సంకీర్ణ కాలం 

Updated By ManamSun, 05/27/2018 - 03:09
image

imageకర్ణాటక ప్రహసనం ముగిసింది. అసెంబ్లీలో అతిపెద్ద భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటే.. రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ సంకీర్ణ కూటమిలో జూని యర్ భాగస్వామిగా ఉండి.. అన్నింటికంటే అతి తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు పట్టంగట్టింది. మూడురోజుల ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప మరో చెత్త రికార్డును సొంతం చేసుకుని కన్నీటితో పదవి నుంచి వైదొలిగారు. బలపరీక్షను సైతం కుమారస్వామి సునాయాసంగా దాటేశారు. ఎటూ మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే చెబుతోంది కాబట్టి ఆయనకు ఈ హర్డిల్ దాటడం పెద్ద కష్టమేమీ కాలే దు. కానీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పెద్దమనిషి పరమేశ్వరకు మా ట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం అంత మంచి సంకేతా లను పంపలేదు. తత్ఫలితంగానే మాట్లాడారో ఏమోగానీ, ఆ తర్వాత విడిగా మీడియాతో మాట్లాడిన పరమేశ్వర.. తాము ఐదేళ్ల పాటు కుమారస్వామికి పూర్తిగా మద్దతు ఇస్తా మో లేదో చెప్పలేమంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో చాలామంది 30 నెలల తర్వాత అంటే రెండున్నరేళ్లకు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు కూడా. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పీఠాన్ని అధి రోహించిన కుమారస్వామి పూర్తికాలం పదవిని అనుభవించే అవకాశం ఉంటుందో లేదో అనుమానంగానే కనపడుతోంది. 224 మంది సభ్యులుండే కర్ణాటక అసెంబ్లీలో గట్టిగా 40 సీ ట్లు కూడా సాధించుకోలేని జనతాదళ్ (సెక్యులర్) నేత, కేవలం తన అహాన్ని సంతృప్తిపరుచుకోడానికి చూస్తుంటే... ప్రస్తుతానికి ఎలాగైనా బీజేపీని అధికారం నుంచి దూరంగా పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే ఆయ నకు మద్దతిచ్చి అందలం మీద కూర్చోబెట్టింది.

మహామహులంతా ఒకేవేదికైపె...
కుమార పట్టాభిషేకం సందర్భంగా బెంగళూరులో జరి గిన కార్యక్రమం చూస్తే అందులో ఎక్కడా కుమారస్వామికి పెద్ద ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. ఆ వేదికను బీజేపీ యేతర పక్షాల నాయకులంతా ఒక్కతాటి మీదకు రావడానికి చేసిన ప్రయత్నంలా వాడుకున్నారు. మమత, మాయా, సోనియా లాంటి అగ్రశ్రేణి మహిళా నాయకులతో పాటు రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, డి. రాజా, చంద్రబాబు, హేమంత్ సోరెన్... ఇలా లెక్కలేనంత మంది మహానాయకులు కూడా ఒకే వేదిక మీదకు చేరి చేతులు కలిపారు. కర్ణాటకలో బీజేపీని దిగ్విజ యంగా అధికారం చేపట్టనివ్వకుండా అడ్డుకున్నట్లే భవిష్యత్తు లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యతను ప్రద ర్శించి తామంతా కలిసికట్టుగా ఉండి నరేంద్ర మోదీ మరో సారి గద్దెనెక్కకుండా చూడాలని తీర్మానించుకున్నారు. ఇందు కోసం విడివిడిగా, కలివిడిగా పలురకాలుగా చర్చోపచర్చలు సాగించారు. 

