వాణిజ్య యుద్ధం... కొరివితో తల గోక్కోవడమే

Updated By ManamSat, 09/22/2018 - 22:18
US-CHINA

US-CHINAన్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శారీరక బరువునే కాకుండా ఇతర దేశాలతో వర్తక సంబంధాలలో అమెరికాకు అనవసర భారంగా పరిణమి స్తున్న వాటిని తగ్గించుకోవాలని చూస్తున్నారు. సుమారుగా 129 కిలోల బరువుండే ట్రంప్ అమెరికా ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఒడంబడికలపై తిరిగి చర్చలు జరిపేందుకు ఇష్టపడుతు న్నారు. ఆయన ఈ విషయంలో ప్రధానంగా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా ప్రధాని జిన్‌పింగ్ సుమారుగా 64 కిలోల బరువుంటారు. ట్రంప్ 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై ఇటీవల రెండో విడత (10 శాతం) సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా చైనా కూడా సుంకాల విధింపునకు దిగితే, తామూ మరిన్ని సుంకాలు విధిస్తామని అదే సమయంలో ట్రంప్ హెచ్చరించారు. అగ్ర రాజ్య అధినేత అలా హెచ్చరించగలిగిన స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే, అమెరికా నుంచి చైనా చేసుకుంటున్న దిగుమతుల కంటే, చైనా నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతులు చాలా ఎక్కువ. చైనా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) 12.2 ట్రిలియన్ డాలర్లకన్నా  అమెరికా జి.డి.పి 19.3 ట్రిలియన్ డాలర్లు చాలా ఎక్కువ. ఆ విధంగా అమెరికా సామర్థ్యమే ఎక్కువ. శారీరకంగా, ఆర్థికంగా, స్వాభావికంగా ట్రంప్ బలమే ఎక్కువ. అమెరికా మేధా ఆస్తికి మెరుగైన సంరక్షణ అవసరమని ట్రంప్ కోరుకుంటున్నారు. ఆయన అలా కోరుకోవడంలో తప్పు లేదు. మేధా ఆస్తి హక్కులను రక్షించడంలో చైనా చరిత్ర బలహీనంగా ఉంది. దాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు, మేధా ఆస్తి హక్కులు కాపాడుకునేందుకు చైనాతో వాణిజ్య యుద్ధానికి సైతం ట్రంప్ వెనుకాడదలచుకోలేదు. 

డ్రాగన్ ప్రతి దాడి
కానీ, చైనా తెంపరితనంతో ప్రతీకార సుంకాల విధింపునకు దిగుతుందనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 24 నుంచి 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా దిగుమతులపై సుంకాల విధింపునకు అది రంగం సిద్ధం చేసుకుంది. దీనివల్ల మొదటగా నష్టపోయేది అమెరికన్ రైతులు. అమెరికన్ సోయాబీన్‌కు చైనా అతి పెద్ద కొనుగోలుదారుగా ఉంది. ధరను బాగా తగ్గించకుండా, ఇతర కొనుగోలుదార్లను చూసుకునేందుకు అమెరికన్ రైతులకు ఉన్న అవకాశాలు తక్కువ. వాణిజ్య యుద్ధం వల్ల రెండు దేశాలు నష్టపోకుండా ఉండడం కష్టం. చైనాలో యాపిల్, స్టార్‌బక్స్ తదితర అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. చైనా వాటికి ఎంతో కొంత తప్పకుండా నష్టం కలిగించగలదు. వాటికి చైనా పెద్ద మార్కెట్‌గా ఉంది. ప్రపంచ జి.డి.పిలో ప్రపంచ వాణిజ్య వాటా 50 శాతం పైగానే ఉంటుంది. కనుక, దానికి ఏ విధమైన అవాంతరం వాటిల్లినా ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాణిజ్య యుద్ధం వల్ల వాణిజ్య భాగస్వాముల సమతూకాలలో మార్పుచేర్పులుంటాయి. సోయాబీన్లను చైనా మరెక్కడి నుంచో కొనుగోలు చేస్తే, వస్త్రాలకు చైనా మరో వనరు చూసుకుంటుంది. అయితే, ఆశించిన స్థాయిలో ఉండగల సరఫరాదార్లను అది కనుగొనవలసి ఉంటుంది. పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం మొదలైతే ఎస్ అండ్  పి మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 ట్రిలియన్ డాలర్లు తగ్గుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అది ఇంకా అనేక విధాలుగా నష్టం వాటిల్లజేస్తుంది. 

ఉదాహరణకు, రుణ భారం అధికమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల రుణం 237 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఒక అంచనా. ప్రపంచ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 69 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కనుక, వాణిజ్య యుద్ధాల ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేన్ తగ్గితే, రుణాలను తిరిగి చెల్లించడంపైన కూడా దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తక్షణం రుణాల చెల్లింపునకు ఒత్తిడి వస్తే కంపెనీలు అల్లల్లాడతాయి. ఇంకా అనేక రకాల సవాళ్ళు ఎదురవుతాయి. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. బహుశా, మూలధనాన్ని కాపాడుకోవడం ద్వారా అది ఆ పనికి శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. బ్యాంకుల ఏకీకరణ వల్ల ఆశించిన ఫలితం దక్కక పోవచ్చు. మన దేశంలో సుమారు 100 ప్రభుత్వ రంగ సంస్థలు నిరంతరం నష్టాలను పోగేస్తూనే ఉన్నాయి. పన్ను చెల్లింపుదార్ల నిధులతో అవి నెట్టుకొస్తున్నాయి. మూలధనాన్ని కాపాడుకోవాలనే అభిమతం ప్రభుత్వానికి లేకపోతే కరెన్సీ విలువ క్షీణించి తీరుతుందని ఆర్థిక నిపుణుల ఉవాచ.

Tags
English Title
Trade war ... the head is the head of Gokovat
Related News