కాలాతీత వ్యక్తి

Updated By ManamWed, 03/14/2018 - 22:19
Stephen Hawking

‘విశ్వం అనూహ్యమని నేను నమ్మను. అంతఃప్రేరణతో తప్ప దానిని గ్రహించడమూ, విశ్లేషించడమూ అసాధ్యమనేదానితో నేను ఏకీభవించను... విశ్వం క్రమబద్ధం అనే విశ్వాసంతోనే ఈ వ్యాసాలన్నీ రాశాను. ఆ క్రమాన్ని ఇప్పుడు పాక్షికంగానూ, సమీప భవిష్యత్తులో సంపూర్ణంగానూ మనం గ్రహించ గలమని నేను నమ్ముతున్నాను. అయితే ఈ ఆశ కేవలం ఒక ఎండమావే కావ చ్చు. ఒక అంతిమ సిద్ధాంతం అనేది ఏదీ లేకపోవనూవచ్చు. అలాంటిది ఉన్నా మనం కనుక్కోలేకపోవచ్చు. అయినా మానవ మేధ పరిమితులను గురించి వగ చే కంటే విశ్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే మేలు’ అని విశ్వవిఖ్యాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, అభినవ ఐన్‌స్టైన్‌గా ప్రసిద్ధికెక్కిన స్టీఫెన్ హాకింగ్ విశ్వ రహస్య అన్వేషణలోని తాత్వికతను వ్యక్తంచేశారు. కాల గమన నియమాల్ని శోధించిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(76) బుధ వారం విశ్వైక్యమయ్యారు. భౌతికంగా ఆయన మనకు దూరమైనా వైజ్ఞానిక శాస్త్ర ఏకత్వం లేదా అనన్యత్వం (ఏకబిందుత్వం-సింగులారిటీ)లో హాకింగ్ కాలాతీత వ్యక్తిగా నిలిచారు. 1963లో అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరోసిస్ (ఏఎల్ ఎస్) అ నే మోటార్ న్యూరాన్ నరాలవ్యాధి సోకి మెదడు తప్ప ఆయన మొత్తం శరీరం నిస్తేజంగా మారింది. దశాబ్దాల తరబడి చక్రాల కుర్చీకే పరిమితమైనా స్పీచ్ థెర పీ సహాయంతో హాకింగ్ ప్రపంచానికి తన వైజ్ఞానిక పరిశోధనలను అందించ గలిగిన గొప్ప సంకల్పబలంతో ఆయన జీవించారు. ఖగోళశాస్త్రంలో కృష్ణ బిలా లు (బ్లాక్ హోల్స్)పై ఆయన విశేషంగా పరిశోధనలు జరిపారు. 

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతానికి కొనసాగింపుగా ‘గ్రేవిటేషనల్ సింగ్యులారిటీ థీరమ్స్’ను అభివృద్ధి చేయడమే కాక, బ్లాక్ హోల్స్ నుంచి కూడా రేడియేషన్ విడుదలవుతుందని మొట్టమొదట సైద్ధాంతికంగా ప్రతిపాదించారు. ‘హాకింగ్ రేడియేషన్’ అనే సిద్ధాంతంగా ప్రసిద్ధి కెక్కింది. ఐన్‌స్టైన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటమ్ సిద్ధాంతాన్ని సమన్వయించిన గొప్ప దార్శని కుడు. క్వాంటమ్ మెకానిక్స్ ప్రతిపాదిస్తున్న ‘అనేక ప్రపంచాలున్నాయి’ అనే భావనపై ఆయనకు ప్రగాడ విశ్వాసం ఉంది. ‘స్టింగ్ థియరీ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆధునిక భౌతికశాస్త్రంలో నెలకొన్న శాస్త్ర వివాదాలెన్నిటికో ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో సఫలీకృతులయ్యారు. విశ్వశాస్త్రవేత్త హాకింగ్ ‘ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’తో మొదలుపెట్టి తన సిద్ధాంతాన్ని ప్రజలకు అందించే సాధారణ రచనలు చేసి పాపులర్‌సైన్స్ రచయితగా ప్రపంచ ప్రసిద్ధి చెందారు. సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త సర్ ఐసాక్ న్యూటన్ రూపొందించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వాన్ని దేవుడు మొట్టమొదట సృష్టించనట్లుగానే 1998లో రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ పుస్తకంలో స్టీఫెన్ హాకింగ్ కూడా విశ్వసించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆయనలో వచ్చిన తాత్విక పరిణతి కారణంగా 2010లో ‘ద గ్రాండ్ డిజైన్’ పుస్తకం రాసేనాటికి ఆయన సృష్టికర్తను తన భావజాల వ్యవస్థ నుంచి విసర్జించారు. ఆయన తాను పరిశోధనలు చేస్తున్న భౌతికశాస్త్ర రంగంలో నుంచి భౌతికవాద తాత్విక దృక్పథాన్ని క్రమంగా అలవరచుకుని ‘సద్యోజనిత తత్వవేత్త’గా ఎదిగారు. చాలామంది విఫలమైన భౌతిక శాస్త్రవేత్తలు తర్వాతి కాలంలో ‘శాస్త్రతాత్వికులు’గా అవతరించి భౌతికశాస్త్ర తత్వాన్ని గురించి రాసే రచయితలుగా స్థిరపడ్డారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భౌతికశాస్త్ర పరిశోధనల్లో అగ్రగామిగా ఉంటూ ఆచరణాత్మక ప్రాపంచక దృక్పథం హాకింగ్‌కు ఏర్పడడం విశేషం. 

