సెల్యూలాయిడ్ టెర్రరిస్ట్‌ల కోసం.. ఆర్జీవీ అన్‌స్కూల్!

Updated By ManamSun, 05/27/2018 - 21:05
Director Ramgopal varma starts film school named RGV unschool

Director Ramgopal varma starts film school named RGV unschool

రాంగోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వారుండరు.. శివ సినిమాతో తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్న ఆర్జీవీ.. తన టాలెంట్‌ ఏంటో సినీ ప్రపంచానికి రుచి చూపించాడు. అలా శివతో కెరీర్ మొదలై తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు తీసిన అభిమానుల మన్ననలు పొందాడు. 1990 కంటే ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక ఎత్తయితే.. ఆర్జీవీ శివ సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసి "నాకు నేనే సాటి.. నాకెవ్వరు లేరు పోటీ.. అది వివాదాల్లో అయినా.. సినిమాల్లో అయినా" అన్నట్లుగా ఎదిగాడు ఆర్జీవీ. ఇండస్ట్రీలో ఆర్జీవీ ఎంటరైన తర్వాత చాలా వరకు మార్పులొచ్చాయి.. ఒక సాధారణ మనిషి కూడా సినిమా తీసేయొచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చాడాయన. అంతేకాదు ఒక్క మాటలో చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్‌‌ పుట్టిందే ఈయన వల్లే అనిచెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!. సింగిల్ కెమెరాతో కాదు.. కాదు సెల్‌ఫోన్ కెమెరాతో సినిమా తీసిన రోజులున్నాయి. 

అంతేకాదు ఈయన సినిమాల ఎంపిక ఓ స్పెషాలిటి.. శివ, సత్య, గాయం, రక్త చరిత్ర, వంగవీటి లాంటి ఫ్యాక్షన్ సినిమాలను తీసిన చరిత్ర వర్మది. మొదటి సినిమా శివ మొదలుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఆఫీసర్ సినిమా వరకు అన్నీ డిఫరెంట్ స్టోరీలే, డిఫరెంట్ టేకింగ్సే. ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఆర్జీవీ దగ్గరున్నంతగా మరెవ్వరి దగ్గర ఉండవనేది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇది మాత్రం జగమెరిగిన సత్యం.! ఆయన మొదట్నుంచి సరికొత్త టెక్నాలజీని ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే మిగతా డైరెక్టర్లతో పోలిస్తే వర్మ సినిమాటోగ్రఫి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్జీవీ సినిమాలు చూసిన జనాలకు ఈ విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందుకే తన టాలెంట్‌‌ను తనతోనే కాకుండా పది మందికి పంచాలన్న తపనతో ఆర్జీవీ.. స్కూల్‌ను ప్రారంభించాడు. 

ఇక అసలు విషయానికొస్తే.. 
ఇప్పటి వరకు ఇలాంటి ఫిల్మ్ స్కూల్ లేదని, సెల్యూలాయిడ్ టెర్రరిస్టులను తయారుచేసి సినీ పరిశ్రమపైకి వదలడమే లక్ష్యంగా ఈ ‘ఆర్జీవీ అన్‌స్కూల్‌’ను ప్రారంభించినట్లు రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... స్కూల్ బాధ్యతలు శ్వేతా రెడ్డి చూసుకుంటారని, తాను క్రియేటివ్ హెడ్‌‌గా వ్యవహరిస్తానని వర్మ చెప్పారు. సంప్రదాయ బోధన పద్ధతి తమ స్కూల్‌‌లో ఉండదని వర్మ తేల్చిచెప్పారు. ‘అన్ లర్నింగ్ మెథడ్స్’ తమ స్కూల్ ప్రత్యేకత అన్నారు. విద్యార్థికి ఏ అంశంలో ఆసక్తి ఉందో దానిపైనే సూచనలు, సలహాలు ఉంటాయన్నారు. ప్రతి విద్యార్థినీ ప్రత్యేక పర్యవేక్షణలో ఒక సెల్యులాయిడ్ టెర్రరిస్ట్‌గా తయారుచేస్తామని చెప్పుకొచ్చాడు.

రాము చొడ్డోడు..!!
"
నేను చాలా చెడ్డ విద్యార్థిని. పదో తరగతిలో రెండు సార్లు తప్పాను. అలాగే ఇంటర్‌లో రెండుసార్లు, ఇంజినీరింగ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాను. అందుకే దీన్ని ఆర్జీవీ స్కూల్ అంటే బాగుండదని అన్‌స్కూల్ అని పెట్టాం. నా కెరీర్ ప్రారంభం నుంచి చూసుకుంటే మీడియా కనిపెట్టిన ఈ ఆర్జీవీ స్కూల్ అనే పదాన్ని నేనెప్పుడూ వాడలేదు. ఫలాన దర్శకుడు ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చాడు. ఈ సినిమా చూడటానికి ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చినదానిలా ఉంది అని మీడియా చెప్పేది. కానీ నేనెప్పుడూ చెప్పలేదు. పలు ఫిల్మ్ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులను నేను కలిశాను. వాళ్లంతా చాలా పాత క్లాసికల్ విధానాలను అనుసరిస్తున్నారు. పాత దర్శకుల విధానాలను నేర్చుకుంటున్నారు" అని వర్మ స్పష్టంగా వివరించాడు.

