ఫేసర్ షమీకి మ్యాచ్ ఫిక్సింగ్ మరక!

Updated By ManamWed, 03/14/2018 - 15:05
shami
shami

భారత ఫేసర్ మహ్మద్ షమీకి మ్యాచ్ ఫిక్సింగ్ బురద అంటుకుంది. షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అతని భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలను బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇంగ్లండ్‌కు చెందిన వ్యాపారవేత్త మహ్మద్ భాయ్ కోరిన మేరకు పాకిస్థాన్‌కు చెందిన అలిష్బా అనే అమ్మాయి నుంచి షమీ డబ్బులు తీసుకున్నారంటూ హాసిన్ జహాన్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్(ఏసీఎస్‌యూ)ను సీఓఏ ఆదేశించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరిన సీఓఏ...ప్రధానంగా షమీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలను లోతుగా పరిశీలించాలని సూచించింది. 

మహ్మద్ షమీ తనను గృహ హింసకు గురిచేస్తున్నాడని అతని భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. షమీకి పలువురు అమ్మాయిలతోనూ లైంగిక సంబంధాలున్నాయంటూ ఆరోపణలు చేయడంతో పాటు...వారి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలను కూడా బయటపెట్టింది. తనపై షమీ అతని సోదరుడి చేత అత్యాచారం చేయించేందుకు కూడా ప్రయత్నించాడని ఆరోపించింది. షమీపై ఆయన భార్య సంచలన ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అతని వార్షిక కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. 

English Title
Indian pacer Mohammad Shami to be investigated for match-fixing
Related News