యువరాజ్ మదిలో రిటైర్మెంట్ ఆలోచన

Updated By ManamTue, 02/13/2018 - 20:26
Yuvraj Singh

Yuvraj Singhన్యూఢిల్లీ: క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లో యువరాజ్ సింగ్ ఒకడు. ఈ విధ్వంసర ఎడమ చేతి బ్యాట్స్‌మన్ 2011 ఐసీసీ వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఏడేళ్లు గడిచినా మళ్లీ టీమిండియాలో చోటు లభిస్తుందన్న యువరాజ్ ఆశలు అడియాశలయ్యాయి. యువీ ఫిట్‌నెస్, పేలవ ప్రదర్శనల కారణంగా అతడిని టీమిండియా సెలెక్టర్లు పక్కన పెడుతూనే ఉన్నారు. దాదాపుగా కెరీర్ ముగిసిందని భావిస్తున్న 36 ఏళ్ల యువరాజ్ తనలో ఇంకా రెండు మూడేళ్ల క్రికెట్ మిగిలి ఉందని భావిస్తున్నాడు. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు క్రికెట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు. ‘బాధాకరమైన స్థితిలో క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం ఇష్టం లేదు. మరికొన్ని ఏళ్లు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. ఇదే సరైన సమయమని అనుకున్నప్పుడు, ఉత్తమ ప్రదర్శన ఇచ్చానని.. ఇంతకంటే బాగా ఆడాలేనని భావించినప్పుడు రిటైర్ అవుదామని ఆలోచిస్తున్నాను. ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాను. ఎందుకంటే నేను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. టీమిండియాకు ఆడాలనో లేక ఐపీఎల్‌కు ఆడాలనో నేను క్రికెట్ ఆడటం లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్-11 క్రికెటర్ల వేలం పాటలో యువరాజ్‌ను కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియాలో చోటు దక్కినా, దక్కకపోయినా పంజాబ్ జట్టులో వంద శాతం ఉత్తమ ప్రతిభ కనబరచాలని యువీ కృత నిశ్చయంతో ఉన్నాడు. ‘ఈ ప్రేరణే నన్ను టీమిండియాకు ఆడేలా చేస్తోంది. మరో రెండు, మూడు ఐపీఎల్‌లు ఆడాతాను. వెన్ను చూపని ఆటగాడిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. నాకు టీమిండియాలో చోటు దక్కినా, దక్కకపోయినా ఐపీఎల్ మ్యాచ్‌లో వంద శాతం ప్రతిభ కనబరుస్తాను’ అని యువీ చెప్పాడు. రిటైర్మెంట్ ప్రణాళికను కూడా యువీ తెలియజేశాడు. ‘క్యాన్సర్ ఫౌండేషన్ (యువిక్యాన్ ఫౌండేషన్)తో కలిసి భవిష్యత్తులో పనిచేస్తాను. పిల్లలకు అండగా నిలవడం, యువ తరంతో కలిసి అన్యోన్యతను పంచుకోవడం చాలా ఇష్టం. కోచింగ్ బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నాను. అణగారిన పిల్లలను గురించి వాళ్లకు క్రీడలు, చదువు అందించేందుకు కృషి చేస్తాను. క్రీడలతో పాటు చదువు కూడా చాలా ముఖ్యమైంది’ అని యువీ వివరించాడు. యువరాజ్ సింగ్ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20ల్లో టీమిండియా ప్రాతినిధ్యం వహించాడు. 17 ఏళ్ల కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో 11,778 పరుగులు చేశాడు. 

English Title
Yuvraj Singh Has Coaching On His Mind After Retirement
Related News