ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు అల్టిమేటం

Updated By ManamWed, 09/12/2018 - 22:33
arcelormittal

arcelormittalముంబై: చితికిపోయిన ఎస్సార్ స్టీల్ స్వాధీనానికి తాను సమర్పించిన మూడవ బిడ్‌ను ఆమోదించవలసిందని లేదా మాజీ గ్రూప్ సంస్థలు ఉత్తమ్ గాల్వా, కె.ఎస్.ఎస్ పెట్రాన్‌లకు చెందిన రుణాలను తీర్చేందుకు ఎల్.ఎన్. మిత్తల్ సంస్థ ఇవ్వజూపిన రూ. 7,000 కోట్లను కోల్పోయేందుకు సిద్ధపడవలసిందని ఎస్సార్ స్టీల్ రుణ దాతలకు ఆర్సిలార్ మిత్తల్  అల్టిమేటం జారీ చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ రూలింగ్‌కు వ్యతిరేకంగా ఆర్సిలార్ మిత్తల్ చేసుకున్న అభ్యర్థనపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు బుధవారంనాడు అంగీకరించినప్పటికీ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎస్సార్ స్టీల్‌కు బిడ్ చేసే అర్ఙత సంపాదించడానికి ఉత్తమ్ గాల్వా, కె.ఎస్.ఎస్ పెట్రాన్‌లు ఎగవేసిన రుణాలను మూడు రోజుల లోపల చెల్లించవలసిందని ఆర్సిలార్ మిత్తల్‌ను  అప్పిలేట్ ట్రైబ్యునల్ గత శుక్రవారంనాడు ఆదేశించింది. అయితే, బకాయిలు తీర్చడానికి బదులుగా ఆర్సిలార్ మిత్తల్ సోమవారం తన బిడ్‌ను సవరించింది. అంటే, సవరించిన ఆఫర్‌ను ఆమోదించి, తనను విజేతగా ప్రకటించవలసిందని లేదా సుప్రీం కోర్టులో ఘర్షణకు సిద్ధపడవలసిందని రుణ దాతలకు చెప్పకనే చెప్పింది. సుప్రీం కోర్టులో తగవు తేల్చుకునేందుకు ఆర్సిలార్ మిత్తల్ మొగ్గు చూపితే,  ఉత్తమ్  గాల్వా, కె.పి.ఎస్ పెట్రాన్‌లు తమకివ్వాల్సిన రూ. 7000 కోట్లను తిరిగి పొందే అవకాశాన్ని రుణ దాతలు చేజార్చుకున్నట్లు అవుతుంది. అప్పు తీర్చాల్సిందిగా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని ఆర్సిలార్ మిత్తల్ సవాల్ చేస్తోంది.  ఆ రెండు కంపెనీల నుంచి తాను ఇది వరకే నిష్క్రమించానని, వాటి బకాయిలకు తనకు సంబంధం లేదని చెబుతోంది. సుప్రీం కోర్టు కనుక దాని వైఖరినే సమర్థిస్తే, రుణ పరిష్కారానికి దొరికిన అవకాశాన్ని రుణ దాతలు కోల్పోయినట్లు అవుతుంది. 

ఇంతకుముందు ఇవ్వజూపిన రూ. 33,000 కోట్ల మొత్తాన్ని సవరించి రూ. 42,000 కోట్లు ఇచ్చేందుకు ఆర్సిలార్ మిత్తల్ సోమవారం సిద్ధపడింది. గ్రూప్ కంపెనీల బకాయిలను చెల్లించేందుకు అనుసరించవలసిన పద్ధతిని సూచించవలసిందిగా రుణ దాతల కమిటీని కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం. ఖాన్విల్కర్, డి.వై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అభ్యర్థనపై వాదనలు వినేందుకు అంగీకరించింది. 


సుమారు రూ. 7,000 కోట్ల మేరకు ఉన్న బకాయిలు చెల్లించేందుకు అప్పిలేట్ ట్రైబ్యునల్ విధించిన గడువు మంగళవారంతో ముగిసింది.  కానీ, రుణ దాతలు ఇప్పుడు తదుపరి చర్య తీసుకునే ముందు సుప్రీం కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఎస్సార్ స్టీల్ స్వాధీనానికి వీటీబీ బ్యాంక్ అండ ఉన్న నుమెటల్‌కు కూడా ఈ వాదనలతో ప్రమేయం ఉంది. ఎందుకంటే, అది గత శుక్రవారంనాడు ఈ అంశంపై కేవియట్ దాఖలు చేసింది. ఈ విషయంలో రుణ దాతల కమిటీకి, రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు కూడా నోటీసులు జారీ కానున్నాయి. నుమెటల్ వాదనలు వినకుండా ఈ కేసులో ఉత్తర్వు జారీ చేయవద్దని కోర్టును కోరుతూ అది కేవియట్ వేసింది. చితికిపోయిన ఆస్తికి వీలైనంత ఉత్తమ ధరను రాబట్టుకునేందుకు బిడ్డర్లతో చర్చలు జరిపే అధికారాన్ని రుణ దాతల కమిటీకి ఇస్తున్నట్లు అప్పిలేట్ ట్రైబ్యునల్ శుక్రవారం ప్రకటించింది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్ నుంచి రూ. 49,000 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు ఎస్బీఐ నేతృత్వంలో ఫినాన్షియల్ రుణ దాతలు ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగుల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

English Title
Essar Steel is ultimate for debt lenders
Related News