విజయనగర పాలనలో విజయదశమి

Updated By ManamThu, 10/18/2018 - 01:32
Navaratri celebrations

రాయలు కోశాగారాల కన్నా సైన్యానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవాడు. అమరనాయకులు తన సైన్యాన్ని సక్రమంగా పోషిస్తున్నారో లేదో అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత రాజుపైనే ఉంటుంది. అందుకే రాయల వారు ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల ముగింపు రోజున సైన్యాన్నంతా సమావేశపరచి స్వయంగా పరీక్షించేవారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత కృష్ణదేవరాయలు తాను కొత్తగా నిర్మించిన నాగలాపురంకు చేరుకునేవారు. అక్కడ ప్రజలందరూ దారుల వెంట నిలబడి రాయల వారికి ఘనస్వాగతం పలికేవారు. ఇలా తొమ్మిది రోజుల దసరా ఉత్సవాలను సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు అంగరంగ వైభవంగా నిర్వహించి తన ఖ్యాతిని ఆచంద్రతారార్కం చేసుకున్నాడు.


dasaraనవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే పిల్లలు, పెద్దల సం బురాలకు ఇక హద్దులుండవు. ఈ ఆనందానికి పట్టణాలు, గ్రామాలు అనే తేడా ఉండదు. దేవాలయాలలో హరివి ల్లులా మెరిసే విద్యుద్దీపాలంకరణలు, హరికథలు, బుర్రకథ లతో తొమ్మిది రోజులు కోలాహలంగా ఉంటుంది. హిందు వులు భక్తిశ్రద్ధలతో, అత్యంత ప్రీతిపాత్రంగా, ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. మహార్న వమి అనేది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. అశ్వనీ నక్ష త్రంలో కలసి వచ్చిన పూర్ణిమ మాసమే అశ్వీయజ మాసం. ఈ మాసంలో శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభించి శుక్ల నవ మి వరకు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు, 10వ రోజు వచ్చే విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది శరధృ తువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరన్నవ రాత్రులు అనీ అంటారు. దీన్నే క్షత్రియుల పండుగ అని కూడా పిలు స్తుంటారు. పండుగ రోజు ఆయుధపూజ నిర్వహించటం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ రోజున ‘హారేణతు విచి త్రేణ భాస్వత్కనక మేఖలా, అపరాజితా భద్రరతా కరోతు విజయంమమ’ మంగళకరమైన దుర్గా! అపరాజితా దేవిగా నాకు విజయమిచ్చుగాక అని ఆ దుర్గాదేవిని ప్రార్థిం చి, పూజలు చేయటం ఆనవాయితీ.

ఈ పండుగ గురించి ఎన్నో కథలు, గాథలను ప్రజలు వ్యవహారంలో చెప్పుకోవటం తెలిసిందే. అయితే వీటికి సం బంధించి పురాణాలలో కొన్ని చారిత్రక వర్ణనలు తప్ప ఇం కేమీ దొరకవు. ఈ పండుగకు సంబంధించిన మూలాల గురించి స్పష్టమైన సమాచారం దొరకటం కూడా కష్టమే. ప్రస్తుతం దసరా ఉత్సవాలు అంటేనే మనకు గుర్తొచ్చేవి మైసూరు దసరా ఉత్సవాలు. ఒడయారు రాజవంశీయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు దాదాపు 408 సంవత్సరాల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఒడయార్ వంశస్తులు క్రీ.శ. 1610లో శ్రీరంగ పట్టణం వేదికగా ఈ ఉత్సవాలను ప్రారం భించారు. తర్వాత కాలంలో వీరు రాజధానిని మైసూరుకు మార్చుకోవటంతో అక్కడ ఉత్సవాలు నిర్వహించేవారు. అవే నేటికీ మైసూరు దసరా ఉత్సవాలుగా ప్రపంచఖ్యాతి పొందాయి.

