శత రాగాల ఫిడేలు

Updated By ManamMon, 02/19/2018 - 02:06
image

imageతెలుగు కవితారంగాన్ని సుమారు మూడు దశాబ్దాలుగా, ఏకఛత్రాధిపత్యంగా ఏలిన భావకవిత్వం గతానుగతికమై, క్రమంగా ప్రవాహగతిని కోల్పోయి, నిలువ నీటికాసారంగా మిగిలిపోయిన రోజుల్లో, కవిత్వంలో కొత్తదారులు అన్వేషించిన వారిలో పఠాభి ముఖ్యులు. జీవితంలోనూ, కవిత్వంలోనూ, తిరుగుబాటును ప్రదర్శిం చిన కవి పఠాభి. సమకాలంలోనూ, కాలంకంటె ముందువున్న కవి, తెలుగు కవిత్వం ఆధునికత దశలోకి ప్రవేశించక మునుపే ఆత్యాధు నికతను ప్రదర్శించిన కవి. ‘‘నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరుగదంతాను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేసిన కవి. అచ్చయిన తన తొలికావ్యం ‘‘ఫిడేలు రాగాల డజన్’’తో అంతకు ముందు కవితారంగంలో వేళ్లునికొని వున్న సమస్త సంప్రదా యాలను ధ్వంసం చేసింది. తర్వాతి కాలంలో వచన కవితా ప్రక్రియ వ్యాప్తికి దారులు సుగమం చేసింది. ఫిడేలు రాగాల డజన్(1939). కవిత్వంలో ప్రయోగ ప్రియత్వానికే నీలగిరి నీలిమలు. (1950) కయత నా దయత(1978) భాష విూద ప్రభుతకు, ఛందో వైవిధ్యానికి, పఠాభి పంచాగం(1980) అధిక్షాపానికీ, చమత్కార ప్రియత్వానికి నిదర్శనాలు.

తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు తీసి నష్టపోయిన పఠాభి, కన్నడంలో సంస్కార, చండమారుత, శృంగారవిూస వంటి విజయ వంతమైన చిత్రాల దర్శకుడు. గణితంలో ఆసక్తివున్న పఠాభి, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత సమస్య ‘ఫెర్మాట్ నంబర్ ధియరీ’లో కొంత కృషి చేశారు. ప్రాయిడ్‌మన్ విశ్లేషణ, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాలతో పాటు, షెల్లీ, కేట్సు, విట్మన్, వైక్ట్, ఠాగురు, చలం, శ్రీశ్రీ రచనలు పఠాభిని ప్ర భావితం చేసిన అంశాలు. తొలినాళ్లలో భావకవిత్వం ప్రభావంతో యవ్వన స్వప్నము, ఆవేదన, వంటి ఖండకావ్య సంపుటాలు రాసినా, అముద్రితంగానే వుండి పోయాయి. దానికి కారణం శ్రీశ్రీ తన అనంతంలో ఇలా నమోదు చేసాడు’’. పఠాభి తాను పాతబాణీలో రాసిన వంద పేజీలకు పైగా సాగిన ఖండకావ్య సంపుటి ఒకటి, ‘‘ఫిడేలు రాగాల డజన్’’ ఒకటీ నాకిచ్చి, ‘‘ఇందులో ఏది ముందుగా అచ్చేస్తే బాగుం టుందని’’ నన్ను అడిగాడు రెండాఅపూ తిరిగేసి అక్కడక్కడ చదివి పద్యాల పుస్తకం అతనికిచ్చేసి, ‘దాని సంగతి మర్చిపో’ అన్నాను. ‘‘ఆ రకంగా పఠాభి ప్రణయ కవిత్వం వెనకపడి ఫిడేలు రాగాల డజన్ ముందుకొచ్చింది. దానికి శ్రీశ్రీ ఇంట్రీ కూడా రాయడం జరిగింది. అందాల హరివిల్లు లాంటి శాంతినికేతనం జీవితం నుండి, యునివర్సీటీ చదువు కోసం చిత్‌పూర్ రోడ్డులోని ఇరుకు గదుల నివాసం, అకుడి నగర జీవితం ఉక్కిరి బిక్కిరి చేసింది. కలకత్తాలో తాను అనుభవిం చిన యాంత్రిక జీవనాన్ని తర్వాత మద్రాసు నగరానికి అన్వయించి ‘రాగాల డజన్’ రాసారు. తెలుగులో వచ్చిన మొట్టమొదటి వచన కవితా సంపుటిగా, నగర కావ్యంగా, ఫిడేలు రాగాల డజన్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే సమకాలంలో చలం, శ్రీశ్రీ, ఆరుద్ర, వంటి ఒకరిద్దరు తప్ప ఆ కావ్యాన్ని ఆహ్వానించలేకపోయారు, ఆస్వాదించలేకపోయారు. దిగంబరులకంటె ముందు, అంతకంటె ఎక్కువ స్థాయిలో దాడిని ఎదుర్కొన్న కావ్య సంపుటి, ఫిడేలు రాగాల డజన్. వెల్చేరు నారాయణరావు ‘తన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ గ్రంథంలో పఠాభి అలా ఎందుకు రాయల్సి వచ్చిందో విశ్లేషణ చేసేవరకు దాని విూది నీలినీడలు తొలగిపోలేదు. దీనిలోని ‘ఆత్మకథ’ ఖండిక మొత్తం పఠాభి కవిత్వానికి మేనొఫెస్టో వంటిది. తన కవితాతత్వం గురించి, భావజాలం గురించి, భాషాప్రయోగం, సంవిధానం గురించిన అంశాలను పఠాభి ప్రసా ్తవించారు. భోగంచాన, కామాక్షికోక, పోలిసు, నగరంలో జాబిల్లి, వంటి ఖండికలు పఠాభి కవితా పారమ్యాన్ని పంచే కవితలు.

