శ్రమైక వర్ణ సౌందర్యం

Updated By ManamSun, 09/23/2018 - 07:41
nature beauty

image‘కళ కళ కోసం కాదు.., సమాజం కోసం’ అని నమ్ముతారు సమకాలీన పాకిస్థాన్ చిత్రకారుడు సల్మాన్ తూర్. తాను నమ్మిన సిద్ధాంతాన్నే తన కాన్వాసులపై ఆవిష్కరిస్తాడాయన. పాకిస్థాన్ సమాజంలోని నిమ్నోన్నతాలకు తూర్ పెయింటింగ్‌లు అద్దం పడతాయి. మానవ సమాజం బడుగు, మధ్య, ఉన్నత తరగతులుగా విడిపోయిన వైనం మనకు ఆయన కాన్వాసుల్లో సజీవంగా కనిపిస్తుంది. ఇంతటి హెచ్చుతగ్గులతో కూడిన మెట్ల సమాజంలో కూడా మనుషుల మధ్య మానవసంబంధాలు సజీవంగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ సంబంధాలు సయోధ్యతోను, మరికొన్ని సందర్భాల్లో సంఘర్షణతోను ముడిపడి ఉంటాయి. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులకు తమ డ్రైవర్లతోను, పిల్లల్ని సాకే దాదులతోను, ఇంటి పని చేసే సేవకులతోను, వంటమనుషులతోను సామాజిక సంబంధాలుంటాయి. కానీ ఇలాంటి సంబంధాల్లో మనకు దగ్గరితనం కంటే ఎన్నటికీ ఒకటి కాలేని దూరాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సంబంధాల్లో అంతర్గతంగా దాగిన ‘సన్నిహితత్వాని’కి తూర్ తన పెయింటింగ్‌ల్లో చిత్రిక పట్టారు. పేదరికానికి - ధనస్వామ్యానికి, సంతోషానికి - దుఃఖానికి మధ్య ఉన్న అతి సన్నని రేఖను ఆయన చెరిపే ప్రయత్నం చేశారు. 

లాహోర్‌లోని ఒక ధనిక కుటుంబంలో 1983లో జన్మించిన సల్మాన్ తూర్ న్యూయార్క్, పాకిస్థాన్‌లలో తన చిత్రాల్నిimage ప్రదర్శిస్తుంటారు. న్యూయార్క్‌లోని ప్రాట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన 2009లో ఆర్ట్‌లో ఎంఎఫ్‌ఎ పూర్తి చేశారు. తన జీవితంలో ‘సేవకుల’తో పెనవేసుకు పోయిన సంబంధాన్ని ఆయన ఎంతో ఆర్ద్రంగా కాన్వాసుల మీద చిత్రీకరిస్తారు. ధనికులు, పేదల మధ్య వర్గవైషమ్యం మాత్రమే సాధారణంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండు వర్గాల మధ్య సంబంధాల్లో ఇంతవరకు ఎవ్వరూ చూడని ఒక కొత్తకోణాన్ని తూర్ తన పెయింటింగ్‌ల్లో ఆవిష్కరిస్తున్నారు. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత గైడి మొపాసా, పాకిస్థాన్ ఆధునిక రచయిత దనియాల్ మొయినుద్దీన్ వంటి వారి రచనల్లోని కథా సంవిధానం తూర్‌కు ప్రేరణగా నిలిచింది. అలాగే వెనీషియన్ ఆర్టిస్టులు పావ్లోవెరొనీస్ వంటి చిత్రకారుల వర్ణవిన్యాసం కూడా తూర్‌కు స్ఫూర్తిదాయకమైంది. ఒక ఫొటోగ్రాఫ్ చేయలేని పనిని పెయింటింగ్ చేసినప్పుడే ఆ పెయింటింగ్ పూర్తిస్థాయి సార్థకతను సాధిస్తుందని ఆయన నమ్ముతారు.  