రాజకీయంగా బ్రిటన్ లేబర్ పార్టీ మద్దతుదారుగా ఉన్న హాకింగ్ 1968లో వియత్నాంపై అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి మద్దతునిచ్చారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధాన్ని దురాక్రమణ యుద్ధంగా పేర్కొన్నారు. అణు నిరాయుధీ కరణ ఉద్యమాన్ని సమర్థించారు. స్టెమ్ సెల్ పరిశోధనలకు, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకానికి ఆయన మద్దతు తెలిపారు. బ్రెగ్జిట్ నిర్ణయం బ్రిటన్‌కు చెడుపు చేస్తుందని భావించారు. కృత్రిమ మేధస్సును రూపొందించడం మానవాళి చరిత్రలో అతిగొప్ప విజయమని, దానివల్ల తలెత్తే భయంకర పరిణామాలను నిరోధించేందుకు ప్రయత్నించకపోతే ఇదే ఆఖరి విజయం కాగలదని హెచ్చరించారు. ‘గాడ్ పార్టికల్’ (హిగ్స్ బాసాన్)ను కనుగొనే ప్రయో గం కోసం యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సెర్న్)కు చెందిన లార్జ్ హెడ్రాన్ కొలైడర్ (ఎల్ హెచ్‌సీ) ప్రయోగశాలలో సూక్ష్మ కృష్ణబి లాలను (బ్లాక్ హోల్స్) సృష్టించడం వల్ల భూగోళానికే ప్రళయం ఏర్పడుతుందని, ఒకవేళ అది జరగకపోయినప్పటికీ హిగ్స్ బాసాన్‌లను పట్టుకోవడం అసాధ్యమని సవాలు విసురుతూ ఆ శాస్త్రవేత్త లతో పందెం కాశారు. అయితే 2008లో తొలి సారి ఆ ప్రయోగాన్ని నిర్వహించి నపుడు విఫలమైన సెర్న్ శాస్త్రవేత్తలు, ఆ తర్వాత ప్రోటాన్ బీమ్‌లను విజయవంతంగా ఢీకొట్టి విడుదలైన వివిధ కణాలపై అధ్యయనం చేసి, 2012లో హిగ్స్ బాసాన్‌ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఎల్‌హెచ్‌సీ ప్రయోగంపై తొలుత పెదవి విరిచిన హాకింగ్, దాని విజయాన్ని మన స్ఫూర్తిగా ఆహ్వానించి ప్రశంసించారు. స్పీచ్ అనలైజర్ సహాయంతోనే ఆయన భారత్ సహా అనేక ప్రపంచ దేశాలను పర్యటించి, తన వైజ్ఞానిక ఆవిష్కరణల గురించి, తాత్వికతను గురించి అద్భుతమైన ప్రసంగాలు చేశారు. శరీరం మొత్తం చచ్చుపడిపోయినా అసమానమైన సంకల్పబలంతో వైజ్ఞానిక పరిశోధనల్లో అగ్రగామి నిలిచిన హాకింగ్ భౌతిక శరీరంపై మనసు సాధించిన విజయానికి సజీవ తార్కాణంగా నిలిచారు. ‘విశ్వంలో ప్రతిదానినీ వివరించగలిగిన ఒక నిలకడైన నమూనాను కనుగొనగలమని నేను ఆశిస్తున్నాను. అదే జరిగితే మానవజాతికి అది నిజమైన ఘన విజయం’ అనే హాకింగ్ వాక్యాలు వైజ్ఞానిక  స్ఫూర్తిదాయకాలు.

English Title
Stephen Hawking
Related News