ఇది బుద్ధ వచన ప్రామాణికతకు దర్పణం

Updated By ManamMon, 02/19/2018 - 02:32
book

ఇది శ్రీ దేవన చంద్రశేఖర్ చేసిన పరి శోధన గ్రంథం ‘‘బుద్ధవచన ప్రామాణికత’’. దీనిని పీకాక్ బుక్స్ హైదరాబాద్ వారు ప్రచురించారు. మొన్న జనవరిలో విజయవా డ 29వ పుస్తక మహోత్సవంలో కొద్దిమంది మిత్రుల మధ్య ఆవిష్కరించటం జరిగింది.  బుద్ధుని జీవితం గురించి, ఆయన బోధనల గురించి విస్తృత చర్చ జరుగుతోంది. చిన్న పత్రికల నుంచి పెద్ద పత్రికల దాకా బౌద్ధం పట్ల, దాని సాహిత్యం, తాత్విక చింతన పట్ల ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న అనేక రచనల్లో అనేక భిన్నాభి ప్రాయాలు బయలుదేరాయి. కొంత కాలంగా ఈ భిన్నాభిప్రాయాల్లోని వాటిలో ఏది నిజం? ఏది వైరల్? అనే దిశగా ఆలోచనలు సాగుతు న్నాయి. చంద్రశేఖర్‌కు బౌద్ధంపై మంచి అధ్యయనం ఉంది. అందుకు గతంలో ఆయన చేసిన ఎన్నో విలువైన అనువాదాలు రచనలు మంచి ఉదాహరణలు. బౌద్ధ ధర్మసారం, గౌతమ బుద్ధుడు, బుద్ధుని జ్ఞాన సిద్ధాంత సూచిక కాలామసుత్తం, ధర్మావరణం, బుద్ధుని సొంతమాటల్లో సమ్మావాచ, అశేష నిరోధం మరియు ధ్యాన ఫలితం, ఇప్పుడు ఈ బుద్ధ వచన ప్రామాణికతను కాలానుసారం వల్లనే విడుదలచేశారు.

ఈ పరిశోధనా గ్రంథానికి మంచి ముందుమాట కూడా రచయితే రాసుకున్నారు. మొత్తంగా పది అధ్యాయాలున్నాయి. తొలి అధ్యాయంలో బుద్ధవచన ప్రామాణికతను అధ్యయనం చేయటం ఎందుకు? అనే ప్రశ్నతో మొదలౌతుంది. ఇందులోనే అయిదు ముఖ్యమైన ప్రశ్నలను ముందుంచుకొని వాటికి సమాధానాలు పొందుపరిచారు. అవి కాలానికీ, ఆనాటి హిందూ మతానికి, బౌద్ధానికీ ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చెప్పటం ఉంది. రెండో అధ్యాయంలో బుద్ధ వచనాన్ని నిక్షిప్తం చేశాయని చెప్పబడిన ప్రాచీన బౌద్ధగ్రంథాలు మనకు (లోకానికి) ఎప్పుడు ఎలా అందుబాటులోకి వచ్చాయో తెలియపరిచే వివరా లున్నాయి. మూడోది, బుద్ధవచన ప్రామాణికతకు ఒక నిర్దిష్ట నిర్వ చనాన్ని ప్రతిపాదిస్తూ, దానిని చర్చించిన పద్ధతిని, పరిధిని స్థూలంగా వివరిస్తుంది. 
ఇక నాలుగు నుంచి ఎనిమిది దాకా ప్రాచీన బౌద్ధ గ్రంథాలు, మరికొన్ని అనుబంధ వనరుల ద్వారా భారతదేశ చరిత్రలో బుద్ధుని కాలం నాటి భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక, సామాజిక పరిణామాలను విశ్లేషిస్తూ, బుద్ధ వచన ప్రామాణికతను చర్చించటం చేశారు. మరి తొమ్మిదవది మూలగ్రంథాల్లో చోటు చేసుకున్న భిన్నమైన, పరస్పర విరుద్ధమైన కొన్ని అసంగత సత్యాలను చర్చించారు. చిట్ట చివరిదైన పదో అధ్యాయంలో గత 25 శతాబ్దాలకు పైబడి బౌద్ధ అనుయాయులు బౌద్ధాన్ని ఒక జీవన మార్గంగా అవలంభించదలచిన వారు బుద్ధ వచన ప్రామాణికత అనే విషయాన్ని ఎలా పరిగణించారనే విష యాలను ఉటంకిస్తూ వాటి ఆధారంగా ప్రామాణికతను మరో భిన్నమైన కోణంలో వివరించారు. ఇలా ఈ గ్రంథాన్ని పాఠకులకు ఏది ఎక్కడ ఏ ప్రధాన అంశాలతో కూర్చటం జరిగిందో రచయితే ముందుమాట ద్వారా చెప్పి చదూవరులను మరింతగా తన మార్గంవైపు ఆకర్షించటం కనిపిస్తుంది. అలాగే ఈ గ్రంథ రచనలో భాగమైన ప్రధాన వనరులు ఏఏ గ్రంథాల లోంచి తీసుకున్నారో కూడా చక్కటి సమాచారం చివర్లో చూపించారు. అవి చూశాక రచయితగా చంద్రశేఖర్ పడిన కష్టం మరింతగా గుండెలకద్దుకుంటుంది.

