పుత్తూరు కట్టు జనాలను ఆకట్టు

Updated By ManamSun, 09/23/2018 - 07:37
sunday special

imageచిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకాలోని రాచపాళెం మా అమ్మమ్మ ఊరు. విరిగిన కాళ్లు, చేతులకు కట్లుకట్టే ప్రకృతి వైద్యానికి పెట్టింది పేరు. కట్లు కట్టే కుటుంబానికి చెందిన మా అమ్మమ్మ నామధేయం సూరపరాజు నరసమ్మ అయితే మేమంతా బామ్మా అని పిలిచేవాళ్లం. భారీ శరీరమైనా, మోకాళ్ల నొప్పులున్నా వెదురు కర్ర సాయంతో అటూ ఇటూ తిరుగులాడేది. కోపమొస్తే కూతుళ్లు నారాయణమ్మ, రామక్కవ్వ, సుబ్బలక్ష్మమ్మలపై ఎగిరిపడేది. 

ఊర్లో అమ్మే సరోజక్క మసాలా వడలు, తుంబూరామె ఇడ్లీ సాంబారు, తిరపతామె నీళ్ల చట్నీ, రాఘవన్న పల్లీలు భలే వుండేవి. నేను, శ్రీనివాసులన్న ఇద్దరమూ బామ్మకి తిరపతామె ఇడ్లీలు తెచ్చి ఇచ్చేవాళ్లం. ఇడ్లీలు తెచ్చి ఇచ్చిందానికి తిరిపంగా  (కానుకగా) మాకు ఒక్కొక్క ఇడ్లీ ఇచ్చేది. ఆ ఒక్క ఇడ్లీకే కొట్టుకొనే వాళ్లం. అక్క పద్మ, భారతి, కస్తూరిలు బామ్మని రేగు చెట్టుకాడికి మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ తీసుకెళ్లే వాళ్లు. వాకింగ్‌కి తీసుకెళ్లడానికి పోటీలు పడేవాళ్లు. బామ్మకి తోడుగా వెళితే తాయిలాలు వుంటాయి కదా మరి. 

కట్లు కట్టే ఆసుపత్రిని అప్పట్లో ‘కుంటోళ్ల కొట్టం’ అని పిలిచేవాళ్లు. అక్కడికి ఒకసారి వైద్యం కోసం సినీనటి హలంimage వచ్చింది. మేమంతా వెళ్లి చూశాం. హలం వచ్చింది చెప్పలేదని వేణన్న కొడుకు బాలాజీగాడు అలిగి నాలుగు నెలలు నాతో మాట్లాడలా. కొట్టంలోని వైద్యానికి నాటు కోడి గుడ్లు వాడేవాళ్లు. గుడ్లలోని తెల్లసొన వైద్యానికి వాడి, పసుపు సొన మిగిల్చేవాళ్లు. ఊర్లో చాలామందిమి వాటిని ఆమ్లెట్లు, పొరుటు చేసుకొని తినేవాళ్లం. తెల్లారి లేచింది ఆలస్యం ఎవరెవరి కండ్లల్లో ఎంతెంత రక్తం పెరిగిందో ఒకరి కళ్లు ఒకరు చూసుకొనేవాళ్లం.
 
మా బామ్మకి బుడబుక్కలోళ్ల దగ్గర జరగబోయేది చెప్పించుకోవాలంటే భలే ఇష్టం.  వచ్చినోడు ఎవడైనా జోస్యం చెబుతానంటే వాడికి దండిగా పైసలిచ్చేది. అమ్మమ్మని బురిడీ కొట్టించాలని బాలన్న, జయన్న ప్లాను వేసినారు. కోటు వేసి, నామం పెట్టి, పంచెకట్టి, గొడుగు చేతబట్టి పూసల మాలలు వేసి తలపాగా చుట్టి బామ్మకి సోది చెప్తా వున్నారు. చిన్నక్క, కనకక్క, లక్షుమమ్మలు నవ్వుతా నిలబడినారు. సగంలో విషయం తెలుసుకొన్న బామ్మ వాళ్లని తరిమింది చూడండీ.. వాళ్లు ఊరికి దక్షిణాన వుండే రైలు పట్టాలకాడ పోయి తేలినారు!
 
