మల్లన్న సన్నిధిలో ‘కొల్లు’

Updated By ManamSat, 09/08/2018 - 23:04
Kollu
  • భవన నిర్మాణాలు పూర్తికాగానే అమరావతిలో హైకోర్టు 

  • రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

శ్రీశైలం: అమరావతిలో భవన నిర్మాణాలు పూర్తికాగానే హైకోర్టును ఏర్పాటు చేస్తామని న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని మంత్రి కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం అధికారులు మంత్రిని సత్కరించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని  కొన్నేళ్లుగా డిమాండ్ బలంగా వినిపిస్తోందన్నారు.

image


ఈ అంశానికి సంబంధించి సీఎం కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారన్నారు. సుప్రీం, హైకోర్టు న్యాయనిపుణల సలహాలు తీసుకుని ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర సహాయం లేకపోయినా.. నాలుగేళ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, నిరుద్యోగ భృతి తదితర ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి చొప్పున భృతి అందజేస్తామన్నారు. అలాగే భృతితో చేతులు దులుపుకోకుండా ఉద్యోగావకాశాలు కల్పించి స్కిల్ డెవెలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఏపీని నాలెడ్జ్ కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. కేంద్రం ఉద్ధేశపూర్వకంగానే ఏపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందన్నారు. పవన్, జగన్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ చంద్రబాబును ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కలసి వెళ్లేందుకు బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. ప్రతిపక్షాల మీద నమ్మకంలేకే అందరూ టీడీపీలోకి వస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరన్నారు. దేవుని దయ వల్ల రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయని, డ్యాంలన్నీ నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. అందరు సుఖశాంతులతో జీవించాలని మల్లన్నను కోరుకున్నానని మంత్రి వెల్లడించారు. 

English Title
'Kollu' in Mallanna temple
Related News