‘ద వల్చర్ అండ్ ద లిటిల్ గర్ల్’

Updated By ManamWed, 09/12/2018 - 01:05
KEVIN

ఎముకల గూడును కప్పి న నల్లని చర్మం.. కొట్టు కుంటున్న ఎండిన డొక్క లు.. దాహంతో పిడచ కట్టుకుపోయిన నాలుక.. ఆ దేహంలో ప్రాణం కొ ట్టుమిట్టాడుతూనే ఉం ది.. ఇసుక మైదానంలో ఆ రెండేళ్ల శిశువు దేహం  కదులుతోంది. ప్రాణం ఆగిపోతే తినేద్దామని ఆపక్కనే కూర్చుని ఎదురుచూస్తున్న రాబందు. దక్షిణ సూడాన్ లోని అయోద్ గ్రామంలో  కెవిన్ కార్టర్‌ను కదిలించిన దృశ్యం ఇది. కన్నీళ్లు పెట్టించిన దృశ్యం. అతని కెమెరా లో బందీ అయిన దృశ్యం. ‘న్యూయా ర్క్ టైమ్స్’లో పతాక శీర్షికై, మరునాటి పొద్దున్నే పోస్టరై పలకరించిన దృశ్యం. ఈ ప్రపంచాన్ని వెక్కిరించిన దృశ్యం. వెక్కి వెక్కి ఏడ్పించిన దృశ్యం. పులిడ్జర్ అవార్డు ఇప్పించిన దృశ్యం. అమానవీయమైన ఈ అసమసమాజం ము ఖాన తన ప్రాణాన్ని విసిరికొట్టడానికి ధైర్యాన్నిచ్చిన దృశ్యం. కరువుతో, వరదలతో, అంతర్యుద్ధంతో అల్లా డుతున్న దక్షిణ సూడాన్‌పై డాలర్ల వర్షం కురిపించిన దృశ్యం. ప్రపంచ చిత్రపటంపై ఒక దేశం చెరిగి పోకుండా నిలబెట్టిన దృశ్యం.

image


ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో పాలకులు అర బ్బుల నుంచి వచ్చిన ఇస్లాంను స్వీకరించారు. ఆఫ్రి కా సంస్కృతిని ఆరాధించే దక్షిణ సూడాన్‌లోని ప్రజ లు, గిరిజన తెగలు తమపై అరబ్బు సంస్కృతిని రుద్ద డాన్ని తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూమెంట్’ పేరుతో సాయుధ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఫలితంగా 1955 నుంచి దక్షిణ సూడాన్‌లో మొదలైన అంతర్యు ద్ధం 1972 వరకు సాగింది. మళ్లీ 1983లో మొదలై 2005 వరకు సాగింది. అంతర్యుద్ధం మొదలైన పదేళ్ల కు దక్షిణ సూడాన్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొ న్నాయి. తిరుగుబాటు దళాలలోనూ ఆధిపత్య పోరు సాగుతోంది. మతం పేరుతో, జాతి పేరుతో అధికారం కోసం, ఆధిపత్యం కోసం దశాబ్దాల తరబడి మారణ హోమానికి పాల్పడుతున్నారు. మరోపక్క వరదలు ముంచెత్తుతున్నాయి. తిండి దొరకక, నీళ్లు దొరకక ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. జంతువులతో పోటీపడి మనుషులూ మరణిస్తున్నారు. 

ఈ అంతర్యుద్ధంలో పేదలు ఆకలితో, రోగాలతో, తలదాచుకునే నీడలేక మైళ్ల దూరం వలసవెళుతున్నా రు. ఏకధాటిగా అయిదు రోజులు నడిచినా తిండి దొ రకని ఓ ఉపాధ్యాయుడు ఇక నడవలేక ఆగిపోయాడు. నేల రాలుతున్న వృద్ధులు, యువకులు, పిల్లలు. పసి బిడ్డల కళ్లముందే ప్రాణాలు వదులుతున్న తల్లిదం డ్రులు. తల్లిదండ్రుల కళ్ల కట్టెదుటే ఊపిరి వదులు తున్న పిల్లలు. ఒకరా ఇద్దరా! ఒక్క అయోద్ గ్రామం లోనే రోజుకు పది నుంచి పదమూడు  ప్రాణాలు గా లిలో కలిసిపోతున్నాయి. రెండవదశ అంతర్యుద్ధంలో అయిదు లక్షల మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు.

