భారత్‌తో ఒమన్ ఢీ

Updated By ManamThu, 10/18/2018 - 00:55
Indian hockey team

Indian hockey teamమస్కట్ (ఒమన్): ఆసియా గేమ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన భారత హాకీ జట్టు ప్రతిష్టను పెంచుకునేందుకు సిద్ధమైంది. గురువారమిక్కడ ప్రారంభం కానున్న పురుషుల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య ఒమన్‌తో భారత్ తలపడుతుంది. జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత జట్టు స్వర్ణం గెలవాల్సింది. కానీ సెమీఫైనల్లో మలేసియా చేతిలో ఓడిపోవడంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉన్న భారత్ ఆసియాలో అత్యధిక ర్యాంక్‌గల జట్టులో బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను కట్టడి చేయడం భారత్‌కు పెద్ద సమస్యేమీ కాదు. 2014 ఆసియా గేమ్స్‌లో ఒమన్‌ను భారత్ 7-0తో ఓడించింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో కొనసాగే ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టుతో ఆడటం వల్ల మా సత్తా ఏంటో తెలుస్తుందని కోచ్ హరేంద్ర సింగ్ నమ్ముతున్నారు. ‘సొంత అభిమానుల ముదు ఆతిథ్య జట్టు ఒమన్‌తో మా ఈ టోర్నీ ప్రారంభం కావడం చాలా ఉద్వేగంగా ఉంది. మలేసియా, పాకిస్థాన్, జపాన్, సౌత్ కొరియా వంటి బలమైన జట్లతో పోరుకు ముందు తొలి మ్యాచ్ మాకు పరీక్ష లాంటిది. ఉత్తమ ప్రతిభతో టోర్నీని ప్రారంభించడం మాకు చాలా అవసరం’ అని హరేంద్ర అన్నారు. 

ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2016లో మలేసియాలో జరిగిన టోర్నీలో 3-2తో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. అయితే ఈసారి కూడా విజేతగా నిలవాలంటే తప్పులను అరికట్టాలని హరేంద్ర అన్నారు. ‘ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించల సత్తా వున్న జట్టు మాది అని మాకు తెలుసు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకమవుతాయి. కాబట్టి మ్యాచ్ జరిగే 60 నిమిషాలపై దృష్టి పెట్టి ప్రత్యర్థికి ఎటువంటి అవకాశాలివ్వకుండా ఆడాలి. ఆసియా గేమ్స్‌లో చేసిన తప్పులు సరిదిద్దుకున్నామని ఈ టోర్నీలో నిరూపించగలగాలి. భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ టోర్నీ ఒక మంచి అవకాశం. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం మా ప్రధాన లక్ష్యం. అందుకు మా కుర్రాళ్లు కఠోర శిక్షణ తీసుకున్నారు. తొలి మ్యాచ్‌లో ఒమన్‌తో ఆడిన తర్వాత భారత్ ఈ నెల 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడుతుంది. తర్వాత 21న జపాన్‌తో, 23న మలేసియాతో, 24న సౌత్ కొరియాతో తలపడుతుంది. గత ఎడిషన్‌లో భారత్ ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. జపాన్‌పై 10-2తో గెలవగా.. సౌత్ కొరియాతో 1-1తో డ్రా చేసుకుంది. తర్వాత పాకిస్థాన్‌పై 3-2తో, చైనాపై 9-0తో, మలేసియాపై 2-1తో గ్రూప్ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక సెమీఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 5-4తో సౌత్ కొరియాను చిత్తు చేసింది. ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ జట్లు చెరి రెండుసార్లు టైటిల్ గెలిచాయి. మూడోసారి విజేతగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి. భారత జట్టు 2011, 2016లలో టైటిల్ గెలవగా.. పాకిస్థాన్ 2012, 2013 ఎడిషన్లలో గెలిచింది. 

English Title
Oman with India
Related News