దాదాపు ఎనిమిది దశాబ్ధాల క్రితం వెలువడ్డ ‘ఫిడేలు రాగాల డజన్’ తనను చాలా ప్రభావితం చేసిందని ఆరుద్ర స్వయంగా ప్రకటించుకున్నారు. ఈనాడు ఆరుద్ర ముద్ర అనేదంతా నిస్సందేహంగా పఠాభిముద్రే. దానిని దాటి ఆరుద్ర బయటపడలేదని శ్రీశ్రీ ఒకచోట ప్రకటించారు. పాతను తోసిపుచ్చి కొత్త ప్రక్రియ పురుడుపోసుకున్న ఆ సమయంలో సంప్రదాయ కవులు విరుచుకుపడ్డారు, మండిపడ్డారు, ఛందోజ్ఞానం లేదు, ఈ కొత్త కవులు అన్నీ సంకరం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ప్రక్రియ విమర్శలకు గురికావటం తెలుగు కవిత్వంలో కొత్త ఏమీ కాదు

శ్రీశ్రీ సూచనలతో తన ప్రణయ కవిత్వం అచ్చువేయడం మాను కున్నాడు. కానీ, వచన పద్యాల దుడ్డుకర్రలతో పద్యాల నడుములు విరగదంతాను’ అన్నాడు కానీ, చిన్నప్పటి నుంచి తాను అభిమానించి, గొప్ప అభినివేశం సంపాదించుకున్న సంప్రదాయ మాత్రాఛందుసులపై మోజును మాత్రం ఒదులుకోలేకపోయాడు. నిజానికి 1939లోనే ఫిడేలు రాగాల డజన్ వంటి అత్యాధునిక ప్రయోగశాల వంటి వచన కవితా సంపుటి వెలువరించాక, 1977లో ప్రాచీనభాష, వస్తువు, ఛందస్సులను ఆశ్రయించి కొనసాగిన ‘కయత నాదయత’ను మరొక కవి అయితే వెలువరించి వుండకపోవును. ఈ పీఠికాకర్త పఠాభిని చేసిన ఇంటర్‌వ్యూతో వచనకవితలు, మాత్రాఛందస్సు, పన్‌చాంగం ఈ మూడు ప్రక్రియలను తాను ఏకకాలంలో ప్రారంభించి, వివిధ దశలలో కొనసాగించానని స్వయంగా చెప్పుకున్నాడు. ఇది ఒకరకంగా భావజాల పరంగా వైరుధ్యం అనే చెప్పుకోవాలి. ‘‘చివరి ప్రాసలనాభి/ చిత్రమైన పఠాభి/కావ్య సుధల పఠాభి/ ఓ కూనలమ్మ అని ఆరుద్ర కితాబు యిచ్చినా, కయత నాదయతకు రాసిన ముందు మాటలో ఆ కావ్యానికున్న పరిమితులను ‘‘సత్కవులందరిలో కనిపించే సద్భావనలన్నీ ఈ సంపుటిలో అక్కడక్కడా కనబడతాయి. సంవిధాన పులతాగుల్మాలలో ఆకుసుమాలు మరుగున పడతాయి’’ ఆరుద్ర సరిగ్గానే అంచనా వేసారు.

