ఒంటబట్టే ‘వంట’

Updated By ManamSat, 09/01/2018 - 01:02
manam maithri special

‘ప్రపంచంలో చాలా మంది ఆకలితో ఉన్నారు. వారికి దైవం అన్నం రూపంలోనే దర్శనమిస్తాడు’ అన్నారు మహాత్మాగాంధీ. కడుపు నిండినప్పుడు ఎదుటివ్యక్తి తప్పుల్ని మన్నించే సహిష్ణుత దానికదే వస్తుంది. కడుపు మండినప్పుడు అంటే ఆకలితో అలమటించి పోతున్నప్పుడు మనిషి మనశ్శరీరాలు యావత్తూ అగ్నివీచికలవుతాయి. ఆ అగ్నిని చల్లార్చడం కన్నా గొప్ప విషయం మరొకటి లేదు. అందుకే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. కానీ నాలుక మీద రుచిమొగ్గలుంటాయి..., వాటిని మనం తెగ గారాబం చేస్తాం. దాంతో ‘ఇది కావాలి..., అది కావాలి’ అంటూ షడ్రుచుల జాబితాను మన ముందు పరుస్తుంది నాలుక.
image
మూడు పూటలుగా రోజును విడగొట్టి, ప్రతి పూటా పల్లెరాన్ని ముందు పెట్టుకుని, వంటగది కేసి చూస్తుంటాం. మనిషి జీవించడం కోసం తినాలే తప్ప, తినడం కోసం జీవించకూడదంటారు. కానీ ఇవాళ నాలుగు కాసులు చేతిలో మెదిలే వాడికి ఆహారమే ఒక వ్యసనంగా మారింది. దీనికి తోడు పలు రకాల ఫుడ్ చానెల్స్, పత్రికలు కూడా షడ్రశోపేతంగా కళ్ళకు తిండి పెడుతున్నాయి. దాంతో జిహ్వచాపల్యం అంతూ పొంతూ లేకుండా పెరిగి పోతోంది. ఆకలిని చల్లార్చడానికి, జీవన వ్యాపారాన్ని సజావుగా నడిపించే శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడిన ఆహారం, ఇవాళ లెక్కకు మించిన పక్వాలతో జనాన్ని ‘పొట్ట’నబెట్టుకుంటోంది. ఆరోగ్యాన్ని పెంచాల్సిన ఆహారం అనారోగ్యకారకంగా మారింది. ఇప్పుడిక మళ్ళీ నాలుక్కి కళ్ళాలు బిగించాల్సిన అవసరాన్ని గుర్తెరిగి ప్రవర్తించాల్సిన సమయమొచ్చేసింది. ఆహారంలోని పోషకాలు వృథా కాకుండా వండే కొత్త పద్ధతుల్ని కనిపెడుతున్నారు. ‘వంట’ అంటే రుచుల జాతర కాదు, నూరేళ్ళ ఆరోగ్యానికి సిరుల పంట అని గుర్తించాలి. ఈ దిశగా ‘పాకశాస్త్రానికి’ సంబంధించిన కొన్ని ఆరోగ్యకర పరిణామాల్ని ఇవాల్టి ‘మైత్రి’ మీ ముందుంచుతోంది.  

