భవితకు అస్త్రం

Updated By ManamMon, 09/10/2018 - 22:32
Chandrababu

Chandrababuఅమరావతి: ఏ దేశానికైనా యువతరమే వెన్నెముక. విద్యావంతులైన యువతరానికి ఉపాధి అవకాశాలు అందించగలిగితే సమాజ  భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నైపుణ్య సాధనకు యువతకు ఆర్థిక చేయూతనిచ్చి, వారిని ఉద్యోగార్ధులను చేయాలనే లక్ష్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తారు. యువనేస్తం వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత అర్హులకు నైపుణ్యాభివద్ది, అప్రెంటిస్ ఆన్‌జాబ్ ట్రైనింగ్ అన్ని ఆన్‌లైన్‌లో జరిగిపోతాయి. యువనేస్తం వెబ్‌సైట్ ఓ రకంగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్‌లా పనిచేస్తుంది. దేశంలోని వివిధ కంపెనీలు ఈ వెబ్‌సైట్ లో రిజిస్టర్ అయ్యి తమకు కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూకి పిలుచుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్ సైట్ ని సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్టోబర్ 2 నుంచి యువత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుంది.   

పథకం ముఖ్య అంశాలు...

 • ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

 • స్వయం ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధి కల్పన

 • అప్రెంటిస్ కార్యక్రమం. ఆన్ జాబ్ ట్రైనింగ్

 • కాంపిటేటివ్ పరీక్షల కోసం శిక్షణ

 నిరుద్యోగ భృతికి అర్హతలు  

 • 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు

 • పీజీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఏడాది పూర్తి కావాలి.  

 • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి 

 • ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి 

 • కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండకూడదు 

 • ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న నిరుద్యోగులై ఉండాలి 

 • కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు 

 • ప్రభుత్వం నుంచి లోన్ /సబ్సిడీ రూ 50,000 మించి పొంది ఉండకూడదు.

 • గరిష్ఠంగా 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు 

 • అనంతపురం జిల్లాకు సంబంధించి గరిష్టంగా 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట భూమిని మించి ఉండకూడదు 

 • ఈపీఎఫ్, ఈఎస్‌ఐసీ కింద నమోదుకాబడిన ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులై ఉండకూడదు

 • బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్, ఆధార్ కార్డుకు జతచేసి ఉండాలి. 

 • తల్లిదండ్రులు/ కుటుంబ సభ్యులకు సామాజిక పింఛన్లు లభిస్తున్నప్పటికీ, నిరుద్యోగ భృతికి అర్హులుగానే పరిగణించబడతారు. 

 • శారీరక వికలాంగుల కోటా కింద పెన్షన్ పొందే వారు అనర్హులు

 • కుల, మత ప్రాధాన్యాలు నిబంధనల ప్రకారం అమలుచేస్తారు

 • ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తొలగించిన వారు అనర్హులు  

 • నేరస్థుడిగా శిక్షింపబడినవారు అనర్హులు

 • ఇతర రాష్ట్రాల విశ్వ విద్యాలయాల నుండి డిగ్రీలను పొందిన అర్హులే

నమోదు చేసుకోవడం ఎలా ? 
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతి పొందాలనుకునే వారు ‘యువనేస్త్తం.ఏపీ.జీవోవి.ఇన్’ వెబ్‌సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లోని అప్లై నౌ బటన్‌ను నొక్కి ఆధార్ కార్డు నెంబరు ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యార్హతకు సంబంధించిన పత్రాల కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కాల్ సెంటర్ నెంబర్ 1100ని సంప్రదించవచ్చు. 

నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ... 
ఈ పథకం ద్వారా నిరుద్యోగులు తమకు ఇష్టమైన మూడు రంగాలలో ఉద్యోగం పొందేందుకు అవసరమైన శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని దీనికి అనుసంధానం చెయ్యడం ద్వారా నిరుద్యోగులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నది. ఇందుకోసమే దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తంలో భాగస్వామ్యం చేస్తుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి యువనేస్తం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండు నెలల్లోనే 36 సమీక్షా సమావేశాలు నిర్వహించారు. యువత ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవడం, నైపుణ్యాభివద్ది, అప్రెంటిస్ ఇలా అన్ని మాడ్యూల్స్ ఆన్ లైన్ ద్వారా చేసుకునే విధంగా ఈ వెబ్‌సైట్ ని రూపొందించారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం సరైన సమాచారం లేకపోవడం వలనే ఇటువంటి కార్యక్రమం విఫలం అయ్యిందని గుర్తించిన మంత్రి నారా లోకేష్ అన్ని శాఖలను అనుసంధానం చేశారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి వారి నుండి సమాచారం సేకరించారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లతో సమావేశమై అందరిని సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమం అమలులో కీలకం అయిన అంశం పిఎఫ్, ఈఎస్‌ఐ డేటా ని కేంద్రం నుండి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి త్వరితగతిన వచ్చేందుకు బాగా శ్రమించారు. కేవలం ముఖ్యమంత్రి యువనేస్తం వెయ్యి రూపాయలు భృతి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం కాదని..యువత సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్నామని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. 

English Title
A weapon for the future
Related News