పిచ్ ఫిక్సింగ్

Updated By ManamSun, 05/27/2018 - 12:14
Not Match But Pitch Was Fixed
  • గత ఏడాది భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్‌కూ ముందే పిచ్ ఫిక్స్

  • అంతకుముందు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌కూ కావాలనే స్పిన్ పిచ్

  • స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు చెప్పిన భారత క్రికెటర్ 

Not Match But Pitch Was Fixedన్యూఢిల్లీ: పిచ్ కావాలా..? ఎలాంటి పిచ్ కావాలి? స్పిన్ పిచ్.. లేదంటే ఫాస్ట్ బౌలింగ్ పిచ్.. అదీ కాకపోతే బ్యాటింగ్ పిచ్ కావాలా..? ఏ పిచ్ కావాలో చెప్పండి.. ఆ పిచ్ తయారుచేసి ‘ఫిక్స్’ చేసి ఇచ్చేస్తానంటున్నాడు శ్రీలంక క్యూరేటర్, భారత ఏ క్లాస్ మాజీ ఆటగాడు మరొకరు. అవును, గత ఏడాది భారత్, శ్రీలంక మధ్య జరిగిన పేటీఎం సిరీస్‌లోపని తొలి టెస్ట్ మ్యాచ్‌కు ‘పిచ్’ను అలాగే ఫిక్స్ చేశారట. ఈ షాకింగ్ విషయం అల్ జజీరా చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. ముంబై మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆటగాడు రాబిన్ మోరిస్.. ఈ స్టింగ్ ఉచ్చులో చిక్కుకుని అన్ని విషయాలనూ కక్కేశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన గాలే టెస్టు కోసం గ్రౌండ్స్‌మన్/క్యూరేటర్‌కు లంచం ఇప్పించి ‘బ్యాటింగ్ పిచ్’ను ఫిక్స్ చేయించానని చెప్పాడతడు. సోమవారం ఆ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన మొత్తం వివరాలను ప్రసారం చేయనుంది అల్ జజీరా. అయితే అంతకుముందే దానికి సంబంధించిన వివరాలను తన ఆన్‌లైన్ సైట్లో వెల్లడించింది. దీంతో ఆ విషయం బయల్పడింది. బౌలర్, బ్యాట్స్‌మన్‌కు తగినట్టుగా ఎలాంటి పిచ్ కావాలో అలాంటి పిచ్‌ను తయారు చేసి ఇస్తానంటూ గాలే స్టేడియం మేనేజర్, క్యూరేటర్ అయిన తరంగ ఇండికా ఆ స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పాడు. ఇక, తరంగ ఇండికా ప్రధాన క్యూరేటర్ అయినందున ఎలాంటి పిచ్ కావాలన్నా ముందే తయారు చేసి ఇస్తాడని, అందుకు డబ్బులు కాకుండా బెట్టింగ్‌లో వచ్చిన మొత్తంలో 30 శాతం ఇస్తే సరిపోతుందని స్టింగర్లకు రాబిన్ మోరిస్ చెప్పడం కలకలం రేపుతోంది.

Not Match But Pitch Was Fixedగత ఏడాది జూలై 26 నుంచి 29 వరకు జరిగిన గాలే టెస్టులో భారత్ కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేశామని, ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు మోరిస్. అంతేగాకుండా బ్యాటింగ్ కోసం పిచ్‌ను నీళ్లతో మంచిగా క్యూరింగ్ చేసి రోలర్‌తో చదును చేసి పిచ్‌ను తీర్చిదిద్దామని చెప్పాడు. ఇక, 2016లోనూ ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా కూడా స్పిన్ బౌలింగ్ పిచ్‌ను తయారు చేసినట్టు చెప్పాడు. పిచ్‌ను అసలు నీళ్లతో తడపకుండా.. అలాగే వదిలేసి డొల్ల అయ్యేలా చూసి పిచ్ స్పిన్‌కు సహకరించేలా చూశామని వివరించాడు. ఇక, నవంబరులో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం కూడా పిచ్‌ను ఫిక్స్ చేస్తున్నట్టు చెప్పాడు మోరిస్. ఎలాంటి పిచ్ కావాలో చెబితే అలాంటి పిచ్‌ను తయారు చేస్తామని, ఆ పిచ్ ఆధారంగా బెట్టింగ్ కూడా సులువుగా వేసుకోవచ్చని మోరిస్ చెప్పడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నటు అంతర్జాతీయ క్రికెట్ మండలి పేర్కొంది. వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించినట్టు చెప్పుకొచ్చింది. 

English Title
Not Match But Pitch Was Fixed
Related News