కల నిజమయ్యేనా! 

Updated By ManamTue, 09/11/2018 - 23:20
steel plant
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కలగా సొంత గనుల సమస్య

  • ప్రభుత్వాల వైఖరితో అపరిష్కృతంగా మారిన వైనం

  • గనులు కేటాయించాలని కార్మిక సంఘాల డిమాండ్ 

steelplantవిశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమ, నవరత్న హోదా కలిగిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల సమస్య తీవ్రంగా మారింది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా మూడు దశాబ్ధాల క్రితం విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటయ్యింది. నాటి నుంచి నేటి వరకు సొంత గనులు సంస్థకు తీరని సమస్యగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల సొంత గనుల అంశం నానాటికి జఠిలంగా మారుతోంది. సంస్థకు సొంత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ప్లాంట్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. 30 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ కర్మాగారం అప్పటి కేంద్రప్రభుత్వం ఎన్‌ఎమ్‌డిసి నుంచి నామమాత్రపు ధరకు ఇనుప ఖనిజం (ఐరన్‌ఓర్) ఇచ్చేలా ఒప్పదం చేసింది. ఎన్‌ఎమ్‌డిసి నుంచి ఇనుప ఖనిజం రావడంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తిని సాధించి లాభాల బాటలో పయనించింది. అయితే ఎన్‌ఎమ్‌డిసి నుంచి ఇనుప ఖనిజం విదేశాలకు ఎగుమతి చేయడంతో ఇసుప ఖనిజం ధర భారీగా పెరిగింది. దీంతో విశాఖ ఉక్కుపై అదనపు భారం పడి ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల భాట పట్టింది.

దేశంలోని కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్ధలైన సెయిల్, ప్రైవేటు ఉక్కు కర్మాగారాలైన టిస్కో, జింధాల్ లాంటి సంస్థలకు ఇసుప ఖనిజ గనులు ఉంటుండగా నవరత్నహోదా కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోవడం దురదృష్టకరం. విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి, ప్రగతిలో దూసుకుపోతున్నప్పటికీ సొంత గనుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో మన దేశంలోకి విదేశీ ఉక్కు దిగుమతి కావడంతో ఆ సమయంలో ఉక్కురంగం కొంత మేరకు ఇబ్బందులు పడినప్పటికీ, ప్రస్తుతం విదేశీ ఉక్కు దిగుమతిపై సుంకం పెంచడంతో ఆ దిగుమతులు తగ్గాయి. ప్రస్తుతం దేశీయ ఉక్కు పరిశ్రమలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం 3.3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరణను చేపట్టి పనులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్లాంట్ సామర్థ్యం 6.3 మిలియన్ టన్నులు. ఉక్కులోని అన్ని కార్మిక సంఘాలు సొంత గనుల సాధనకు కోన్నేళ్లుగా యాజమాన్యంతోపాటు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. దశల వారీగా ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రైవేటు సంస్థలకు సొంత గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో భారీ పరిశ్రమైన విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో  20 వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు, అధికారులు కార్మిక సంఘాలు కోరుతున్నారు.

English Title
The dream is true!
Related News