మాపై ఉద్దేశపూర్వక యుద్ధం

Updated By ManamMon, 09/24/2018 - 23:00
nirmala
  • కాంగ్రెస్‌ను గట్టిగా ఎదుర్కొంటాం.. దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు

  • రఫేల్‌లో నిజమేంటో తేలుతుంది.. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

  • రఫేల్‌పై రాహుల్‌వన్నీ అబద్ధాలు.. ఆధారాలు లేకుండానే ఆరోపణలు

  • కేంద్ర మంత్రి జావడేకర్ ధ్వజం.. మోదీపై పాక్‌కు, కాంగ్రెస్‌కు ద్వేషం

  • బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర

Nirmala Sitharamanజైపూర్/న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ తమ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా అన్నీ తెలిసీ కూడా యుద్ధాన్ని చేస్తోందని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆ యుద్ధాన్ని గట్టిగా ఎదుర్కొంటామని, దేశవ్యాప్తంగా తమ పార్టీ నేతలు వరుస మీడియా సమావేశాలు పెడుతారని అన్నారు. ఒప్పందం విషయంలో నిజాలు నిలకడమీద తేలుతాయని అన్నారు. రాహుల్ ఆరోపణలు వెనుక అంతర్జాతీయ కోణం ఉందని, అదేమిటో త్వరలోనే బయటపెడుతామని అన్నారు.  రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఎలాంటి  వాస్తవ సమాచారం, ఆధారాలు లేకుండానే  రాహుల్‌గాంధీ ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన ఓ దిశానిర్దేశం లేని నేత అని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణల ద్వారా ఒకరిని అవినీతి పరుడని పేర్కొనలేమని అన్నారు. యూపీఏ హయాంలో బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు మేం కూడా ఆరోపణలు చేశామని, కానీ అప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీని పదవి నుంచి తొలగించాలని అటు మన దాయాది దేశం పాకిస్థాన్ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీకి వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఇతర నేతలు చేస్తున్న ట్వీట్లను ఆయన ప్రస్తావించారు. అచ్చం అలాగే రాహుల్‌గాంధీ కూడా ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. ఇలా పాకిస్థాన్ నేతలు, కాంగ్రెస్ నేతలు మోదీని తొలగించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు. ‘‘కొందరు  రాహుల్‌ను పెద్ద నేతగా చేయాలని భావిస్తున్నారు. ఆ నేతలు ఎవరనుకుంటున్నారు? వారే పాకిస్థాన్ నేతలు. వారంతా అవినీతికి, వారసత్వ-బుజ్జగింపు రాజకీయాలకు మద్దతు పలుకుతున్నారు’’ అని సంబిత్ పాత్ర అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రధాని మోదీ వెంటే ఉన్నారని, ఆయన్ను ఎవరూ తొలగించలేరని చెప్పారు. కాంగ్రెస్‌తోపాటు పాకిస్థాన్ నేతలు కూడానిరాశనిస్పృహల్లో కూరుకుపోయి మోదీని పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు. 

అందుకే రిలయన్స్‌తో ఒప్పందం: డస్సాల్ట్
రఫేల్ యుద్ధ విమానాల భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నామో డస్సాల్ట్ కంపెనీ వివరించింది. రిలయన్స్ కంపెనీకి నాగ్‌పూర్‌లోని విమానాశ్రయం సమీపంలో ఖాళీ స్థలం ఉందని, అది విమానాశ్రయం రన్‌వేపైకి వెళ్లేందుకు అనువుగా ఉంటుందని తెలిపింది.  భారత కార్పొరేట్ వ్యవహారాలశాఖ వద్ద రిలయన్స్ డిఫెన్స్ రిజిష్టర్ అయి ఉందని, అందుకే ఆ సంస్థను ఎంచుకున్నామని ఆ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.

ఎస్పీజీపై రాహుల్ వ్యాఖ్యలు అసంబద్ధం
ఆర్‌ఎస్‌ఎస్ సూచించిన అధికారులను చేర్చుకోవడం ఇష్టం లేకే ఎస్పీజీ చీఫ్ తన పదవికి రాజీనామా చేశారని రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. రాహుల్‌గాంధీ ఆధారరహితమైన, వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఎస్పీజీ చీఫ్‌గా నియమితులయ్యారని, కానీ ఎస్పీజీ అధికారులుగా చేర్చుకోవాలని కొందరి పేర్లను ఆర్‌ఎస్‌ఎస్ సూచించిందని అన్నారు. ఆ జాబితాను ఆమోదించడం ఇష్టం లేక సదరు అధికారి తన పదవి నుంచి తప్పుకున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ స్పందిస్తూ.. ఎస్పీజీ ఒక ఉన్నతమైన ప్రొఫెషనల్ సంస్థ అని తెలిపింది. అర్హులైన వారే ఎస్పీజీలోకి చేర్చుకుంటారని, సిఫారసులు చెల్లవని వెల్లడించింది.

English Title
Deliberate war on us
Related News