 మానవ జాతి చరిత్రలో అత్యంత విషా దమయ కాలం ఇది. ఈ దుస్థితిపై అవగాహన కల్పిం చడానికి, తద్వారా సాయం కోరడానికి ‘ఆపరేషన్ లైఫ్‌లైన్ సూడాన్’ అనే సంస్థ 1993లో వివిధ దేశాలకు చెందిన కొందరు ఫొటో జర్నలిస్టులను ఆ హ్వానించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఫొటో జర్నలిస్ట్ కెవిన్ కార్టర్ అనేక ఆంక్షల మధ్య లెక్కలేన న్ని విషాద దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. అయోద్ గ్రామంలోని ఇసుక మైదానంలో ఒంటరిగా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న శిశివు. ఆ శిశువు మరణిస్తే తినేయాలని ఒక రాబందు అక్కడే కూర్చుని ఎదురుచూస్తున్న దృశ్యం. ఆ దృశ్యాన్ని చూసి చలించి పోయాడు. కెమెరాలో బంధించాడు. శిశువును భుజా న వేసుకుని సహాయ కేంద్రానికి పరుగుతీశాడు. అక్క డికి చేరేసరికే ఆ శిశువు అతని భుజంపై శాశ్వతంగా వాలిపోయింది.

‘ద వల్చర్ అండ్ ద లిటిల్ గర్ల్’ అన్న శీర్షికన ఆ చిత్రం 1993 మార్చి 26వ తేదీన ‘న్యూయార్క్ టై మ్స్’లో అచ్చయింది. నాలుగురోజుల తరువాత మా ర్చి 30 సంచికలో ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రత్యేక కథ నాన్ని ప్రచురించింది. అనేక పత్రికలు కూడా ఆ ఫొ టో కథనాలను ప్రచురించాయి. దక్షిణ సూడాన్‌కు పెద్ద ఎత్తున సాయం అందింది. ఫీచర్ ఫొటోగ్రఫీలో ఆ చిత్రానికి 1994 మార్చిలో ప్రతిష్టాత్మకమైన పులి డ్జర్ అవార్డు వచ్చింది. నాలుగు నెలలకు, 1994 జులై 27న తన 33వ ఏట కార్బన్ మోనాక్సైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ నాయకుడు వీరప్పమొయిలీ చేతికి ‘ద వల్చర్ అండ్‌ది లిటిల్ గర్ల్’ అన్న ఆ చిత్రం అచ్చైన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రతి అమెరికాలో ఉన్న ఆయన కుమారుడి ద్వారా చేరింది. ‘ఫ్రంట్‌లైన్’ పత్రికలో వీరప్పమొయిలీ కవితాత్మకంగా రాసిన చిన్న కథనానికి ‘వర్తమానం పత్రిక’లో ‘రాబందుల రెక్కల చప్పుడు’ అన్న శీర్షికన చేసిన అనుసృజన ఇది. దక్షిణ సూడాన్ ప్రజలకు ఎదురైన దారుణ పరిస్థితులు ఈ భూమిపైన ఏ మానవ జాతికీ రాకూడదు.

రాబందుల రెక్కల చప్పుడు
ఆకలితో ఆ రాబందు రెక్కల చప్పుడు చేస్తోంది
ఎంత సేపటి నుంచో ఎదురు తెన్నులు చూస్తోంది !
నిముషాల ముల్లు నిలకడగా లేదు / సెకన్లముల్లు చకచకా నడిచిపోతోంది/గంటలు కూడా గడిచి పోతున్నాయి/విందారగిద్దామంటే ఆ జీవి ఇంకా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది!
ఊపిరాగిపోయే ఆ క్షణాల కోసం ఎదురు చూస్తోంది
రాబందు.. రెక్కల చప్పుడు చేస్తోంది / ఆడ శిశువు ఆకలితో అల్లాడిపోతోంది / కదిలే ఓపిక లేదు / ముడుచుకుపోయిన కాళ్లూ చేతులు / చుట్టచుట్టుకు పోయిన శరీరం / వాలిపోయిన తల / పొట్టతో దేక డానికి చేస్తున్న ప్రయత్నం / గుక్కెడు గంజికోసం వెతుకుతూ / మూతలు పడుతున్న కళ్లు / ఈ ఎడారిలో ఏం దొరుకుతుందనో!?

దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది / పెదాలు ఎండుకుపోతున్నాయ్ / కాలుతున్న పెనంలా కడుపు/ కళ్లు కూడా గుంటలు పడిపోతున్నాయ్ / చర్మం..అది పేరుకే / బాణంలా వంగిపోయిన వెన్నెముక / అది హస్తిపంజరం కూడా కాదు / అదొక ఎముకల గూడు / నల్లటి శరీరం / పక్కటెముకలతో బోనులా ఉందా ఆకారం / ఆ జీవన చక్రం కుప్పకూలిపోయింది! / కెవిన్ కార్టర్ కారులోంచి దూకాడు / ఆ శిశువు పాకలేక పాకుతోంది / కారునడుపుతున్నప్పటి కలలు పటాపంచలయ్యాయి / జ్ఞాపకాలు చెల్లాచెదరయ్యాయి / మిగిలిందల్లా ఆకలి కొలిమిలో బూడిద / రాబందుకు ఆశ చావలేదు / కెవిన్ కార్టర్ కళ్లు చెమ్మగిల్లాయి / మనిషి చెలించిపోయాడు / కర్తవ్యం...? / వెంటాడుతున్న కర్తవ్యం...! / వేటాడుతున్న కర్తవ్యం...! / క్లిక్..మన్న కెమెరాలో బందీ అయిన దృశ్యం / ఆకలితో రెక్కలు చప్పుడు చేస్తున్న రాబందు / ఆకలితో అల్లాడిపోతున్న పసికందు / ఆకలి... ఆకలి... / ప్రపచంమంతా ఆకలి / క్షణం కూడా ఆగలేని మనసు / మరణ వేదనను శ్వాసిస్తున్న శిశువు / రాబందు.. రెక్కల చప్పుడు.. / చేజారిపోతున్న తిండి కోసం చేస్తున్న చప్పుడు / ఒకే ఒక్క ఉదుటన శిశువును  భుజానకెత్తుకున్నాడు / నోటికాడి కూడా గద్దలా తన్నుకుపోతున్నాడని / కోపంతో రాబందు దుమ్మురేపుకుంటూ / రెక్కల చప్పుడు చేసుకుంటూ / గాలిలోకెగిరిపోయింది / రాబందు ఆశచావలేదు / ఆకాశంలో గిరికీలు కొడుతోంది / గింగిరాలు తిరుతోంది / భుజంపై శిశువు వాలిపోయింది / విశ్రాంతి తీసుకుంది / గంజి.. / గుక్కెడు గంజి... / పెదాలు తడిపే గంజి... / పేగులు చల్లార్చే గంజి... / గంజి..ఒక ఎండమావి / ఎడారిలో ఒయాసిస్సులా గంజి / గంజి...ఓ విందుభోజనం / ఆ శిశువు కళ్లలో నీరెండిపోయింది / ఆకలి శాశ్వతంగా చల్లారిపోయింది / చావు చాలా సహజం / ప్రతిజీవికీ చావు తప్పదు / ప్రతి జీవికీ జీవితం కూడా తప్పదు/ కన్నీళ్లు అవసరం / కరుణ అవసరం / 

దయ అవసరం / జీవిత నాటక రంగంపై జరిగే దృశ్యాలను చూసి / తలపైకెత్తి నిట్టూర్చడమూ అవసరం / జీవితంలో కలలు కనలేని శిశివు / భూదేవి తన కడుపులో పెట్టుకుని / ఉయ్యాల ఊపుతోంది / ఆ ఉయ్యాలలో నిద్ర రాదు / రాబందు తన్నుకు పోతోంది / వానపాములక్కూడా బిచ్చమేస్తుంది / ఈ దారుణమైన దృశ్యాన్ని చూసి / ఈ దృశ్యానికి ప్రతిబింబమైన చిత్రాన్ని చూసి / ప్రపంచం సిగ్గుతో తలదించుకోదు / పొగడ్తల వర్షం కురిపిస్తుంది / ఇలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నందుకు / కాదు.. చస్తున్నందుకు / కెవిన్ కార్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు / శూన్య హృదయం నుంచి / కోరిక మంటల్లా ఎగజిమ్మినప్పుడు / ఈ ప్రపంచమంతా ఉత్తదే..ఉత్తుత్తిదే.. / గుప్పెడు తిండిపెట్టి / గుక్కెడు గంజినీళ్లు పోయలేని పిసినార్లు,/ పిశాచాలు లేని లోకం కోసం / శిశువులను పీక్కుతినే రాబందులు లేని నేల కోసం/ నూతన వ్యవస్థా దేహంతో / మళ్లీ జన్మించడానికి / కెవిన్ కార్టర్ నిష్క్రమించాడు.

- (అనుసృజన)
- రాఘవశర్మ
(13న కెవిన్ కార్టర్ జయంతి)

English Title
'The Vulture and the Little Girl'
Related News