దసరా ఉత్సవాలను ఒడయార్ వంశస్థుల కంటే ముం దు, క్రీ.శ. 15వ శతాబ్దంలో విజయనగర పాలకులు ఘనం గా నిర్వహించేవారు. క్రీ.శ.1443 ఏఫ్రిల్‌లో అబ్దుల్ రజాక్, క్రీ.శ.1520-22లో డోమింగో ఫేస్, క్రీ.శ.1535-37 మధ్య ఫెర్నావో న్యూనిజ్ వంటి విదేశీ రాయబారులెందరో విజయ నగర సామ్రాజ్యాన్ని సందర్శించారు. విజయనగర పాలకుల వైభవం గురించి వీరు రచించిన రచనలే ఈ ఉత్సవాలను గురించి గొప్పగా చెప్పాయి. అవే మనకు నేడు ఆధారాలు గా నిలుస్తున్నాయి. క్రీ.శ.1520లో క్రిస్టోవోడే ఫిగెరిడో అనే పోర్చుగీసు రా యబారి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించాడు. ఆ ఫిగెరిడో వెంట వచ్చిన వాడే డోమింగో ఫేస్. ఇతను విజయనగర పర్యటనలో ఉండగానే రెండు ఉత్సవాలు జరి గాయని తన రచనలో చెప్పాడు. అశ్వయుజ మాసంలో జరుపుకునే మహానవమి ఒకటైతే, మరొకటి కార్తీక మాసం లో జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు. ఈ రెండు పండుగలకు మధ్య నెలరోజుల తేడా ఉండేది. క్రీ.శ.1520 సెప్టెంబరు 12న మహానవమి వేడుకలను, అక్టోబరు 12న నూతన సంవత్సర వేడుకలను కృష్ణదేవరాయలు ఘనంగా నిర్వహించినట్లు డోమింగో ఫేస్ రాశాడు. ఈ నూతన సంవ త్సర వేడుకలలో తన ఉద్యోగులందరికీ వారివారి హోదా ను బట్టి జీతాలివ్వడం ఆనవాయితీ. 

ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. హిందూ సంప్రదాయం ప్రకారం మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా నూతన సంవత్సర వేడుకలను చైత్రమాసంలో జరుపుకుంటున్నాం. తెలుగు వారు ఉగాది గాను, మరాఠీలు గుడిపడ్వా, తమిళులు పుత్తాండు, మల యాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్‌లా బైశాఖ్ అనే పేర్లతో జరుపుకుంటున్నారు. కాని విజయనగర పాలకులు కార్తీక మాసం ఆరంభాన్ని నూతన సంవత్స రంగా భావించినట్లు తెలుస్తోంది. కార్తీక మాసాన్ని కొత్త సంవత్సరంగా భావిస్తే, ఇపుడు మనం చైత్ర మాసాన్ని కొత్త సంవత్సరంగా భావిస్తున్నాం. మరి ఈ తేడా ఎప్పటి నుంచి, ఎలా వచ్చిందో పరిశోధించాల్సిన అవసరం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ.1520 సెప్టెంబరులో దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించాడు. ఈ ఉత్సవా న్ని ఇంత వైభవంగా నిర్వహించటానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. రాయలు రాయచూరు దుర్గాన్ని క్రీ.శ.1520 మే 19వ తేదీన స్వాధీనపరచుకున్నట్లు సీవెల్ పరిశోధన ద్వారా తెలుస్తుంది. అంటే రాయలు ఈ యుద్ధంలో విజ యం సాధించిన నాలుగు నెలలకే దసరా రావటం జరిగింది. ఈ విజయోత్సాహంతో కృష్ణరాయలు అంగరంగ వైభవంగా మహానవమి ఉత్సవాలను నిర్వహించ తల పెట్టాడు. డోమింగో ఫేస్ అప్పటికే విజయనగర పర్యటనలో ఉండటం వల్ల రాయల వారు, తనని ఈ ఉత్సవాలకు ఆహ్వానించినట్లు చెప్పుకున్నాడు. పేస్ ఈ ఉత్సవ కార్యక్ర మాలలో ప్రత్యక్షంగా పాల్గొని తిలకించటం వల్ల దాని గురిం చి తన రచనలో విపులంగా వర్ణించగలిగాడు. వీరి రచన ఆధారంగా రాయల నాటి దసరా ఉత్సవ వైభవాన్ని నేటి తరానికి చాటి చెప్పాలనే చిన్న ప్రయత్నమే ఈ పరిశోధనా వ్యాసం రాయటానికి ప్రేరణ అయింది.