పోష‘కల్పవల్లి’
‘వన్‌పాట్ వన్‌షాట్’ (ఒపిఒఎస్) కుకింగ్

గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, టమోటా పప్పు, బీన్స్ వేపుడు..., ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణ భారతీయ వంటకాలు, ముఖ్యంగా తెలుగు వంటకాలు నోరూరిస్తాయి. తమిళ నాడు వంటిళ్ళలో గుబాళించే ఇంగువ పోపు పెట్టిన సాంబారు, కొబ్బరన్నం, అల్లం పచ్చడి... ఒకటేమిటి, పేర్లు వింటేనే ఆకటి దంచేస్తుంది కదా?! పప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి, ఒకటికి రెండు కప్పుల నీళ్ళు పోసి, నాలుగు విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టి, కాయగూరల్ని విడిగా ఉడక బెట్టి, రెండింటినీ కలిసి, నూనె, పోపుదినుసులు, కరివేపాకు, ఇంగువలతో పోపు పెట్టి, కొత్తిమీర చల్లితే... మీ నాలుక్కి ప్రాణం వస్తుంది... అయితే ఈలోగా పప్పు, కాయగూరల్లోని పోషకవిలువలు ‘హరీ’ మంటాయి. ఆహారం వండే వారికి ఆహ్లాదాన్ని, తినే వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వండడంలోని అనారోగ్యకరమైన ప్రక్రియ గురిం చి అర్థం చేసుకుని, మన వంటింటి సంప్రదాయాల్ని సంస్కరించి, పల్లెరంలో ఆరోగ్యాన్ని వడ్డించే ఒక సరికొత్త ప్రక్రియను కనిపెట్టారు ఒక దక్షిణ భారతీయుడు. ఆయన పేరు బి.రామకృష్ణన్..., అందరూ ముద్దుగా ‘రాంకీ’ అని పిలుచుకుంటారు. ఆహార పదార్థాల్లోని పోషకాలు నష్టపోకుండా కాపాడే ఈ కొత్త విధానం పేరు ‘వన్ పాట్ వన్ షాట్’. ఆహారంలో పోషక విలువలు ఏమాత్రం నష్టపోకుండా ఉండేందుకు ఉద్దేశించిన విధానం ఇది. 

వన్‌పాట్ వన్‌షాట్ అంటే ఏమిటి?
ఒపిఒఎస్ పద్ధతిలో దశలవారీగా కాకుం డా వంటనంతా ఒకే ఒక్కసారిగా పూర్తి చేయడమే విశేషం. వంట కాలు ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి వేలాది రకాలుగా ఉంటా యన్నది మనకు తెలిసిన విష యమే. అయితే ఒపిఒఎస్ పద్థతి లో మనం మామూలుగా చేసుకు నే వంటకాన్నే, కాస్త పద్ధతి మార్చి చేస్తామన్న మాట. ఉదా హరణకు ముందుగా ఉడికించి, తరువాత మిక్సీలో రుబ్బి, తరువాత వేయించే పద్ధతుల్ని అనుసరించి మనం తోటకూర వడల పులుసు వంటివి చేస్తాం. కానీ ఇన్ని ప్రక్రియల్ని అనుసరించడం వల్ల ఆకుకూర, పప్పుల్లోని పోషకాలు భారీ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుంది.ఒకేసారి పోపు వేసి, బాగా తక్కువ నీళ్ళతో ఒకటి లేదా రెండు విజల్స్‌తో ఉడికించి, దించేసి, వడ్డించేసుకోవడమే ఈ ‘ఒపిఒఎస్’ పద్ధతి. అంటే అటు సమయానికి సమయం, ఇటు పోషకాలకు పోషకాలు రెండూ పదిలమేనన్న మాట. పూర్తిగా ప్రెషర్‌కుక్కర్ మీద ఆధారపడిన ప్రక్రియ ఈ వన్‌పాట్ వన్‌షాట్.
 
ఏం కావాలి?
imageవన్‌పాట్ వన్‌షాట్ వంటకం కోసం ఇండక్షన్ స్టవ్ లేదా గ్యాస్ స్టవ్, ఒక ప్రెషర్ కుక్కర్, కొలత కోసం కప్పులు, స్పూన్లు, కత్తి, కాయగూరలు తరిగే బోర్డు వంటి పరికరాలు అవసరమవుతాయి. అయితే ఈ పద్ధతిలో విజయవంతంగా వంట చేయాలంటే, రెండు లీటర్ల ప్రెషర్‌కుక్కర్ తప్పనిసరి. వన్‌పాట్ వన్‌షాట్ పద్ధతిలో వంట కాల్ని సిద్ధం చేయడమన్నది ఇవాళ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పచ్చని, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటల ప్రక్రియే ఒపిఒఎస్ పద్ధతి అని రాంకీ విశ్వసిస్తున్నారు. ఈయన ఫేస్‌బుక్‌లో ఈ ఒపిఒఎస్ పద్ధతి కోసం ‘యునైటెడ్ బై ఫుడ్’ పేరిట ఒక గ్రూప్‌ను  కూడా నిర్వహిస్తున్నారు.
 