imageవ్యంగ్యం, సౌందర్యం, పేదరికం కలిసి ఉండడమే తూర్ చిత్రాల్లోని ప్రత్యేకత. సాధారణంగా సమకాలీన చిత్రశైలిలో ముఖ్యంగా ఫిగరేటివ్ శైలిలో వ్యక్తుల ముఖాల్లో భావోద్వేగాల్ని ప్రతిఫలింపజేయడమన్నది అప్రధానమైన విషయం. ఉదాహరణకు ఆయన చిత్రించిన ‘మెయిడ్ విత్ ఫ్లవర్స్’ అనే చిత్రంలో ఒక సేవకురాలు చిన్నచిన్న పూలకుండీల మధ్య కాఫీ కప్పుల్ని తీసుకువస్తున్నట్టుగా ఉంటుంది. అయితే ఆ సేవకురాలి వెనుక చిత్రించిన నేపథ్య దృశ్యం కార్టూన్‌శైలిలోని ల్యాండ్‌స్కేప్‌లా ఉంటుంది. ఈ ల్యాండ్‌స్కేప్ సమాజంలోని ఎగువ మధ్య తరగతి వర్గానికి చెందిన స్వాప్నిక జగత్తుకు సంబంధించింది. ఈ స్వాప్నిక జగత్తు గాలిబుడగలాంటింది. అందుకే దీన్ని కార్టూన్ శైలిలో చిత్రించారు తూర్. 
తన పెయింటింగ్‌లలో ఆయిల్ కలర్స్, చార్‌కోల్ వంటి మాధ్యమాల్ని ఆయన ఉపయోగిస్తుంటారు. డ్రాయింగ్ ఆయనకు అభిమాన విషయం. నేటి సమకాలీన ఆర్ట్ ప్రపంచంలో ఫొటోగ్రఫీ మీద ఆధారపడి చిత్రించే ‘హైపర్ రియలిజం’ అనే శైలికి ఆదరణ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, సమాజాన్ని తనదైన సొంత భాషలో వ్యాఖ్యానించే తూర్ శైలి విమర్శకుల ప్రశంసలకు పాత్రమైంది. 

‘‘పేద, ధనిక తారతమ్యాలతో నిండిన పాకిస్థాన్ బూర్జువా వ్యవస్థలో పనివాళ్ళు విరివిగా కనిపిస్తూనే ఉంటారు. మనుషుల్ని యధాతథంగా చిత్రీకరించాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఎవరైనా నన్ను అడిగితే, లాహోరు నగర వీధుల్లోకి వెళ్ళమంటాను, అక్కడి పాతబస్తీలోని ఫుడ్‌స్ట్రీట్‌ను చూడమంటాను, వీధుల్లో అసంఖ్యాకంగా తిరిగే మోటారు సైకిళ్ళను చూడమంటాను. ఇలాంటి వీధుల్లో సామాన్యులు తిరుగాడుతుంటారు. వారి హావభావాలు, శరీర సౌష్టవం రోమన్ శిల్పాల్ని తలపిస్తుంది. వాళ్ళు తమ దేహాల మీద ఎలాంటి శ్రద్ధ లేకుండా తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తుల్లో మనకు ఈ మానవ సహజ లక్షణం కనిపించదు. వీధుల్లో జీవితం కన్నా ఒక ఆర్టిస్టుకు మంచి గురువు లేడని నేను నమ్ముతాను’’ అని తూర్ చెబుతున్నారు. తూర్ చిత్రాలు కేవలం ఒక దృశ్యానికి ప్రతిబింబం కాదు, అది ఒక సామాజిక సన్నివేశానికి మొహమాటం లేని సూటి వ్యాఖ్యానం. ఇలాంటి సూటిదనమే మనం సమకాలీన చిత్రకారుల నుంచి ఆశించదగిన అమూల్యమైన కానుక. 
- పసుపులేటి గీత 

English Title
Gorgeous nature beauty
Related News