితరులు మాట్లాడారు.

పొత్తులపై సమాలోచన
ఇటీవల మరణించిన నందమూరి హరికృష్ణ దశదిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నా రు. అనంతర, టీటీడీపీ నేతలతో బాబు లేక్ వ్యూ అతిథి గృహంలో పొత్తులపై సమాలోచనలు చేశారు. వామపక్షాలు, కోదండరాం వైఖరిపై ఆరా తీశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని నాయకులు బాబుకు వివరించారు. నాయకులు వెళ్లినా, కేడర్ బలంగా ఉందని చెప్పారు. నియోజకవర్గాలవారీగా పార్టీకి వచ్చే ఓట్ల శాతాన్ని అంచనా వేసి బాబుకు నివేదించారు. అయితే, మరోసారి సమావేశమయ్యాక బాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

English Title
Like your brother
Related News