జగన్‌కు జైకొడుతున్న ఉత్తరాంధ్ర!

Updated By ManamMon, 09/03/2018 - 17:30
YSR congress party Gets More Strength In Uttarandhra
  • బీసీల అండ.. టీడీపీ కంచుకోటకు బీటలు

  • సర్వేలతో మంత్రులు, ఎమ్మెల్యేలో గుబులు

  • మూడు జిల్లాల్లో గణనీయంగా బీసీల ప్రభావం

  • విభజన తర్వాత న్యాయం జరగలేదన్న భావన

  • నామినేటెడ్ పదవుల్లోనూ రిక్తహస్తమేనా?

  • బీసీ నేతలు.. కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి

  • పాదయాత్రకు స్వచ్ఛందంగా వెళ్తున్న జనం

  • నాటి వైఎస్సార్ పాదయాత్ర తరహాలో స్పందన

  • కాపు రిజర్వేషన్లపై ప్రకటనతో బీసీలు ఖుషీ

YSR congress party Gets More Strength In Uttarandhra

శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర ఓటరు ఈసారి ఎటువైపు మొగ్గుతున్నాడు? నిన్న మొన్నటివరకు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ మూడు జిల్లాలు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయా? లేదా పరిస్థితి ఏమైనా మారిందా? దేశమంతా ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో ఉత్తరాంధ్రలో పరిస్థితిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందిరాగాంధీ హత్య జరిగినపుడు రాజీవ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి దేశమంతా ప్రభంజనం చూపించినా.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మాత్రం టీడీపీకే పట్టం గట్టాయి. 

ఈ మూడు జిల్లాల్లో బీసీ జనాభా ఎక్కువ. వెలమ, కాళింగ, యాదవ, మత్స్యకార సామాజికవర్గాలదే ఆధిపత్యం. మరోవైపు ఇక్కడి తూర్పుకాపు సామాజిక వర్గం కూడా బీసీల కిందకే వస్తోంది. వీళ్లంతా ఇన్నాళ్లూ సైకిల్‌పైనే సవారీ చేశారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల నాడి పట్టారు.

దీంతో ఈ మూడు జిల్లాల్లోని బీసీలు అటు మొగ్గు చూపిస్తున్నారు. ఉభయగోదావరుల్లో పాదయాత్ర దాదాపు పూర్తియిపోతోందనగా.. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన బీసీలను ఆకట్టుకుంది. ఇక జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఇచ్ఛాపురంతో పూర్తికానుండటం.. ఇచ్ఛాపురం వాసులకు జగన్ తండ్రి రాజశేఖరరెడ్డితోనూ.. ఇప్పుడు జగన్‌తోనూ మంచి సంబంధాలు ఉండడంతో ఈసారి విజయం తథ్యమన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు కథ ఇదీ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఆ పార్టీకి పెట్టని కోటలు. ఒకటి రెండు సందర్భాలు తప్ప.. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ పచ్చ జెండా మోశాయి.1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైనప్పుడు ఆయనకు అండగా నిలిచింది ఉత్తరాంధ్ర. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 73 సీట్లు టీడీపీకి వస్తే.. అందులో ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచే వచ్చాయి.  ఇక 1991లో రాజీవ్‌గాంధీ దారుణహత్య తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఈ జిల్లాల్లో ఎంపీ స్థానాలు టీడీపీ వశమయ్యాయి. అంతకుముందు ఇందిరమ్మ హత్య జరిగిన తరువాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లోనూ.. ఉత్తరాంధ్ర మొత్తం సైకిల్‌కే ఓటేసింది.  

ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు గద్దెనెక్కడానికి సహాయపడింది కూడా.. ఉత్తరాంధ్ర నేతలు, ప్రజలే. అంతటి చరిత్ర వున్న టీడీపీ ఉత్తరాంధ్రలో క్రమంగా బలహీన పడుతోంది. రోజురోజుకూ ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. ఇందుకు ప్రభుత్వ పెద్దలు, స్థానిక నేతల నిర్లిప్తత, అవినీతి, ఆశ్రిత పక్షపాతమే కారణమని సర్వేలు చెబుతున్నాయి. బీసీల పార్టీగా చెప్పుకొనే టీడీపీ బీసీలకేం చేసిందన్న ప్రచారం బీసీల్లో బాగా నాటుకుపోయింది. ఈ ప్రభావం ఓట్ల రూపంలోచూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ సర్కారు హయాంలో బీసీలకు, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందనేది ఇక్కడి ప్రజల ఉవాచ. 

ఇక పదవుల పందేరంలోనూ.. ఈ జిల్లాలకు రిక్తహస్తమే ఎదురైంది. దాంతో ఉత్తరాంధ్రలో 80 శాతానికి పైగా వున్న బీసీలు తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి ప్రధాన సామాజిక వర్గాలైన వెలమలు, కాళింగులు, యాదవులు, మత్స్యకారులు గత ఎన్నికల్లో టీడీపీకే పట్టం కట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఒక్క వెలమ ప్రాతినిధ్యమే కనిపిస్తోంది. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న కాళింగులకు పెద్దగా న్యాయం జరగలేదని చెప్పవచ్చు. రమారమి.. వెలమల సంఖ్యతో సమానంగా ఉన్న యాదవులకూ ఏమీ ఒరగలేదు. దాంతో గట్టి ప్రభావం చూపగల సంఖ్యలో ఉన్న యాదవులు గుర్రుగా ఉన్నారు.

జగన్ ప్రభంజనం

ys jagan in uttarandhra

ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ పాదయాత్రకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జనం స్వచ్ఛందంగా వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తమకేమీ చేయలేదని, పచ్చచొక్కాలకే అన్నీ అప్పజెప్పేశారని మండిపడుతున్నారు. రాయలసీమలో ప్రారంభమై.. కృష్ణాజిల్లా ప్రవేశంతో ఊపందుకున్న జగన్ పాదయాత్ర.. ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాకు వచ్చేసరికి మరింత జోరందుకుంది. జనం తండోపతండాలుగా వస్తున్నారు.

దీంతో వైసీపీలో ఆశలు చిగురిస్తున్నాయి. అంతేకాదు.. జగన్ ధోరణి కూడా బాగా మారిందని నాయుకులు అంటున్నారు. ఒకప్పుడు నేతలను లెక్కచేయుకుండా తనకే ఓట్లు పడతాయని చెప్పే ఆయన.. ఇప్పుడు అందరినీ చేరదీస్తున్నారంటున్నారు. గతంలో ఒక నియోజకవర్గానికి కనీసం ఇద్దరు, ముగ్గురు, ఇచ్ఛాపురం లాంటి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున సమన్వయకర్తల ను నియమించారు. చివరాఖరులో ఒకరికే టిక్కెట్టి వ్వడంతో మిగిలిన వారంతా దెబ్బకొట్టి పార్టీని ఓడించేవారు.

ఇప్పుడా పరిస్థితి లేదు. ఎక్కడికక్కడే పార్టీని జగన్ చక్కబెడుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని సూచిస్తున్నారు. ముందుగానే అభ్యర్థుల కు మంచి సంకేతాలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైన చోట మారుస్తున్నారు. ఇవి కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ..ఆయన పాదయాత్ర సాగుతోంది. ఇది కలిసొచ్చే అంశం. దీంతో టీడీపీ కంచుకోట.. ఫ్యాన్ గాలిలో సేదతీరేందుకు సిద్ధమవుతోంది.

English Title
YSR congress party Gets More Strength In Uttarandhra
Related News