సమరయ స్త్రీ

Updated By ManamTue, 02/20/2018 - 02:08
christ

christయోహాను బంధితుడయ్యాడని తెలిసింది. యేసు తన శిష్యులతో కలిసి గలీలియకు పయనమయ్యాడు. మార్గ మధ్యంలో దప్పిగొని, నీటిని తోడుతున్న సమరయ స్త్రీని చూచి నాకు దాహమిమ్మని ఆమె నడిగాడు. ఆతడు యూదుడని ఆ స్త్రీ సంశయిస్తూ ‘‘నేను అస్పృశ్యను, యూదులైన మీరు ఈ  బావి నీరు త్రాగరాదు’’ అని పలికింది.  అప్పుడు ప్రభువు అమ్మా! నీవిచ్చే జలం దాహాన్ని పోగొట్టలేదు. నేను నీకు పరిశుద్ధ జీవజలాలనిస్తాను. అవి తాగితే దప్పిగొనరని పలికాడు. నీరు, వాయువు, అగ్ని, ఆకాశాలు దేవుడు భూలోకవాసులకు పంచియిచ్చిన స్థిరాస్థులు. అస్పృశ్యత, కుల గోత్రాలు ప్రపంచ మానవాళి సభ్యతకు సిగ్గుచేటు. అల్పులు మహాపాపాన్ని మహా పదార్థాలకు సైతం కల్పిస్తారని కవి పలికాడు. ఆ స్త్రీ యేసుతో ఈ నూతికి రావడం కష్టం. ఇది చాలా దూరం. ప్రతిరోజూ ఇక్కడికి రావడం కష్టంగా ఉంటోంది. దయచేసి నీవిస్తానన్న దివ్యజలాలను నాకిమ్మని పలికింది. యేసు నీ భర్తను ఇక్కడకు తీసికొని రా! అని పలికాడు. ఆమె నాకు భర్తలేడనగా, యేసు నీకు ఐదుగురు పెనిమిటులు గతంలో ఉండేవారు. ఇప్పుడున్న వాడు నీ భర్తకాదు. నిజమే పలికావని అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి నీవు క్రీస్తను పేర రావలసిన మెస్సీయవా అని పలికింది. ప్రభువు అవును నేను మెస్సీయను అని పలికాడు. ఆమె ఊరిలోనికి పోయి మెస్సీయా వచ్చాడని పలువురిని తీసికొని వచ్చింది. వారు ప్రార్థించిన మీదట ప్రభువు వారి మాటలు మన్నించి రెండు రోజులు సమరయల ఊరిలో ఉండి పిదప గలిలయకు వెళ్ళాడు. అనేకులాయన యందు విశ్వాస ముంచారు.
- క్రీస్తుచరిత్ర నుంచి

English Title
Samaritan woman
Related News