టూ డిఫరెంట్ అంతే..!
ప్రస్తుతం ఫిల్మ్ స్కూల్స్ ఏమైతే నేర్పుతున్నాయో దానికి విరుద్ధంగా ఆర్జీవీ అన్‌స్కూల్ బోధన ఉంటుందని వర్మ చెప్పాడు. తాము కొత్తగా ఏమీ బోధించమని, విద్యార్థిలో ఉన్న టాలెంట్‌ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నాడు. ఏం చేస్తే బాగుంటుంది.. ఏం చేస్తే ఒక మంచి సినిమా వస్తుందనే విశ్లేషణ విద్యార్థిలో కలిగేలా చేస్తామన్నాడు. 

నాకు నచ్చింది నేను చేస్తానంతే..!!
"
శివ సినిమా చేసేటప్పుడు నాకు చాలా విషయాలు తెలియవు. సినిమాకు చెందిన చాలా నిబంధనలకు నేను అతిక్రమించాను. కెమెరా లెఫ్ట్, రైట్ అంటే తెలీదు, సినిమా ప్రాథమిక అంశాలు తెలీవు.. ఇతనేం డైరెక్ట్ చేస్తాడని నాగార్జునకి నా టెక్నీషియన్లు చాలా మంది చెప్పారు. కానీ సినిమా చూసిన తరవాత ఇదో కొత్తతరం సినిమా అన్నారు. వాస్తవానికి నేను రూల్స్‌ను బ్రేక్ చేయలేదు. నాకు రూల్స్ తెలియక అలా చేశాను. నాకు నచ్చింది చేసుకుంటూ పోయాను. ఇలా ప్రతి ఒక్కరిలోనూ తమ సొంత విధానం ఉంటుంది. అలాంటి వారిని గుర్తించి, వారిని ఒక ఫిల్మ్ మేకర్‌గా తయారుచేయడం మా ఉద్దేశం" అని తన వర్మ చెప్పుకొచ్చాడు.

తమ స్కూల్‌లో చేరాలంటే కొన్ని ప్రశ్నలతో కూడిన పరీక్షను రాయాల్సి ఉంటుందన్నారు. ఆ ప్రశ్నలను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ పరీక్షరాసిన విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేసి స్కూల్‌లో చేర్చుకుంటారు. 

1) మీకు బాగా నచ్చిన, మిమ్మల్ని బాగా ప్రేరేపించిన 10 ఉత్తమ సినిమాల పేర్లు రాయండి? (దీని ద్వారా దరఖాస్తుదారుని అభిరుచి, సున్నితత్వాన్ని అంచనా వేస్తారు)

2) మూడు అత్యంత చెత్త సినిమాల పేర్లు రాసి, అవి మీకు ఎందుకు నచ్చలేదో రెండు నుంచి మూడు లైన్లలో తెలపండి? (దరఖాస్తుదారుడు చెప్పిన కారణాల ద్వారా అతని విశ్లేషణా జ్ఞానం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటాం)

3) ఇటీవల కాలంలో మీకు నచ్చిన ఫ్లాప్ ఫిల్మ్ ఏది, ఎందుకు నచ్చింది? (దరఖాస్తు దారుడు తన జ్ఞానం పట్ల ఎంత నిజాయతీగా ఉన్నాడో తెలుసుకోవడానికి) 

4) ఇటీవల కాలంలో మీకు అస్సలు నచ్చని హిట్ ఫిల్మ్ ఏది, ఎందుకు నచ్చలేదు? (తన అభిప్రాయం ఎంత బలంగా నిలుచున్నాడో పరీక్షించడానికి)

5) ఏదైనా సినిమాలో చాలా బాగా దర్శకత్వం వహించారు అనే ఒక సన్నివేశాన్ని తీసుకొని అది మీకు నచ్చడానికి గల కారణాలను చెప్పగలరా? (అసలు ఆ దర్శకత్వం గురించి దరఖాస్తుదారుడు ఏం అర్థం చేసుకున్నాడో తెలుసుకోవడానికి)

6) ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ‘సత్య’ సినిమాను మీరు తీస్తే ఏ కెమెరాలు వాడతారు, సినిమా తీయడానికి ఎన్ని రోజులు పడుతుందని మీరు అనుకుంటున్నారు? 
(ఇంటర్నెట్ ద్వారా టెక్నాలజీ గురించి తెలుసుకోవడంలో దరఖాస్తుదారుడు ఎంత అప్‌డేటెడ్‌గా ఉన్నాడు, ప్రొడక్షన్‌లోని ప్రాక్టికల్ అంశాలను అతను ఎంత అర్థం చేసుకున్నాడు అనే దానిపై పరీక్ష)

7) తొలి ప్రయత్నంగా మీరు ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటున్నారు, ఎందుకు? (దరఖాస్తుదారుని లక్ష్యాన్ని అంచనా వేయడానికి) 

Director Ramgopal varma starts film school named RGV unschool

English Title
Director Ramgopal varma starts film school named RGV unschool
Related News