అఫ్ఘానిస్థాన్‌లో ‘టాటా’ విద్యుదుత్పాదన

Updated By ManamWed, 09/12/2018 - 22:33
tata power

tata powerముంబై: యుద్ధ విధ్వంసానికి లోనైన అఫ్ఘానిస్తాన్‌లో విద్యుత్ ఉత్పాదన, పంపిణీ, ట్రాన్స్‌మిషన్‌లకు అక్కడి ప్రభుత్వం భారతదేశపు ప్రజోపయోగ సేవల సంస్థ టాటా పవర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా-అఫ్ఘానిస్తాన్ రెండవ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రదర్శన సందర్భంగా అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ పంపిణీ కంపెనీ డా అఫ్ఘానిస్తాన్ బ్రెష షెర్కత్ బుధవారంనాడు ఈ మేరకు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేసింది. నాలుగు రోజులపాటు సాగే ఈ షో వాణిజ్య సంబంధాలను పెంపొందించడంతోపాటు అఫ్ఘానిస్తాన్‌లో వ్యాపార నిర్వహణకు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వెల్లడిస్తుంది. అఫ్ఘానిస్తాన్‌లో కేవలం 35 శాతం జనాభాకు మాత్రమే విద్యుచ్ఛక్తి సదుపాయం అందుబాటులో ఉందని, ఆ దేశంలో టాటా పవర్ ‘‘అపార’’ అవకాశాలు చూస్తోందని టాటా పవర్ ప్రధాన కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ సిన్హా చెప్పారు. అఫ్ఘానిస్తాన్‌లో నాలుగు ప్రధాన నగరాల్లో మాత్రమే విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ‘‘విద్యుత్ రంగాన్ని పరిశీలించి, అఫ్ఘానిస్తాన్‌లో మేం వహించగల పాత్ర గురించి ఆలోచిస్తే, మాకు అపార అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ కంపెనీతోను, అక్కడి ఉత్సాహి పారిశ్రామికవేత్తలతోను కంపెనీ చాలా సన్నిహితంగా కలసిమెలసి పనిచేయాలని భావిస్తోందని చెప్పారు. అఫ్ఘానిస్తాన్‌లో ప్రకృతి వనరులు అపారంగా ఉన్నాయని, నికర విద్యుత్ ఎగుమతిదారుగా మారగల సామర్థ్యం దానికి ఉందని సిన్హా అన్నారు. సంప్రదాయబద్ధమైన అంచనా ప్రకారం చూసినా కూడా అఫ్ఘానిస్తాన్‌లోని నదుల ద్వారా 20,000 నుంచి 25,000 మెగావాట్ల విద్యుదుత్పాదన సాధించవచ్చని సిన్హా అన్నారు. అలాగే, 200 గిగావాట్ల సౌర విద్యుత్తును, మరో 66 గిగావాట్ల పవన విద్యుత్తును సాధించవచ్చని తెలిపారు.

Tags
English Title
'Tata' Electricity in Afghanistan
Related News