ఊరి చుట్టుపక్కల కలరా, మలేరియా, టైఫాయిడ్‌లు రాకుండా భజనలు చేసేవాళ్లం.  బ్రాహ్మణపట్టు గోపాలస్వామి హరేరామలు పాడతావుంటే మేమంతా వంతపాడుతూ దీపం ఎత్తుకొని వీధులు తిరిగేవాళ్లం. దీపం ఎత్తుకోడానికి నేను, నాన్ను, చంద్రు, మధు, ఆకేటి గోపి పోటీలు పడేవాళ్లం. దీపం ఎత్తిన వాళ్లకి ప్రసాదం దండిగా పెడ్తారు కదా. మట్టిలో తలపెట్టి తలకిందులుగా గంటల కొద్దీ వుండిపోయే అరవమాయన (తమిళమాయన), చేతితోనే తాటిచెట్టు పడగొట్టే సర్కారాయన ఊర్లోకి వచ్చేవారు.  వాళ్లు వస్తే బీకామ్ బాలన్న, సాలక్క కొడుకు మురళి, కాశెమ్మ కొడుకు సీ.సీ., బీయస్సీ బాల, రెడ్డోళ్ల సత్యంలకు పండుగ వచ్చినట్లే. మురుకులు తింటూ సినిమా షూటింగులు చూసినట్లు చూసేవాళ్లం. 

కొట్టం ఎదురుగా కేరళ అయ్యోరు గోవిందరావు హోటల్ నడిపేవాడు. తెల్లారి చేసి మిగిలిన ఉప్మా ఇడ్లీ పొంగలి సాయంత్రం స్కూలు పిలకాయలకి పంచేవాడు. బండి రమణ, బీ.సీ. రమణ, బస్సు రమణ, సాలవోడులతో కలసి ఎగురుతూ ఎగురుతూ తినేవాళ్లం. ఎండాకాలం వానలు కురవాలని కప్పల పెండ్లిండ్లు చేసేవాళ్లం. రోకలికి కప్పలు కట్టి పసుపు కుంకుమలు పూసి నీళ్లు పోసుకొంటూ గడపగడపా తిరిగేవాళ్లం. రోకలి మోయడానికి అయ్యోరోళ్ల సుధ, గోవర్ధన, భాస్కరుడు, భూపతి తన్నుకొనేవాళ్లం. మా మేనమామ నరసింహరాజు చివర్లో అందరికీ చక్కెర, కలకండ పెట్టేవాడు.  భుస్కడు కాశిరాళ్లతో దిగుడు బావి కడ్తుంటే మేమంతా వింతగా చుట్టూరా చేరి తొంగితొంగి చూసేవాళ్లం.
ఊర్లో పిలకాయలు కొందరు అక్కినేని గ్రూపు అయితే మరి కొందరు నందమూరి గ్రూపు. వాళ్లు వీళ్ల వాల్ పోస్టర్‌పై పేడ కొడితే వీళ్లు వాళ్ల వాల్‌పోస్టర్‌పై పేడ కొట్టేవాళ్లు. నిద్ర లేచిందే మధ్యస్తాలు గరంగరంగా జరిగేవి. పోలీస్ మావ సమ్మెట నరసింహరాజు యూనిఫారంలో కనిపిస్తే మేమంతా భయం భయంగా పక్కకి వెళ్లిపోయేవాళ్లం.
గంగ జాతర చాటింపుకి ముందు పంచాయితీ ఆఫీసు కాడ కూటం జరిగేది.  ఊరిపెద్దలు జయరామన్న, రామన్న, చెంగల్రాజు, పెరుమాళ్రాజు, కోర్టు కిష్టన్న  మాట్లాడుతుంటే రాత్రంతా మేల్కొని శెనక్కాయలు తింటూ అసెంబ్లీ హాలులో వున్నట్లు తెగ సంబర పడేవాళ్లం. గంగ జాతరకి వేషాలు, అంకమ్మకి పొంగళ్లు, పుత్తూరు తిరునాళ్లలో పాయసం తాగడం, గుట్టపైన గోవింద పాదం సంతర్పణలో చింతపండన్నం ఆవురావురమని తినడం మధురమైన అనుభూతులు.  ఎన్ని జన్మల నోముల పుణ్యఫలమో ఈ అనుభవాలు.

ఇప్పుడెప్పుడయినా రాచపాళెం వెళితే పోగొట్టుకొన్న ప్రాణవాయువు పొందినట్లవుతుంది. దారిపోయిన శక్తి దొరికినట్లవుతుంది. అప్పుడూ, ఇప్పుడూ అమ్మమ్మ ఊరు అనందనిలయం, స్వర్గధామం. 

- ఆర్.సి. కృష్ణస్వామి రాజు
సెల్: 9393662821 

English Title
Poothur style
Related News