పాక్ కొత్త ప్రధాని ఇమ్రాన్ పొదుపు మంత్రం

Updated By ManamTue, 08/21/2018 - 00:24
imran-khan-cabinet-swearing

imran-khan-cabinet-swearingఇస్లామాబాద్: అవినీతిని అంతం చేయడం, పొదుపు మంత్రాన్ని పాటించడం ద్వారా పాకిస్థాన్‌కు పూర్వవైభవం తీసుకొస్తానని కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సారి ఆయన ఆదివారం రాత్రి ప్రజలనుద్దేశించి టీవీలలో ప్రసంగించారు. తాను ప్రధాని అధికారిక బంగ్లాలో ఉండబోనని, దానికి బదులు మిలటరీ సెక్రటరీకి కేటాయించే సంప్రదాయ ఇంట్లోనే కేవలం ఇద్దరు ఉద్యోగులతో ఉంటానని చెప్పారు. వాళ్లు కూడా వద్దనుకున్నానని, కానీ భద్రత కోసం ఉండాలని చెప్పారని అన్నారు. దేశ ఆర్థిక సమస్యలను తీర్చడానికి పన్నులు ఎక్కువగానే వేస్తానని తెలిపారు. దేశంలో ప్రస్తుతమున్న సమస్యల చిట్టాను ఇమ్రాన్ విప్పారు. ఒకప్పుడు 4 కోట్ల కోట్ల రూపాయల (భారత కరెన్సీలో) మేర ఉన్న అప్పులు.. ఇప్పుడు 18.8 కోట్ల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని చెప్పారు. ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ చేయాల్సి ఉందన్నారు. వీటిమీద వడ్డీలు చెల్లించడానికి ఇప్పుడు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. విదేశీ రుణాల కారణంగా నీరసించిన పాకిస్థాన్ రూపాయిని కూడా బలోపేతం చేస్తానని కొత్తప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. ఆర్థిక అసమానతలు, పౌష్టికాహార లోపం, తాగునీరు లేకపోవడం, తగిన విద్యావకాశాలు అందకపోవడం లాంటి సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు. తగిన నీరు లేక పిల్లలు చనిపోయే దేశాల్లో పాక్ ఐదోస్థానంలో ఉందని, కానీ మరోవైపు ధనవంతులు మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. వీళ్లు తమ జీవనశైలి మార్చుకుని, పేదల పట్ల కాస్త సానుభూతి చూపిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రెండున్నర లక్షల మంది పిల్లలు చదువుకోవడం లేదని, యువత నిరుద్యోగులుగా ఉన్నారని, దేశంలో వాతావరణ మార్పు సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాల వద్ద అప్పులు తీసుకోవడం మానేయాలంటే ఒకే ఒక మార్గం పన్నులు పెండచమని తెలిపారు. విదేశాల్లో అడుక్కోవాలంటే తాను సిగ్గు పడతానని, ముష్టివారికి ఎక్కడా గౌరవం ఉండదని చెప్పారు. విలాసవంతమైన వాహనాలను వేలం వేసి, ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమచేస్తామన్నారు. ప్రధాని బంగ్లాను ఏదైనా యూనివర్సిటీకి ఇచ్చేస్తామని అన్నారు. ఖర్చులు తగ్గించడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. కొత్త పాకిస్థాన్‌లో డబ్బులు పేదల కోసమే ఖర్చు పెడతామని తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలు పెంచుకోవడం ద్వారా శాంతికి ప్రాధాన్యం ఇస్తామని ఇమ్రాన్ అన్నారు. ఈ సమయంలో భారత ప్రస్తావన ఆయన తేలేదు. సింగిల్ విండో విధానంలో పెట్టుబడులు ఆకర్షించి ఎగుమతులు పెంచాలని, ప్రస్తుతం ప్రభుత్వ విధానాల లోపం వల్ల చిన్న పరిశ్రమలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏదో ఒక రోజుకు మనం పన్నులు చెల్లించడం మానేసి, ఇతర దేశాలకు సాయం చేసే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నానని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

పొరుగుదేశాలతో సత్సంబంధాలు
పొరుగుదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు వాటితో చర్చలు జరుపుతామని పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. చర్చలు లేకుండా దేశంలో శాంతిని నెలకొల్పడం కష్టసాధ్యమని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ వాటిని పరిష్కరించాలంటే దేశంలో శాంతియుత పరిస్థితులు ఉండాల్సిందేనని అన్నాను. దేవుడి దయతో పొరుగుదేశాలతో శాంతియుత పరిస్థితులు ఏర్పడుతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ దేశంతో నిర్మాణాత్మక సంబంధాలకు తమ దేశం సంసిద్ధంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సోమవారం ఓ లేఖ రాశారు. పాక్‌తో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు. దక్షిణాసియా ప్రాంతాన్ని ఉగ్రవాదరహిత ప్రాంతంగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.

English Title
New Prime Minister Imran Saving Mantra
Related News