పారిశ్రామిక ఉత్పత్తిలో ఆకర్షణీయమైన వృద్ధి

Updated By ManamWed, 09/12/2018 - 22:33
index of industial production

index of industial productionన్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలో 6.6 శాతం వృద్ధి చెందింది. వస్తూత్పత్తి రంగం చక్కని పనితీరు కనబరచడం, యంత్రాలు, యంత్ర పరికరాలు, మన్నికైన వినియోగ వస్తువుల అధిక కొనుగోళ్ళు అందుకు దోహదపడ్డాయి. ఫ్యాక్టరీలలో ఉత్పత్తికి కొలబద్దగా పారిశ్రామిక ఉత్పత్తి సూచిని చూస్తారు. గత ఏడాది జూలైలో అది 1 శాతం మాత్రమే విస్తరించిందని కేంద్ర గణాంకాల కార్యాలయం బుధవారం విడుదల చేసిన డాటా వెల్లడించింది. జూన్ నెల ఐ.ఐ.పి వృద్ధిని 6.8 శాతానికి తగ్గిస్తూ సవరించారు. అది 7 శాతం ఉండగలదని గత నెలలో విడుదల చేసిన తాత్కాలిక అంచనాలు వెల్లడించా యి. గత ఏడాది జూలైలో 0.1 శాతం సంకోచించిన వస్తూత్పత్తి రంగం జూలైలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగ వస్తువుల ఉత్పత్తి రంగంలో వృద్ధి గత ఏడాది జూలైలో 2.4 శాతం తగ్గగా, ఈ జూలైలో ఆకట్టుకునే రీతిలో 14.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. మూలధన వస్తువుల ఉత్పత్తి గత ఏడాది జూలైలో 1.1 శాతం క్షీణించగా, ఈ జూలైలో 3 శాతం వృద్ధి చెందింది. ఈ ఏప్రిల్-జూలై కాలంలో ఐఐపి వృద్ధి 5.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం అదే కాలంలో అది 1.7 శాతంగా మాత్రమే ఉంది. వస్తూత్పత్తి రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపులలో 22 గ్రూపులు 2018 జూలైలో సానుకూల వృద్ధిని కనబరచాయి. ఫర్నిచర్ విభాగం అత్యధికంగా 42.7 శాతం వృద్ధిని కనబరచగా, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఉత్పత్తుల విభాగం 30.8 శాతం, పొగాకు ఉత్పత్తుల విభాగం 28.4 శాతం వృద్ధిని నమో దు చేశాయి. మరోపక్క కాగితం, కాగితం ఉత్పత్తుల విభాగం, ‘ప్రింటింగ్ రిప్రొడక్షన్ ఆఫ్ రికార్డెడ్ మీడియా’లో మైనస్ 2.7 శాతం ప్రతికూల వృద్ధి కనిపించింది.

English Title
Attractive growth in industrial production
Related News