సాహిత్యోద్యమ చైతన్యం

Updated By ManamMon, 09/24/2018 - 01:03
Nandini-Siddareddy

Nandini-Siddareddyఆధునిక తెలుగు సాహిత్య యుగంలో నందిని సిధారెడ్డిది విలక్షణమైన శైలి. సాహితీ లోకంలో అడుగుపెట్టిన ప్రాథమిక దశలో ఆయన సంప్రదాయ పద్య సాహిత్యంలో ఛందోబద్ధమైన కవిత్వం రాయడం మొదలు పెట్టారు. సిద్దిపేటలో తన గురువులుగా ఉన్న అష్టకాల నరసింహారామశర్మ, ఉమాపతి పద్మ నాభ శర్మ వంటి వారి సలహా మేరకు ఆయన వచన సాహిత్యం కృషికి సన్నద్ధమయ్యారు. బాల్యం నుంచే గ్రామీణ ప్రాంతంలో పెరిగిన సిధారెడ్డి తన చుట్టూ ఉండే ప్రజల కష్ట సుఖాలను, గ్రామీణ జీవన చిత్రాలు ఆయన జీవితంతో పెనవేసుకుని ఉన్నాయి. ఆయన అనేక కష్టాలను ఎదుర్కొని  ఒకవైపు విద్య నభ్యసిస్తూనే మరో వైపు సాహిత్యం పై తనకున్న అభిరుచిని కొనసాగిస్తూ వచన కవిత్వం రాయడం మొదలు పెట్టారు.

ఆధునిక సాహిత్యంలో సమాజాన్ని మలుపుతిప్పిన కవులు, రచయితల రచనలతో ప్రేరణ పొందిన సిధారెడ్డి అభ్యుదయ, విప్లవ భావాలతో వచన కవిత్వం రాశారు. సిధారెడ్డి వెలువరించిన వచన కవితా సంపుటాలను. కథలను పరిశీలిస్తే ఆయన రచనల్లో సామాజిక జీవిత చిత్రణ గాఢ త ఎంతగా ఉంటుందో మనకు అవగత మవుతుంది. సిధారెడ్డి అందరు కవుల మాదిరిగా కేవలం రచనలకే పరిమితం కాలేదు. ఒక సాహిత్య, సామాజిక ఉద్యమకారునిగా ఎదిగారు.  మెదక్ కేంద్రంగా 1980 లలో మెదక్ స్టడీ సర్కిల్ అనే సాహిత్య సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా  అక్కడి కవులను ఏకత్రితం చేసిన సిదారెడ్డి 1986లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అభ్యుదయ రచయితలను ఒక వేదిక మీదికి తీసుకు రావాలనే సంకల్పంతో కొంతమంది మిత్రులతో కలసి ‘మంజీరా రచయితల సంఘా’న్ని (మరసం) ప్రారంభించారు.

గత 30 సంవత్సరాలుగా మంజీరా రచయితల సంఘం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. 1996 ప్రాంతంలో మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలోనే సిధారెడ్డి నేతృత్వంలో మెదక్ జిల్లా కవులు, సిద్ధిపేట ప్రాంత మరసం కవులు, రచయితలు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని నిర్ణయం తీసుకోవడంలో సిధారెడ్డి పాత్ర కీలకమైనది.  సాహిత్య పరంగా ప్రజలను ఉద్యమంలోకి నడిపించడానికి, చైతన్య వంతులను చేయడానికి నడుం కట్టారు..అందులో భాగంగానే నందిని సిధారెడ్డి రాసిన నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ  అనే పాట తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి గొప్ప పాటగా చెప్పవచ్చు. తెలంగాణలో ఎందరో కవులు, రచయితలు, గురువుగా, మార్గ దర్శకునిగా ముందుకు నడిపించిన భాషా సాహిత్య సారథి- వారథి సిధారెడ్డి.

1955లో నర్రా బాలసిధారెడ్డి రత్నవ్వ దంపతులకు తొలి సంతానంగా సిధారెడ్డి జన్మించారు..వీరి తండ్రి బాల సిధారెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. చిన్నప్పటి నుండే తండ్రి భావాలను ఒంటపట్టించుకున్న సిధారెడ్డికి బాల్యంలోనే  సమాజంపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. సిధారెడ్డి ప్రాథమిక విద్య బంధారం లో, ఉన్నతవిద్య వెల్కటూరులో పూర్తి చేశారు. సిద్ధిపేట ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. డిగ్రీలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రచేఖర్ రావు గారు సిధారెడ్డి  తోటి విద్యార్థి. అప్పటి నుంచి ఇద్దరికి మంచి స్నేహం కూడా ఉండేది.