రాంకీ ఒక పాకశాస్త్ర నిపుణునిగా పశ్చిమాసియాకు వెళ్ళారు. అక్కడి స్థానిక వంటకాల్ని అధ్యయనం చేయడం కోసం ఆయన పలు వంటల పుస్తకాల్ని చదివారు. కానీ అవన్నీ చేయడానికి సంక్లిష్టంగా అనిపించడంతో, తక్కువ పరికరాలతో, తక్కువ సమయంలో, తేలిక పద్ధతిలో వండే ప్రక్రియను కనిపెట్టాలని ఆయన నిర్ణయించుకు న్నారు. దాంతో రాంకీ పలు ప్రయోగాలు చేసి, ఈ వన్‌పాట్ వన్‌షాట్ పద్ధతిని కనిపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియోల్ని రాంకీ పోస్ట్ చేసే వారు. ఆ వీడియోలకి మంచి ఆదరణ లభించింది. మనం వంటిళ్ళలో మామూలుగా వాడే ప్రెషర్ కుక్కర్‌కు కొన్ని మార్పులు చేసి ‘ప్రెషర్‌కుక్కర్’ని కాస్తా, ‘ప్రెషర్ బేకింగ్’గా మార్చారు రాంకీ. ఇప్పుడు దక్షిణ భారతదేశం ఈ వన్‌పాట్ వన్‌షాట్ వంటకాల మోజులో పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. 

కేవియర్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన అదరువు 

ఏదైనా విలువైన వస్తువు గురించి చెప్పమంటే మీరు దేని గురించి చెబుతారు..., మహా అయితే ‘బంగారం’ అని imageజవాబు చెబుతారు. కానీ ఆ బంగారానికన్నా విలువైన ఆహారపదార్థం ఒకటుంది, అదే ‘కేవియర్’! అత్యంత నాణ్యమైన, అరుదైన కేవియర్ కిలో పాతిక లక్షల రూపాయల వరకు ధర పలుకుతుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే కొన్ని సాధారణ బ్రాండ్లకు చెందిన కేవియర్ ఉత్పత్తులు తక్కువ ధరకు కూడా లభిస్తాయి. అసలు కేవియర్ అంటే ఏమిటి? కేవియర్ అంటే ఒకానొక అరుదైన చేపలోని గుడ్లు. మామూలుగా గుడ్లతో ఉన్న చేప దొరకడమే అరుదు. అయితే గుడ్లని కలిగిన చేపలన్నీ కేవియర్‌ను ఇవ్వలేవు. కేవలం ఉత్తర అమెరికా, యురేషియా ప్రాంతాల్లో మాత్రమే లభించే ‘స్టర్జన్’ అనే జాతికి చెందిన చేప గుడ్లను మాత్రమే ఖరీదైన కేవియర్‌గా పరిగణిస్తారు. కేవియర్ అంటే చేప గర్భాశయంలోని గుడ్లు. నల్లపూసల రాశిలాగా కనిపించే కేవియర్‌ను ఆహారంగా ఉపయోగించడమన్నది కొత్త అలవాటేమీ కాదు.

 మానవ చరిత్రలో పర్షియన్లు కేవియర్‌ను ఆహారంగా ఉపయోగించారు. కాస్పియన్ సముద్రంలోని ‘బెలూగా స్టర్జన్’ చేపల నుంచే అత్యంత ఖరీదైన కేవియర్‌ను తీస్తారు. కేవియర్ అన్నది ప్రాచీన గ్రీకు, రోమన్, రష్యన్ జార్ చక్రవర్తుల కాలం నుంచి సమాజంలో కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఖరీదైన ఆహార పదార్థం. చేపగుడ్లని ఉప్పులో మగ్గబెట్టడం ద్వారా రష్యన్లు కేవియర్‌ను తయారు చేస్తారు. ఈ భూమ్మీద 245 నుంచి 208 మిలియన్ సంవత్సరాల పూర్వమే జీవించిన ‘అసిపెన్సెరిడీ’ అనే జాతికి చెందిన చేపే స్టర్జన్. దీన్ని ప్రధానంగా నాలుగు ఉపజాతులుగా విభజించినప్పటికీ, ఇవాళ ఈ జాతి చేపలన్నీ పూర్తిగా అంతరించి పోయాయి.