అసలు బుద్ధవచనమేదో, కానిదేదో తేల్చుకోవటానికి పాఠకులు పడుతున్న గందరగోళాల్ని సులభమార్గంలో తొలగించేందుకు, తాను లోతైన పరిశీలన చేసి అందించిన గ్రంథంగా నిలుస్తుంది. పాలుకు పాలూ, నీళ్ళకు నీళ్ళూగా బౌద్ధాన్ని ఒక కాపుకాచే మెరుగై పరిశోధన గానూ ఉంటుంది. ఈ గ్రంథం చదవటం పూర్తిచేసిన వాళ్ళు, తామే స్వయంగా బుద్ధవచనంలో ఉన్న సత్యశోధనల రూపాల్ని పసిగట్టగలరు. మయన్మార్‌లో జరిగిన ఒక జాతి నిర్మూలనలో కీలక భూమిక పోషించిన బౌద్ధ రూపం షిలాని కిరాయితనాన్ని ఎండగట్టాలన్నా ఈ గ్రంథం కరదీపికలా ఉంటుంది. ఇవాళ ఆధునిక భావాలు గల వారు ఆకర్షించినా, విమర్శకులు బుద్ధుడు చాలడు అని వ్యాఖ్యానించినా, తమకు అనువైన రీతిలో మలచుకొని ఇదే బౌద్ధం అని బుకాయించే వారికి, అనేక కుతర్కాలకూ ఈ ప్రామాణిక గ్రంథం ధీటుగానే సమాధానం ఇస్తుంది.

క్రీ.పూ. 563లో జన్మించి, 483లో మరణించిన బుద్ధుడు తన 80 ఏళ్ల జీవితాన్ని అన్ని కోణాల్లో కాలాన్ని పట్టికొని చేసిన ఈ బోధనలు ఇవాళ్టికీ మన సమాజంలో నిలుస్తూన్నాయంటే రాహుల్ సాంకృత్యాయన్ అన్నట్టుగా మహా మానవుడు బుద్ధుడు.
మరో ముఖ్యభూమిక ఏమంటే ఇవాళ తెలుగువారి రాజధాని ‘‘అమరావతి’’ కావటంతో బౌద్ధ ధర్మసారాంశం విశ్వసృష్టిలో తిరిగి ద్విగుణీకృతమైనట్టుంది. ఈ ప్రభావంలోంచి మొన్న స్వరాజ్య మైదా నంలో రాష్ట్ర ప్రభుత్వమే పూనుకొని గ్లోబల్ పీస్ ఏర్పడాలంటూ రెండు వేలమంది బౌద్ధ బిక్షువులను ఆహ్వానించి రెండు రోజుల పాటు సెమి నార్ నిర్వహించింది. విజయవాడ నగరాన్ని బిక్షువులు సందర్శిం చినందుకు వారి బోధనల నుంచి ప్రజలు ప్రేరణపొందాలని టూరిజం శాఖ మంత్రి తమ సందేశంలో ఆశించారు. 
ఉపసంహారం: బుద్ధుని చుట్టూ తిరుగుతున్న కాలాన్ని అర్థం చేసుకోవటానికి చంద్రశేఖర్ అందించిన ఈ బుద్ధవచన ప్రామాణికత గ్రంథం తప్పక సాయం అందిస్తుందని గట్టి నమ్మకం.

-  సజ్జా వెంకటేశ్వర్లు
9951169967

English Title
It is a miracle to the Buddha's textual authenticity
Related News