ఇక పఠాభి మూడో గ్రంథం, పఠాభి పన్‌చాంగం. వ్యంగపు వజ్రపుతునకలు ఫిడేలు రాగాల పజన్ వంటి అధిక్షాప వచనకవితా సంపుటి, ఛందస్సును మైనపు ముద్దలా మలచిన కయత నాదయత ‘గేయసంపుటి వంటి రచనలు చేసిన పఠాభి తనలో సహజ సిద్ధంగా వున్న హాస్యచతురత, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను, వ్యంగ్య వైభవాన్ని మేళవించి ‘పన్‌చాంగం’ రచించారు. ఇంగ్లీషులో వున్న ఫన్ ను, తెలుగు పంచాంగం’ ను మేళవించి, ‘పంన్‌చాంగం’ అనే కొత్త పదబంధాన్ని సృష్టించి పన్‌లను రాసారు. 1947 లో ఆనంద వాణి పత్రికలో కొన్ని, 1964లో జ్యోతి మాసపత్రికలో పూర్తిగాను, ఆంగ్లంలో ఆస్కార్ వైల్డ్, తెలుగులో సి.ఆర్.రెడ్డి ఒక సందర్భంలో, విద్యాధికారి అంటే ‘విద్యకు అరి’ అని చెప్పిన పన్‌ల ప్రేరణలో 365 పన్‌లను రాశారు. ఒకరకంగా సమకాలీన సామాజిక వ్యవస్ధకు వ్యాఖానం ఈ పన్‌లు. ఇందులో రాజ కీయాలు, మతం, భాష, పెళ్లిళ్లు, సినిమా, మద్యపానం, శృంగారం వం టి అనేక అంశాలు స్పృశించబడ్డాయి. తనదైన లోచూపుతో కొత్త పదా లను అన్వేషించి, పఠాభి ఈ పన్‌లకు సాహిత్య గౌరవం కల్పించాడు.

‘‘మన జాతిలో సవర్ణ వివాహాలు/ సవర్ణ వివాహాలు పోవాలి; దంతి కన్న వదంతి పెద్దది. కారుకన్న పుకారు స్వీటు; పొగాకు పగాకు’ వంటి పన్‌లు అటు చమత్కారంతో పాటు సామాజిక ప్రయోజనం కలిగివున్నవి. వేసినా, తీసినా బాధకలిగించేవి పన్నులు అని ‘పన్ను’ విూద పఠాభి చెప్పిన పన్ విని నవ్వనివారుండరు. అందుకే ఆరు పన్ను లలో సంపన్నుజువర్మా’ అని చమత్కరించాడు’’ పఠాభి. పన్ చంగం లోని పసిడి పలుకుల విటమిన్‌బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే మనస్సుకి ఆరోగ్యం, ఉల్లాసం సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను, అని శ్రీశ్రీ అన్నాడంటే ఈ పన్‌లో ఎంత శక్తిమంతమైనవో అర్థంచేసుకొవచ్చు. వచన కవితను  చేపట్టినా, మాత్రాఛందస్సులలో గేయాలు నడిపించినా, చిన్నిచిన్ని మాటల విడుపులో పెద్ద అర్థాలు స్ఫురింపజేసినా అన్నిటా పఠాభి ప్రయోగాలకు పట్టంకట్టిన కవి. ఆధునికులలో అత్యాధునిక కవి. అయితే ఈ త్రిపుటిలో ‘ఫిడేలురాగాల డజన్’ పఠాభి మాగ్నమ్ ఓపన్ అని చెప్పక తప్పదు.  
- శిఖామణి
9848202526

English Title
hundred tunes of fidele
Related News