మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత

Updated By ManamMon, 04/16/2018 - 12:27
2007 Mecca Masjid blast case, dismiss by NIA Special court
  • ఐదుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చిన కోర్టు.. 11ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడి

2007 Mecca Masjid blast case, dismiss by NIA Special court హైదరాబాద్: నగరంలోని మక్కా మసీద్ పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 11ఏళ్ల విచారణ తర్వాత సోమవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చింది. పేలుళ్ల కేసులో నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దాంతో ఐదుగురు నిందితులు అసిమానంద, భరత్, దేవేందర్‌గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. రెండు నిమిషాల్లోనే ఎన్ఐఎ కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో న్యాయవాది ఒకరు మాట్లాడుతూ.. మక్కామసీద్ పేలుళ్ల కేసులో నిందితుల్లో ఏ ఒక్కరిపైనా అభియోగాలు రుజువు కాలేదన్నారు. కోర్టుకు హాజరైన ఆ ఐదుగురు నిందితులపై విచారించిన న్యాయస్థానం కేసును కొట్టివేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. అయితే ఈ కేసులో మిగతా నిందితులపై చార్జ్‌షీట్ కొనసాగుతున్నట్టు చెప్పారు.

ఇదిలా ఉండగా.. 2007 మే 18న మధ్యాహ్నం మక్కామసీదు ఆవరణలో వజూఖానా వద్ద బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందగా, 58 మంది వరకు గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో మసీదులో ప్రార్థనలు జరుగుతున్నాయి. సుమారు 5వేల మందికి పైగా ఉన్నారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో తొమ్మిది మంది మృతిచెందారు. 

English Title
2007 Mecca Masjid blast case dismissed by NIA Special court
Related News