సంగీత సాహిత్యాది కళలు, వాటిలో జరిగే సాంస్కృతి కోత్సవాలు ప్రభుత్వంతో ప్రజలను సన్నిహితం చేయగలవు. మన సంస్కృతిని, శాంతి భద్రతలను కాపాడగలవు. ఇవి మానసిక వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయని గుర్తించి, ఆచరణలో పెట్టిన గొప్ప కళా పిపాసకుడు శ్రీకృష్ణదేవరా యలు. రాయలు తాను కొత్తగా నిర్మించిన నాగలాపురం అనే నగరంలో ఎక్కువగా ఉండేవాడు. ఆనాడు ఏ ఉత్స వాలైనా రాజధాని నగరమైన విజయనగరంలోనే జరిగేవి. కాబట్టి ప్రధాన పండుగలు, ఉత్సవాల సందర్భాలలో మా త్రం రాయలు రాజధాని నగరానికి విచ్చేసే వాడు. అక్కడే విందులు, వినోదాలు జరిగేవి. ఇక రాయలు దసరా ఉత్స వాలను ఎంత ఘనంగా నిర్వహించాడో చూద్దాం.
ఈ దసరా ఉత్సవాలకు నాలుగు నెలల ముందు నుం చే ఏర్పాట్లు కొనసాగేవి. ఈ ఉత్సవాలకు రాయల వారు తమ మిత్రదేశాల రాజులను, విదేశీ రాయబారులను ఆహ్వా నించేవాడు. అలాగే తమ సామంతరాజులను, సేనాధిపతు లను వారి వారి పరివారంతో సహా అందరినీ ఆహ్వానించే వాడు. ఉత్సవాలకు అందరూ హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేసేవాడు. కానీ రాజ్యానికి దూరంగా ఉన్న వాళ్ళను, శత్రురాజ్యాల  సరిహద్దులకు ఆనుకొ ని ఉన్న సామంత రాజులకు, సేనానులకు మాత్రం మినహాయింపు ఉండేది.

దసరా ఉత్సవాలను విశాల మైన మైదానంలో నిర్వహిం చేవారు. ఈ మైదానం అంత:
అంతఃపుర ముఖ ద్వారానికి ఎదురుగా ఉండేది. ఈ ద్వారం నుండి అంత:పుర ప్రాంగణమంతా ప్రహరీగోడ చుట్టి ఉంటుంది. ఉత్సవమై దాన ద్వారంవద్ద చాలా మంది సైనికులు చేతుల్లో కర్ర లు, కొరడాలు, పట్టుకొని కాపలా కా స్తుంటారు. వీరు ప్రముఖులను, ఉత్సవాలను తిలకించటానికి అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపిస్తుంటారు. మిగతా ఎవరినీ అనుమతిం చ రు. ఈ ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే మరో మైదానం, దాన్ని దాటి లోపలికి వెళ్ళితే ప్రధాన మైదానం కనిపిస్తుంది. అంటే ఉత్సవ మైదానానికి మూడంచెల భద్రత కల్పించబడి ఉంటుంది. ఈ ప్రధాన మైదానం చుట్టూ సేనాధిపతులు, ఇతర ప్రముఖులు కూర్చోడానికి వీలుగా వరండాలు నిర్మిం చబడి ఉంటాయి. ఉత్సవ మైదానానికి ఉత్తర దిశగా ఎడమవైపున కొంత ఎత్తులో ఒకే అంతస్తు ఉన్న ఒక పెద్ద భవనం ఉండేది. ఇది ఏనుగు ఆకారంలో చెక్కిన శిలాస్తంభాలతో, నృత్యభంగిమ లున్న శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది. ఇది ప్రధాన వేదిక. ఈ వేదికలోకి వెళ్ళటానికి రాతి మెట్లదారి నిర్మించ బడి ఉంటుంది. దీన్ని ‘హౌస్ ఆఫ్ విక్టరీ’ అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1520 మే లో కళింగను జయించిన తర్వాత ఆ విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించాడు. ప్రస్తు తం దీన్నే మనం ‘దసరా దిబ్బ’ అని పిలుస్తున్నాం.  ఇప్ప టికీ నాటి రాయల వారి రాజసం ఉట్టి పడేలా మనకు దర్శనమిస్తుంది.

