ప్రజలే ముందు..

Updated By ManamTue, 09/11/2018 - 23:20
chandra babu naidu
  • అందుకే పెట్రోల్ ధరలు తగ్గించాం

  • కేంద్రానికి ఆ మాత్రం ఉదారం లేదు

  • తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలకు కుట్ర

  • టీడీపీని ఒంటరి చేయాలని ప్రయత్నం

  • అసెంబ్లీ వ్యూహ కమిటీతో చంద్రబాబు

Chandra Babuఅమరావతి: ‘‘తెలుగుదేశం పార్టీ నినాదం.. ప్రజలే ముందు (పీపుల్ ఫస్ట్). రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాం. లీటర్‌కు రూ.2 తగ్గింపు పేదలకెంతో ఊరట నిచ్చింది. దీని వల్ల రాష్ట్రానికి రూ.1120 కోట్లు నష్టం వాటి ల్లుతోంది. వేల కోట్ల ఆర్థిక లోటులో ఉన్నా కూడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ వ్యూహ కమిటీ  సభ్యులతో చంద్రబాబు టె లికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై రాష్ట్రానికి ఉన్నంత ఉదారం లేకపోవడం దురదృష్టకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని చూశారని, రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీని బలహీన పరచాలని కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఏకపక్షంగా పొత్తులేదని ప్రకటించి, ఏపీలో వైసీపీతో బీజేపీ అంటకాగుతుందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే గైర్హాజరు అయ్యారని, ఢిల్లీ వస్తానని చెప్పినవాళ్లు పత్తాలేరని వైసీపీ, జనసేన పార్టీ నేతలను విమర్శించారు. ప్రజా వ్యతిరేక చర్యల వల్లే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ నుంచి వైదొలిగిందన్నారు. కర్ణాటకలో బీజేపీయేతర పార్టీలకు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు. రాష్ట్రాల్లో సమర్థ నాయకత్వం లేకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రం ఎందుకు పూడ్చదని చంద్రబాబు ప్రశ్నించారు. సహాయం చేయకపోగా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసిన రూ.350కోట్లు వెనక్కి ఎలా తీసుకుంటారని ఆయన నిలదీశారు. నాలుగేళ్ల రాష్ట్రాభివృద్ధి మన కష్టంతో, తెలివితేటలతో సాధించామన్నారు. వీటిన్నంటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలను కోరారు. అందుకు అసెంబ్లీ, మండలిను వేదికగా చేసుకోవాలన్నారు. సభలో జరిగే చర్చల్లో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు టీడీపీ నేతలను ఆదేశించారు. 

English Title
People in front ..
Related News