కేసీఆర్ డుమ్మా...
అయితే, ఇంత కీలకమైన భేటీ ఉంటుందని తెలిసినా ఇద్దరు ప్రధానమైన ప్రాంతీయ నాయకులు మాత్రం దానికి హాజరు కాలేదు సరికదా తమ ప్రతినిధులు ఎవరినీ కూడా అక్కడకు పంపకపోవడం గమనార్హం. తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందురోజే ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి పెద్దాయన దేవెగౌడకు నమ స్కరించి, కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామిని అభి నందించి వచ్చేశారు. తనకు కలెక్టర్లతో ముఖ్యమైన సమా వేశం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి హాజరు కావట్లేదని చెప్పారు. అయితే, తాను రాకపోతే రాకపోయారు కనీసం తన కుమారుడిని గానీ, కుమార్తెను గానీ ప్రతినిధిగా కర్ణా టకకు పంపే అవకాశం ఆయనకు లేకపోలేదు. కావాలంటే అలా చేయగలరు కూడా. కానీ కేసీఆర్ మాత్రం ఆ పని చేయలేదు. టీఆర్‌ఎస్ తరఫున ఎవరూ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అస్సలు హాజరు కాలేదు. కాంగ్రెస్ నేతలను పెద్దదిక్కుగా భావించి సోనియా, రాహుల్ గాంధీ లను ఆహ్వానించిన సభలో వారి సరసన తాము ఉండటం ఇష్టం లేకనే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని వదిలేశారని వినిపిస్తోంది. ఒకవైపు సొంత రాష్ట్రంలో ఉప్పు- నిప్పు అన్నట్లు ఉంటూ జాతీయస్థాయిలో వాళ్లతో చేతులు కలపడం స్వతహాగానే కేసీఆర్‌కు ఇష్టం ఉండదు. ఇక్కడ తొడగొట్టి సవాలు చేస్తున్న పార్టీకి ఏవో ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వాలంటే అస్సలు సాధ్యం కాని పని. 

బాబు పరిస్థితి వేరు
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా కూడా లేదు. అందువల్ల వాళ్లకు మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీకి పెద్దగా పోయేదేం లేదన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభ జించారన్న కోపం ఆంధ్రులకు ఇంకా తగ్గలేదు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటుందని వాళ్లు పట్టించుకుంటారన్న నమ్మకం ఏమాత్రం లేదు. పై పెచ్చు ఇప్పటికే అక్కడ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ, జనసేన పేరుతో ముక్కోణ పోటీ ఉండనే ఉంది. బీజేపీ సైతం గట్టి గానే పోటీ చేస్తామంటోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా ఆంధ్రులకు ఏ మాత్రం లేదని చెప్పక తప్పదు. అందుకే రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమితో ఉం డాలని చంద్రబాబు భావించినట్లున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారనో లేదా కర్ణాటకలో బీజేపీని దిగ్విజయంగా గద్దె దరికి రానివ్వకుండా చేశారనో తెలియదు గానీ రాహుల్ గాంధీతో చేతులు కలిపి, ఆయనను భుజం మీద తట్టి మరీ ఒక పెద్దమనిషిలా అభినందించారు. అయి తే, చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరగా వెళ్లడం మీద రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీతో ఒకసారి పొ త్తు పెట్టుకుని, ఆ తర్వాత దాన్ని చారిత్రక తప్పిదంగా అభి వర్ణించిన చంద్రబాబు నాయుడు.. మళ్లీ మరోసారి అదే పార్టీతో అంటకాగి నాలుగేళ్ల పాటు కేంద్రంలోనూ అధికా రాన్ని అనుభవించి, చివర్లో బయటకు వచ్చేసి ఇప్పుడు ఆ పార్టీని తిట్టిపోస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత తో. అంజయ్యతో చెప్పులు మోయించిన వైనాన్ని ఏమాత్రం సహించలేని ఎన్టీ రామారావు.. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీని స్థాపించారు. ‘మదరాసీ’ నుంచి ‘తెలు గువారు’ అనే గుర్తింపును తెచ్చిన మహానుభావుడాయన. అలాంటి  గుర్తింపు ఉన్న పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఎంతవరకు భావ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఒక్కసీటు కోసం పదిమంది పోటీ
మరోవైపు ప్రతిపాదిత కూటమిలో చాలామంది ప్రధాన మంత్రి అభ్యర్థులు కనిపిస్తున్నారు. శరద్‌పవార్ గత కొన్ని దశాబ్దాలుగా ప్రధానమంత్రి పదవి ఎక్కాలని ఆశపడుతూనే ఉన్నారు. ఎర్రకోట మీద తన చేతుల మీదుగా జెండా ఎగరే యాలన్న ఆకాంక్ష ఆయనకు నరనరాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా జాతీయ స్థాయికి ఎదగాలన్న ఆశ, ఆకాంక్షతోనే ఉన్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. ప్రధానమంత్రుల జాబితా చాలానే ఉంటుంది. తనకు ప్రధానమంత్రి అవ్వాలన్న ఆశ ఏమాత్రం లేదని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడం, దాన్ని ప్రపంచం లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే తన ధ్యేయ మని చంద్రబాబు తాజాగా తమ తెలంగాణ మహానాడులో కూడా చెప్పారు. ఆయన ఒక్కరినీ పక్కన పెట్టినా ఇంకా చాలామందికి ఆకాంక్షలు ఉండటంతో వారందరి మధ్య ఐక్యత ఎలా సాధ్యమన్న ప్రశ్న సహజంగానే అందరికీ తలెత్తుతుంది. ఒకవేళ ఈ కూటమి అంతటికీ కలిపి 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయే కూటమి కంటే ఎక్కువ సీట్లు వచ్చినా కూడా, ఇన్ని ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరంగా ఐదేళ్ల పాటు నడిపించ గల సామర్థ్యం ఎవరికి ఉంటుందన్నది అతిపెద్ద ప్రశ్న. 