ఈ మైదానానికి కుడివైపు ఉన్న ఖాళీ స్థలంలో ఎత్తుగా కర్రలతో వేదికలను ఏర్పాటు చేసేవారు. ఈ వేదికలను దస రా ఉత్సవాలకు మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఈ వేదికలకు చుట్టూ ఎర్రని, ఆకుపచ్చని రంగు గల పట్టుబట్టలతో కింది నుంచి పైదాక కప్పబడి ఉంటాయి. ఇలాంటివి మొత్తం 11 కర్ర వేదికలను ఏర్పాటు చేసేవారు. ఇందులో రెండు వృత్తా కార వేదికలు కూడా ఉన్నాయి. వీటిపై రత్నఖచితమైన ఆభ రణాలు ధరించి ఆడంబరంగా తయారైన నాట్యగతె్తలు నా ట్యం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఉత్సవ మైదానానికి తూర్పు దిక్కున మధ్యలో హౌస్ ఆఫ్ విక్టరీ లాంటి మరో రెండు వేదికలుంటాయి. ఇవి కూ డా అందమైన పట్టు వస్త్రాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ వేదికలలో రాజపుత్రులు, వారి రాణులు, ఆంతరంగి కులు, కొన్ని సందర్భాల్లో నపుంసకులు కూర్చొని ఉత్స వాలు తిలకించటానికి వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయ బడి ఉంటాయి. దసరా ప్రధాన వేదికపై రాజు కోసం ఒ క ప్రత్యేకమైన గది ఉంటుంది. ఈ గదిలో దేవి విగ్రహం ఉంటుంది. ఈ వేదిక మధ్యలో మెట్ల కెదు రుగా మరో చిన్న వేదిక నిర్మించబడి ఉండేది. దానిపై విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని ఉంచుతారు. ఈ సింహాస నం ఎలా ఉం టుందంటే నాలుగు అంచులు కల్గి, మధ్యలో గుండ్రంగా ఉం టుంది. సింహాసనం చుట్టూ బంగారు సింహం బొ మ్మలుంటాయి. విజయ నగర రాజులు దసరా ఉత్సవాలలో దేవీపూజ తర్వాత పవిత్రమైన ఈ సింహాసనంపై కూర్చునే వారు. ధర్మపరాయణులైన రాజులు మాత్రమే ఈ సింహాసనాన్ని అధిష్టించడానికి అర్హులనే నమ్మకం వారిలో ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు ఈ సింహాసనంపై కూర్చున్నారని ఫేస్ రాశాడు. ఈయన తర్వా త వచ్చిన అచ్యుతరాయలు మాత్రం ఆ సింహాసనం మీద కూర్చోలేదని న్యూనిజ్ రాశాడు. మైసూరు దసరా ఉత్సవా లలో ఇప్పటికీ ఈ సింహాసన సంప్రదాయం కొనసాగు తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సింహాసనం ఒడయార్ వంశస్థులకు విజయనగర పాలకుల నుంచి అందిందా? లేక ఔరంగజేబు బహుమానంగా ఇచ్చాడా? అనే విషయంలో నేటికీ సందేహాలున్నాయి.

దసరా ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని చాలా అట్ట హాసంగా జరిపేవారు. రాయలు ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని దేవి విగ్రహం ఉన్న వేదికకు చేరుకుంటాడు. అప్పటికే ఉత్సవాన్ని చూడటానికి వచ్చిన వారందరూ వరం డాలలో వారికి కేటాయించిన స్థానాలలో ఆసీనులై ఉంటారు. అమ్మవారి వేదికకు ఎదురుగా ఉన్న మరో వేదికపై నాట్యగత్తెలు నాట్యం చేస్తుంటారు. వేదిక ముందు అత్యంత ఆడంబరంగా అలంకరించబడిన 11 గుర్రాలు, వాటి వెనుక 4 ఏనుగులు నిల్చొని ఉంటాయి. 

పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి గది లో రాయులు పూజలు నిర్వహిస్తాడు. పూజా కార్యక్రమం ముగించుకొని రాజు వేదిక బయటకు వస్తాడు. మరో పూజారి తెల్లని గులాబిపూల బుట్టను పట్టుకొని బయట సిద్ధంగా ఉంటాడు. రాయలు మూడు పిడికిళ్ళ గులాబి పూలను తీసుకొని అక్కడున్న గుర్రాలపైన, ఏనుగులపైనా చల్లుతాడు. తర్వాత రాజు తనకు కేటాయించిన సింహా సనంపై ఆసీనులు కాగానే 24 ఎనుబోతులను, 150 పొట్టే ళ్లను దేవి విగ్రహానికి బలి ఇచ్చేవారు. దున్న తల ఒక్క వేటుతో తెగిపడాలనే నియమం ఉండేది. బలిచ్చే కార్యక్రమం పూర్తికాగానే, ఉత్సవానికి వచ్చిన సేనాధిపతులు, సామంతరాజులు, ఇతర ప్రముఖులు సమ ర్పించే కానుకలను స్వీకరిస్తాడు. ఈ తతంగమంతా ముగిం చుకొని రాయల వారు అంతఃపురంలోకి తిరిగి వెళ్ళటంతో ఉత్సవ ప్రారంభ కార్యక్రమం ముగుస్తుంది. 

దసరా ఉత్సవాల సందర్భంగా రాయలు వచ్చిన అతిథుల కోసం మంచి విందు భోజనాలతో పాటు, వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకు ఉత్సవ మైదానంలో ఈ వినోద కార్యక్రమాలు ప్రారంభమైయ్యేవి. వినోద కార్యక్రమాలలో భాగంగా సంగీత కచేరీలు, నాట్యగత్తెల నాట్యాలు, కుస్తీ పోటీలు ఇలా అనేక పోటీలు వేరువేరు వేదికలపై నిర్వహించే వారు. కుస్తీ పోటీలలో బలాఢ్యులంతా పాల్గొనేవారు. ఇవి చాలాక్రూరంగా జరిగేవి. పళ్ళు రాలిపోవడం, రక్తం కార టం, స్పృహ కోల్పోవటం వంటివి జరుగుతుండేవి. మరో వేదికపై సైనిక విన్యాసాలు జరిగేవి. సైనికులు ఆయుధాలతో అనేక రకాల విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరిచే వారు. వినోద కార్యక్రమాలు పూర్తి కాగానే బాణ సంచా కాల్చి అందరూ సంబరాలు చేసుకునేవారు. ఈ ఉత్సవాల సందర్భంగా అనేక ప్రదర్శనలను ఏర్పా టు చేసేవారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ప్రద ర్శనలు రెండున్నాయి. వినోద కార్యక్రమాలు పూర్తి కాగానే శకటాల ప్రదర్శన ప్రారంభమయ్యేది. ఈ ప్రదర్శనలో సైన్యాధిపతులకు సం బంధించిన అలంకృత రథాలు ఒక్కొక్కటిగా ప్రవేశిస్తాయి. కొన్ని రథాలు రెండు మూడు అంతస్తులు కల్గి ఉంటాయి. ఈ రథాలలో నాట్యం వంటి వివిధ విన్యాసాలను ప్రదర్శి స్తుంటారు. ఇవి నేడు స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భం లో ప్రదర్శించే ప్రభుత్వ శకటాల మాదిరి జరుగుతుండేవి. ఈ శకట ప్రదర్శనలో ముందు రాయల వారికి గుర్తుగా రెండు గొడుగులున్న రథం వస్తుంది. దాని తర్వాత వరు సగా ఇతర రథాలు వస్తుంటాయి. వాటి విన్యాసాలు అన్ని అయిన తర్వాత గుర్రాలన్నీ ఆరు వరుసలుగా రాయల వారి ముందు నిలబడతాయి. అపుడు ఒక బ్రాహ్మణుడు నీళ్ళ కుండతో వచ్చి గుర్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, వాటికి పూజ చేయటంతో ఈ శకట ప్రదర్శన సమాప్తమవుతుంది.

