జైట్లీతో మాట్లాడా.. బాకీలన్నీ తీర్చేస్తా: మాల్యా

Updated By ManamWed, 09/12/2018 - 19:51
Finance Minister, Vijay Mallya, Lies, Arun Jaitley

Finance Minister, Vijay Mallya, Lies, Arun Jaitleyన్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అందరి బాకీలు పూర్తిగా తీర్చివేస్తానని స్పష్టం చేశాడు. మాల్యాను భారత్‌కు రప్పించే అంశంపై లండన్‌లోని ఓ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా కోర్టుకు వచ్చిన మాల్యా మీడియాతో మాట్లాడారు. ‘రుణాల చెల్లింపులపై కర్ణాటక హైకోర్టులో ప్రతిపాదించాను. ఈ ఏడాది జూన్‌ 22న కర్ణాటక హైకోర్టులో ఓ దరఖాస్తు దాఖలు చేశాను. కోర్టు అధీనంలో ఉన్న నా ఆస్తులను అమ్మేందుకు అనుమతించాలని కోరాను. ఆ ఆస్తులను అమ్మేసి అందరి బాకీలు తీర్చివేస్తాను’ అని మాల్యా చెప్పారు.

ఈ సందర్భంగా మాల్యా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించారు. రుణాలు తీసుకున్న అంశాన్ని సమర్థించుకున్న మాల్యా.. తాను భారత్ విడిచే ముందు జైట్లీతో రుణాల్ని చెల్లించే విషయంలో చర్చించినట్టు వ్యాఖ్యానించారు. మాల్యా వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించిన అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. మాల్యా చెప్పేవి అన్ని అబద్దాలుగా కొట్టిపారేశారు. తాను అసలు మాల్యాకు ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ఓసారి పార్లమెంట్ ఆవరణలో హడావుడిగా తనతో మాల్యా మాట్లాడినట్టు జైట్లీ పోస్ట్‌లో పేర్కొన్నారు.  

English Title
Met Finance Minister Claims Vijay Mallya, Lies, Says Arun Jaitley
Related News