దేశ శ్రేయస్సు కోరే ప్రభుత్వం అవసరం
ప్రాంతీయ కోణంలో, రాష్ట్రాల అధికారాలు, అభివృద్ధి విషయంలో ఆలోచించినపుడు కేంద్రంలో గట్టి ప్రభుత్వం లేకపోవడం అన్నది మంచిదే గానీ, ఒకవైపు చైనా మరోవైపు పాకిస్థాన్ లాంటి శత్రువులను పక్కలో బల్లెంలా పెట్టుకుని కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం లేకుండా కాలం గడిపేయడం ఎంతవరకు మంచిదో ఆలోచించాలి. అక్కడ ఉండేది.. ఉండాల్సినది బీజేపీ ప్రభుత్వమా.. లేదా కాంగ్రెస్ ప్రభుత్వమా అన్నది కాదు. ఎవరైనా సరే జాతి ప్రయోజ నాలను కాపాడుతూ, దేశభద్రతకు పెద్దపీట వేసి దేశవాసు లంతా సురక్షితంగా ఉండగలమన్న ధీమా ఇవ్వగల ప్రభు త్వం కావాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఎవరు అందించ గలరన్న ప్రశ్న ప్రతి ఒక్క భారతీయుడు వేసుకోవాలి. ఏడాదికి.. రెండేళ్లకు కూలిపోయే ప్రమాదం ఉంటూ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి సర్కారు ఉందంటే ఇరుగు పొరుగు దేశాలు కార్గిల్, డోక్లాం లాంటి దుస్సాహసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. అవసరమైతే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసి దాయాది నోరు మూయించగల సామర్థ్యం కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి అవసరం. కార్గిల్ లాంటి దురాక్రమణలు జరిగేవరకు చేతులు ముడుచుకుని కూర్చో కుండా.. వాళ్లు ఒక్క అడుగు వేసేలోపు మనం నాలుగడు గులు ముందుకేసి శత్రువుల పీచమణచాలి. అంత సామర్థ్యం ఉన్న ప్రభుత్వాన్ని ఎంచుకోవడం మనకు ఇలాంటి తరు ణంలో తక్షణావసరం. అదేసమయంలో రాబోయే సర్కార్లు కూడా రాష్ట్రాల ప్రాధాన్యాన్ని తప్పక గుర్తించాలి. రాష్ట్రాలన్నీ సుభిక్షంగా ఉంటేనే దేశంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు బాగుంటుంది. అలా ఉండాలంటే వాటికి తగిన సాయం అందించాలి. ఈ విషయాన్ని కూడా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు గుర్తించి తీరాలి. అప్పుడే సమాఖ్య విధానానికి అసలైన అర్థం.. పరమార్థం ఉంటాయి.  

image

English Title
Coalition period
Related News