ఆ) అంత:పుర స్త్రీల ప్రదర్శన :
ఈ ప్రదర్శన మహారాణులు తమ కున్న ఆభరణాల వైభవాన్ని ప్రదర్శించేందుకు ఉద్ధేశించింది. ఉత్సవం జరిగే 9 రోజులలో ప్రతి మహారాణికి ఒక్కొక్క రోజు కేటాయించ బడుతుంది. తనకు కేటాయించిన రోజున రాణి తన సహచ రులకు, చెలికత్తెలకు తన ఆభరణాలన్నింటినీ అలంకరింప చేసి ప్రదర్శనకు పంపుతుంది. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగేది. రకరకాల మంగళ వాయిద్యాల నడుమ ఇరవై నుంచి ముప్పై మంది స్త్రీలు చేతిలో బెత్తాలతో, భుజాన కొరడా లతో అంత:పురం నుండి వస్తారు. వారి వెంట కొందరు నపుంసకులు కూడా ఉంటారు. రాయల కాలంలో నపుంస కులకు గౌరవ ప్రదమైన స్థానముండేది. ఇప్పుడైతే వీళ్ళు దుర్భర జీవితాలను గడుపుతున్నారు కానీ, అప్పుడు రాజ భోగాలను అనుభవించేవారు. సరే వీళ్ళ సంగతి అలా పక్కన పెడదాం. వారి వెనుక రాణి ఆభరణాలతో ప్రత్యే కంగా అలంకరించబడిన స్త్రీలు వస్తుంటారు. వీరి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ వజ్రవైఢూర్యాలతో పొదగబడి ఉంటాయి. వీరందరు 1620 సం.ల మధ్య వయసున్న వారే. వీళ్ళు జ్యోతి వెలిగించిన బంగారు బిందెలను ఎత్తు కొని నడుచుకుంటూ వచ్చి, అక్కడున్న గుర్రాల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళి పోతారు. దీంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

దసరా ఉత్సవాలు 9వ రోజుతో ముగింపు దశకు చేరు కుంటాయి. ఈ ముగింపు వేడుకలు మరింత అట్టహాసంగా, గంభీరంగా జరుగుతాయి. రాయలు ఉత్సవాల చివరి రోజున అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేస్తాడు. తదనంత రం దేవి విగ్రహానికి 250 దున్నపోతులను, 4500 పొట్టేళ్లను బలి ఇస్తారు. ముగింపు వేడుకలలో భాగంగా జరిగే సైనిక పరేడ్ ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దసరా ఉత్సవాల ముగింపు వేడుకలలో జరిగే సైనిక బలగాల సమీక్ష అత్యంత ముఖ్యమైనది. రాయలు తన అధి కార యంత్రాంగంలో ఒక భాగమైన సైన్యాన్ని అమర నాయకుల అధీనంలో ఉంచేవాడు. రాజ్యానికి కోశం కన్నా సైన్యమే ముఖ్యమని కౌటిల్యుని అర్థశాస్త్రంలో చెప్పబడింది. అందుకే రాయలు కోశాగారాల కన్నా సైన్యానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవాడు. అమరనాయకులు తన సైన్యాన్ని సక్రమంగా పోషిస్తున్నారో లేదో అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత రాజుపైనే ఉంటుంది. అందుకే రాయల వారు ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాల ముగింపు రోజున సైన్యాన్నంతా సమావేశపరచి స్వయంగా పరీక్షించేవారు. దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత కృష్ణదేవరాయలు తాను కొత్తగా నిర్మించిన నాగలాపురంకు చేరుకునేవారు. అక్కడ ప్రజలందరు దారుల వెంట నిలబడి రాయల వారికి ఘనస్వాగతం పలికేవారు. ఇలా తొమ్మిది రోజుల దసరా ఉత్సవాలను సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు అంగరంగ వైభవంగా నిర్వహించి తన ఖ్యా తిని ఆచంద్రతారార్కం చేసుకున్నాడు.
 నీలం వెంకటేశ్వర్లు పరిశోధక విద్యార్థి
9502411149

English Title
Vijayagasamy in the reign of Vijayanagara
Related News