అయితే ఆ ఉపజాతుల తాలూకు మరికొన్ని జాతులకు చెందిన చేపలు మాత్రం ఇప్పుడు కాస్పియన్ సముద్రంలో లభిస్తున్నాయి. ఈ చేపలు దాదాపు ఏడున్నర అడుగులు పెరుగుతాయి. యాభై నుంచి అరవై సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి పది లేదా పదిహేను సంవత్సరాల వయసు వచ్చిన తరువాతే సంతానోత్పత్తిని మొదలు పెడతాయి. ఈ చేపలు నెమ్మదిగా పెరుగుతాయి. సంతానోత్పత్తి కూడా అంతే మందకొడిగా ఉంటుంది. అందుకే ఈ చేపలు అంతరించి పోతున్న జీవజాతి జాబితాలో చేరిపోయాయి.

ఒక్కో స్టర్జన్ చేప గర్భాశయం నుంచి మూడు లక్షల గుడ్లు లభిస్తాయి. ఈ కారణం చేతనే వీటిని వేటాడడం ఎక్కువై పోయింది. కేవియర్‌లో ‘బెలూగా’, ‘స్టెర్లెట్’, ‘కలుగా హైబ్రిడ్’, ‘అమెరికన్ ఆస్టెరా’, ‘సైబీరియన్ స్టర్జన్’లను ప్రధాన రకాలుగా గుర్తిస్తారు. కాస్పియన్ సముద్రంలో స్టర్జన్ చేపల వేట పై రష్యా 2007లో నిషేధాన్ని విధించడంతో, చేపల సాగు ద్వారా కేవియర్‌ను తయారు చేయడం మొదలైంది. కేవియర్‌ను పిజ్జా, బర్గర్ వంటి పలు రకాల వంటకాల్లో ‘టాపింగ్’గా ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రపంచంలో కేవియర్‌ను భారీయెత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనాదే అగ్రస్థానం. కేవియర్‌లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. కేవియర్‌ను ఆహారంగా తీసుకుంటే డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక కుంగుబాటుకు సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి.

బేబీ కార్న్ మసాలా
(ఒపిఒఎస్ పద్ధతిలో...)

కావలసిన పదార్థాలు: తరిగిన బేబీకార్న్ ముక్కలు 250 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, నూనె 6 టీ స్పూన్లు, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, గరమ్ మసాలా 1/2 టీ స్పూను, ఉప్పు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, నీళ్ళు 5 టీ స్పూన్లు, కరివేపాకు 10 లేదా 12 ఆకులు

ఇలా వండండి
imageమొదటగా ఒక గిన్నె తీసుకుని, అందులో బేబీకార్న్ ముక్కల్ని, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలపాలి. తరువాత మిరియాల పొడి, ధనియా పొడి, పసుపు, గరమ్ మసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో నూనె వేసి కలపాలి. తరువాత రెండు లీటర్ల ప్రెషర్‌కుక్కర్‌ను తీసుకుని, అందులో ఐదు టీస్పూన్ల నీటిని పోసి, తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకును వేయాలి.

దీనిపైన బేబీకార్న్ మిశ్రమాన్ని పొరలు పొరలుగా సర్దాలి. స్టవ్ మంట కొద్దిగా తగ్గించి, అంటే మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. కమ్మటి వాసనతో మీ వంటగది నిండిపోతుంది. అప్పుడు కుక్కర్‌ని స్టవ్ మీది నుంచి దింపేసి, కుక్కర్ వెయిట్‌ను మాన్యువల్‌గా (అంటే దానంతట అది వచ్చే వరకు ఎదురు చూడకుండా, చేతితోనే వెయిట్‌ను తొలగించాలన్న మాట)తీసేయాలి. కుక్కర్ మూత తీసి, కూరను బాగా కలియదిప్పండి. వేడివేడిగా ఈ కూరను, అన్నం/ చపాతీల్లో వాడితే చాలా రుచిగా ఉంటుంది. 

