ఇకపై ‘తేజ్’లో రుణాలు

Updated By ManamTue, 08/28/2018 - 23:03
google pay,
  • ‘గూగుల్ పే’గా యాప్ పేరు మార్పు

  • బ్యాంకుఖాతాలో నిల్వల ఆధారంగా లోన్   

  • గూగుల్ ఫర్ ఇండియా సదస్సులో ప్రకటన

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన పేమెంట్ యాప్ ‘తేజ్’ పేరును ‘గూగుల్ పే’గా మార్చింది. అంతేకాక తేజ్ యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులకు ఇకపై రుణాలు కూడా ఇస్తామని ప్రకటించింది. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా నాలుగో ఎడిషన్ సదస్సులో సంస్థ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. తేజ్ యాప్ ద్వారా నగదు బదిలీ చేసిన వారికి ఇన్నాళ్లు సంస్థ స్క్రాచ్ కార్డులను ఇచ్చేది. వాటి ద్వారా ఖాతాదారులు కొంత లబ్ధి పొందేవారు. ఇప్పుడు రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో గూగుల్ పే(తేజ్) ప్రజలకు మరింత చేరువ అవుతుందని సంస్థ భావిస్తుంది. భారతదేశంలోని గూగుల్ పే వినియోగదారులకు తాత్కాలిక రుణాలు ఇచ్చేందుకు గూగుల్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహేంద్ర, ఫెడరల్ బ్యాంకులతో ఒప్పందం కూడా చేసుకుంది. వినియోగదారుని బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు, తేజ్ యాప్‌లో లావాదేవీల ఆధారంగా బ్యాంకులు రుణ పరిమితిని ముందే నిర్ణయిస్తాయి. 

image


ఈ మేరకు వినియోగదారుడు కోరినప్పుడు రుణం మంజూరు చేస్తాయి. రుణ మొత్తం, గడువు, ఈఎంఐ తదితర విషయాలన్నీ గూగుల్ పే యాప్‌లోనే కనిపిస్తాయి. అంతేకాక ఈఎంఐలను చెల్లించేందుకు వినియోగదారులు తమ గూగుల్ పే యాప్‌లో ఆటోపే ఆప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు. పేరు మార్పు, రుణ సదుపాయం మినహా యాప్ యథాతథంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. 2017, సెప్టెంబర్ 17న తేజ్ యాప్‌ను లాంచ్ చేశారు.

ప్రతి నెలా 2.2 కోట్ల మంది భారతీయులు తేజ్ యాప్‌లో లావాదేవీలు జరుపుతున్నారని, ఏడాదికి రెండు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నాయని, 1.2 లక్షల మంది చిన్న వ్యాపారులు తేజ్ సేవలు వినియోగించు కుంటున్నారని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా వెల్లడించారు. భారతదేశంలో రిటైల్ రంగంలో పెద్ద వ్యాపార సంస్థలైన బిగ్‌బజార్ వంటి వాటితో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సేన్‌గుప్తా తెలిపారు. ఈ ఏడాది దీపావళి నాటికి తేజ్ యాప్ పరిధి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక కోటి మంది యూజర్లు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్‌లోని 12వేల గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు గూగుల్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని సేన్‌గుప్తా ప్రకటించారు.

English Title
Loans in 'Tej' app




Related News