ఇలా తినాలి

Updated By ManamTue, 09/04/2018 - 01:20
dinner

మీ ప్రేమకు ప్రతిరూపమైన మీ పిల్లలు ఆహారం తినే విధానాన్ని ఇతరులు అసహ్యించుకుంటే మీకు మనసు చివుక్కుమనదూ?  వీటినుంచి బయటపడాలంటే పిల్లలకు బాల్యంనుంచే ‘టేబుల్ మ్యానర్స్’ తప్పనిసరిగా నేర్పాలి.  ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వారిని ట్రైన్ చేయడం తరువాత.. ముందు వారితో పాటు మీరు కలిసి టిఫిన్, భోజనం చేయడాన్ని క్రమంతప్పకుండా పాటించండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తే ... ఎలా చేస్తే పిల్లలు అచ్చం అదే చేస్తారు!


మీరు ఫాలో అవ్వండి
DINNERTIMEటేబుల్ మ్యానర్స్ థియరెటికల్‌గా చెప్పడంకంటే ప్రయోగాత్మ కంగా రోజూ వారికంట పడేలా చేస్తుంటే చాలు అదే వారిని రైటెన్ చేస్తుంది. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పిల్లలతో భోజ నానికి కూర్చునే ముందు కాళ్లు, చేతులు కడుక్కోవడం, బట్టల మీద కారకుండా, పడకుండా తినడం, ఆహారాన్ని ప్లేట్‌లో వృథా చేయకుండా తినడం, మరీ వేగంగా, మరీ స్లోగా కాకుండా ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా తింటే తిన్నది ఒంటికి పడుతుంది, మీ పిల్లలకు తెలిసీ తెలియకుండా ఇదే అలవడుతుంది. భవిష్యత్‌లోనూ మీ ఆహారపు అలవాట్లన్నీ వారికి ఈజీగా వస్తాయి. ఇక డైనింగ్ టేబుల్ వద్ద భోజనానికి కూర్చోగానే అనవసరంగా వాదనలు, అల్లరి చేయకుండా సరదాగా ఎలా ఉండాలనే మ్యానరిజం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కరకర నమిలేయడం, నచ్చకపోతే ఉమ్మేయడం, రుచి బాగాలేక పోతే అసహ్యించుకోవడం, కాకరకాయ వంటి వెరైటీలు తినమంటే ‘‘బ్యాక్కు, థూ, ఛీ’’ వంటి మాటలు వాడకుండా ఉండేలా మంచి నడవడిక అలవడాలంటే అలా చేయరాదు, ఇలా చేయకూడదు ఎందుకంటే.. అని వారికి తెలిసిన భాషలో వివరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకు అలవాటైన, అనుకూల మైన కట్లరీలనే ఎంపిక చేసుకుంటే వారు ఈజీగా, చక్కగా ఆహారాన్ని తినగలరు. ‘‘చాలు.. వద్దు, బొజ్జ నిండింది, ఫుల్ అయింది.. చాలమ్మా, చాలు నాన్నా.. ప్లీజ్, సారీ, థాంక్యూ’’ వంటి పొలైట్ పదాలను తినేటప్పుడు మీరు వాడుతూ ఉంటే వారికి అదే అలవడుతుంది.

కంపల్సరీ...
ఆటల్లో మునిగి ఉండే చిన్నారుల బట్టలు, కాళ్లు, చేతులు అపరిశుభ్రంగా ఉంటాయి కనుక వాటితో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఆహారం తినేముందు, తిన్న తరువాత ఎలా చేతులను క్లీన్ చేసుకోవాలో నేర్పండి. వేళ్ల గోళ్ల మధ్య, నోట్లో పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని ఎలా తొలగించాలో వరుసగా కొన్ని రోజులపాటు స్వయంగా మీరే చూపుతూ, చేపిస్తే వారు ఆ విధానాన్ని అలవర్చుకుంటారు. నీళ్లు తాగేటప్పుడు గ్లాసుల్లోకి వేళ్లు పెట్టకుండా, బాటిల్ లేదా గ్లాసుతో ఎలా తాగాలన్న టెక్నిక్ వారు మిమ్మల్ని చూసి ఆటోమేటిక్‌గా తెలుసుకుంటారు. కనుక బరువైన గ్లాసుల్లో, గ్లాసు నిండా నీరు, జ్యూస్ వేయకుండా ముందు చిన్న కప్పుల్లాంటివి హ్యాండిల్ ఉన్నవాటిలో వేసి నీరు తాగించడం వారికి అలవాటు చేయండి. ఆతరువాత ప్లెయిన్ గ్లాసులను కూడా వారు స్వయంగా చేతపట్టుకుని నీళ్లు తాగ గలరు. సాధారణంగా ఇళ్లలో అమ్మ మ్మలు, నాన్నమ్మలు, తాతయ్య లుంటే వారే ఇవన్నీ నేర్పుతారు, కనుక తల్లిదండ్రులకు ఇవన్నీ పట్టించుకునే అవసరం ఉండేది కాదు..కానీ చిన్న కుటుంబాలు ఏర్పడం మొదలయ్యాక ఇవి తమ బిడ్డలకు ఎలా నేర్పాలో తల్లిదండ్రులు బయటివారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం వస్తోంది. 

ఒక చేత్తో తినేలా..
ముఖ్యంగా బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్, మంచూరియా వంటి బయట ఆహారం తినే ప్పుడే పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు కనుక వాటిని సింపుల్‌గా ఎలా తినచ్చో మీరు తింటూ చూపండి.. అంతేకాదు చపాతీ, పూరీ, రొట్టెలు వంటివి రెండు చేతులతో పీక్కుని తినడం, నచ్చకపోతే ముక్కలుగా పడేయడం వంటివి మీపిల్లలు చేయకూడదంటే ఒకేసారి వారి కంచెంలో ఎక్కువ క్వాంటిటీని వేయకుండా, కొంచెం వడ్డిస్తూ తినేలా చూసుకోండి. వారికోసం పూరీ, చపాతీ, రొట్టెలు మెత్తగా తయారుచేస్తే ఒకచేత్తోనే తినడం వారికి బాల్యంనుంచే హ్యాబిట్‌గా మారుతుంది.  బ్రెడ్‌పైన జామ్ లేదా వెన్న రాసుకునేందుకు నైఫ్‌ను వైనంగా ఎలా వాడాలి, పళ్లు-కూరగాయల ముక్కలు, నూడుల్స్ ఎలా ఫోర్క్‌తో తినాలి, స్పూన్‌తో సాంబారు వంటివి ఎలా లాగించాలో మీరు తినే విధానాన్నే మీ పిల్లలు కాపీ కొడతారు, వారికి చెబితే అస్సలు అర్థం కాదు, అదే మీరు శుభ్రంగా తింటున్నారనుకోండి..వాళ్లు అలాగే చేస్తారు అంతే. కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనానికి కూర్చుని, భోజనం అయ్యాక అందరూ ఒకేసారి లేచి చేతులు కడుక్కోవడం రొటీన్‌గా మార్చండి.. అప్పుడు పంక్తిభేదం లేకుండా, ఓపికగా వారు అందరితో కలిసి ఆహారం తీసుకోవడం అనే నియమాన్ని క్రమంతప్పకుండా పాటిస్తారు. 

Tags
English Title
Eat it like this
Related News