మిల్లెట్ మ్యాన్
సిరిధాన్యాల మాంత్రికుడు డాక్టర్ ఖాదర్‌వలి

ప్రకృతి అంటే ‘వైవిధ్యం’. ప్రకృతిలో భాగమైన మానవ శరీరం కూడా వైవిధ్యభరితమైందే! అది ఏ ఒక్క రోజూ ఒకేలాimage ఉండదు. మారుతూ ఉంటుంది. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య దశల్ని దాటి తిరిగి ప్రకృతిలోనే కలిసి పోతుంటుంది. వైవిధ్యభరితమైన ఈ దేహానికి మనం అందించే ఆహారం కూడా వైవిధ్యంతో కూడుకున్నదై ఉండాలి. అంటే ఒకరోజు పులిహోర, ఒకరోజు బిరియాని, ఒకరోజు పెరుగన్నం కాదు..., రోజుకో విధంగా భిన్నమైన ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవాలి. ప్రతిరోజూ బియ్యాన్ని అన్నం రూపంలో ఆహారంగా తీసుకోవడం దక్షిణ భారతీయులకు అలవాటు.

కానీ ఈ అలవాటు కాలక్రమేణా సామాజిక పరిణామ ప్రభావంగా కొంత పెడదారి పట్టింది. ఆహారం అంటే అన్నం మాత్రమే గుర్తుకు వచ్చే దుస్థితి. కేవలం తెల్లని వరిబియ్యంతో వండిన పదార్థాన్నే మనం అన్నం అంటున్నాం. కానీ మన ప్రాచీనులు మాత్రం అన్నం పేరిట పలు రకాల సిరిధాన్యాల్ని ఆహారంగా తీసుకునే వారు. ఒకరోజు కొర్రలు తింటే, మరొక రోజు ఊదులు, మరుసటి రోజు సామలు, తరువాత తైదలు..., ఇలా రోజుకో రకమైన సిరిధాన్యాల్ని ‘అన్నం’గా తీసుకోవడం ప్రాచీన భారతీయుల ఆహార సంప్రదాయంగా ఉండేది.

అయితే వీటన్నింటినీ వాళ్ళు ‘బియ్యమ’నే పిలిచే వాళ్ళు. కాలక్రమేణా ఒకే పంటను పండించడం, దానికి వాణిజ్యపరమైన ప్రాధాన్యాన్ని కల్పించడం వంటి దుష్పరిణామాల ఫలితంగా మన ఆహారపుటలవాట్లు పెడత్రోవ పట్టాయని డాక్టర్ ఖాదర్‌వలి అంటున్నారు. అంతు తెలియని రోగాల బారిన పడి కునారిల్లుతున్న మన ప్రస్తుత imageసమాజానికి సరైన ఆహారం, నిరాడంబర జీవనశైలి, నిర్ధిష్టమైన వ్యావసాయిక పద్ధతులు మాత్రమే తగిన ఔషధాలని ఆయన నొక్కి చెబుతున్నారు. కర్ణాటకలో మైసూరు, టికె లేఅవుట్‌లోని ఖాదర్‌వలి ఇంటి ముందు మంగళవారం నుంచి శనివారం వరకు రోజుకు వందమంది రోగులు బారులు తీరుతుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన హుసేనప్ప, హుస్సేనమ్మల కుమారుడు డాక్టర్ ఖాదర్‌వలి. ఆయన మైసూరులోని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఎమ్మెస్సీ చదివారు. తదనంతరం బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో స్టెరాయిడ్స్ మీద పరిశోధన చేశారు. తరువాత డ్యూపాంట్ కంపెనీలో నాలుగేళ్ళు సైంటిస్టుగా పనిచేసి, 1997 నుంచి బెంగుళూరులో స్థిరపడ్డారు.