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు ఎం.ఎ. పూర్తి చేశారు. సి. నారాయణ రెడ్డి పర్యవేక్షణలో ఆధునిక తెలుగు సాహిత్యంలో సూర్యుడు అనే అంశం పై ఎం.ఫిల్, ‘ఆధునిక తెలుగు కవిత్వం- వాస్తవికత - అధివాస్తవికత’ అనే అంశం పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. 1984 నుంచి 1991 వరకు మెదక్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1991 నుండి 2012 వరకు సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పని చేశారు. 2012 లో సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో పదవీ విరమణ పొందారు.

సిధారెడ్డి రాసిన పద్య సంకలనాలు-1974లో దివిటీ, 1987లో భూమిస్వప్నం; 1991లో సంభాషణ; 1996లో ప్రాణహిత; 2001లో ఒక బాధగాదు; 2007లో నది పుట్టువడి;  2014లో ఇక్కడి చెట్లగాలి ప్రచురించారు. సిద్ధారెడ్డి స్థాపించిన సంస్థలు, సాహిత్య కృషి: 1980లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్ ; 1986లో మంజీరా రచయితల సంఘం; 1998లో తెలంగాణ సాంస్కృతిక వేదిక; 2001లో తెలంగాణ రచయితల వేదిక; 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక; 2014లో తెలంగాణ రచయితల సంఘం.

సిధారెడ్డి వెలువరించిన మాస పత్రికలు: 1986-1989 మధ్యకాలంలో మంజీర; 2002-2007 లో సోయి; 2001లో ఏడుపాయలు; 2014లో జంబి; సిధారెడ్డి పొందిన అవార్డులు: 1987 లో భూమిస్వప్నం పద్య సంకలనానికి ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డు:1988లో భూమిస్వప్నం పద్య సంకలనానికి దాశరథి అవార్డు; 2009లో ఒక బాధ గాదు విశ్వకళా పీఠం అవార్డు; 2011లో నంది అవార్డ్ (వీర తెలంగాణ చిత్రంలో నాగేటి సాల్లల్లా పాటకు); 2016లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం; ‘ఆధునిక తెలుగు కవిత్వం...వాస్తవిక-అధివాస్తవికత’ అనే అంశం పై సిద్ధాంత వ్యాసం సమర్పించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏర్పాటు చేయబడిన తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్ట మొదటి చైర్మన్‌గా నందిని సిధారెడ్డి నియమితులు కావడం విశేషం. 2017 డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కోర్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహ రించారు. ప్రస్తుతం (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సిలబస్ కమిటీ సభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర పాఠ్య పుస్తక సమీక్ష కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.   
                             
గత 40 ఏండ్లుగా తెలుగు సాహిత్య రంగంలో  విశేష సేవలందించిన సాహిత్య ఉద్యమకారుడు నందిని సిద్దారెడ్డికి సాహిత్య అకాడమీ చైర్మన్  పదవి ఇవ్వడం తెలంగాణ సాహిత్య ఉద్యమ కారులందరికి దక్కిన గౌరవంగా సాహిత్య లోకం ఆనందపడింది. ఏడాదికిపైగా సాహిత్య అకాడమీ నందిని సిధారెడ్డి నేతృత్వంలో సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసింది.

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ సాహిత్య ఔన్నత్యాన్ని, రాష్ట్ర గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా నిర్వహించి నందిని సిధారెడ్డి తన పనితీరును మరోసారి చాటుకు న్నారు..సాహిత్య అకాడమీ ద్వారా గత సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలను నిర్వహించి అకాడమీ తెలంగాణ సాహిత్య కారులందరిదని నిరూపించారు. సాహిత్య అకాడమీ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణలో విస్మరణకు గురైన అనేకమంది కవులు, రచయితల పుస్తకాలను వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేస్తున్నారు...తెలంగాణలో గొప్ప సాహిత్య కారులని తయారు చేసే క్రమంలో ఎంతోమంది కవులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ మంచి కవులుగా తయారు చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో సాహిత్య అకాడమీ ద్వారా అనేక పుస్తకాల ప్రచురణకు ప్రణాళి కలు సిద్ధం చేశారు. తెలంగాణ సాహిత్య వికాసంలో సిధారెడ్డి కృషి ఒక చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.    
   
గత 40 ఏండ్లుగా తెలుగు సాహిత్య రంగంలో  విశేష సేవలందించిన సాహిత్య ఉద్యమకారుడు. తెలంగాణలో ఎందరో కవులు, రచయితలు, గురువుగా, మార్గ దర్శకునిగా ముందుకు నడిపించిన భాషా సాహిత్య సారథి- వారథి సిధారెడ్డి.                      
 

-నేరెళ్ల సుమ,
ఉపాధ్యాయురాలు

English Title
259 sq ft purchases in the state
Related News