పిల్లల్లో మధుమేహం, ఒబేసిటీ, అనీమియా వంటి రోగాలు పెరగడం, యువతుల్లో నెలసరి సమస్యలు పెరిగి పోవడం వంటి సమస్యలకు కారణం మార్కెట్‌లో లభిస్తున్న పాలు, గోధుమల వంటి ఆహార పదార్థాలేనని ఆయన అంటున్నారు. ‘పాల ఉత్పత్తిని పెంచడం కోసం పశువులకు ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లను కృత్రిమంగా ఇంజెక్ట్ చేస్తున్నారు, దీని వల్ల ఆడపిల్లలు చిన్నతనంలోనే  రజస్వల కావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ప్రజలు ఎక్కువగా వాడే మైదాలో అల్లోక్జాన్ అనే బ్లీచింగ్ ఏజెంట్‌ను వాడడం వల్ల పిల్లల్లో మధుమేహ సమస్య ఎక్కువవుతోంది’ అని ఖాదర్‌వలి వివరించారు. 

ప్రకృతి సహజమైన ఆహారాన్ని ఉపయోగించడమే ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం అని ఆయన వాదిస్తున్నారు. ఉదాహరణకు చాక్లెట్‌లకు బదులు వేరుశనగ, నువ్వులు, బెల్లంతో చేసిన మిఠాయిల్ని అలవాటు చేయాలని ఆయన సూచించారు. అలాగే తెల్లబియ్యం వాడకాన్ని మానివేసి, కొర్రలు, ఊదులు, సామలు వంటి సిరిధాన్యాల్ని రోజుకో రకంగా వండుకుని తింటే మధుమేహ సమస్య పూర్తిగా సమసి పోతుందని కూడా ఆయన సూచిస్తున్నారు.

ఆర్థిక లాభాలు, వ్యాపార ప్రయోజనాలతో కూడిన వ్యావసాయిక విధానాలకు స్వస్తి చెప్పి, మట్టిని సంరక్షించే సేంద్రియ విధానాల్ని అనుసరించి పంటల్ని పండించాలని ఆయన సలహా ఇస్తున్నారు. సోయాబీన్, నువ్వులు, వేరుశనగల్ని నిత్యం మనం తినే ఆహారంలో చేర్చుకోవాలని, తత్ఫలితంగా కాన్సర్, గర్భాశయ సమస్యలు, మానసిక సమస్యల వంటి రుగ్మతలకు దూరంగా ఉండవచ్చునని ఆయన అంటున్నారు.

మనం తినే ఆహారంలోని సూక్ష్మపోషకాల్ని శోషించుకునే శక్తి చిన్నప్రేవుల్లో ఉంటుందని, కానీ గోధుమల్ని ఎక్కువగా వాడడం వల్ల, వాటిలోని గ్లూటెన్ ఆ శోషణశక్తిని హరించి వేస్తుందని ఆయన వివరించారు. మన ఆహరంలోని చక్కెర రక్తంలో కలవడానికి ఎంత ఎక్కువ సేపు పడితే అది అంత మంచి ఆహారమంటారు ఖాదర్‌వలి. ఉదాహరణకు సిరిధాన్యాల్లోని గ్లూకోజ్ మన రక్తంలో కలవడానికి ఆరుగంటల సమయం పడితే, రాగుల్లోని గ్లూకోజ్ రక్తంలో కలవడానికి రెండున్నర గంటలు పడుతుందని, తెల్లబియ్యంలోని గ్లూకోజ్ రక్తంలో కలవడానికి కేవలం 45 నిమిషాలే పడుతుందని ఆయన తెలిపారు.

దీనివల్లే తెల్లబియ్యాన్ని ఎక్కువగా ఉపయోగించే వారిలో మధుమేహ సమస్య తీవ్రతరమవుతోందని ఆయన చెబుతున్నారు. ఈ భూమ్మీద జీవించడానికి మూలాధారమైన ‘వైవిధ్యం’ అనే సూత్రాన్ని పూర్తిగా తోసిరాజనడమే ఇవాల్టి అనారోగ్య భారతానికి శాపంగా మారింది. ఈ శాపాన్నుంచి విముక్తి పొందాలంటే ఇలాంటి శాస్త్రీయ అవగాహన కలిగిన నిపుణుల సలహాల్ని పాటిస్తే మేలు.

పసుపులేటి గీత

English Title
manam maithri special
Related News