పటేల్ గురించి చరిత్ర చెబుతున్నదేమిటి?

Updated By ManamTue, 02/13/2018 - 23:48
patel

patelప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ కాంగ్రెస్, పటేల్, నెహ్రూల గురించి కొన్ని చారిత్రిక అసత్యాలను, అర్థసత్యాలను అలవోకగా దొర్లించారు. అవి ఇలా ఉన్నాయి: 1. దేశవిభజనకు కాంగ్రెసే కారణం. 2. పటేల్ ప్రథమ ప్రధాని అయి ఉంటే కాశ్మీర్ సమస్య తలెత్తి ఉండేదే కాదు. 3. పదిహేను కాంగ్రెస్ కమిటీలు సర్దార్ పటేల్ నాయకత్వాన్నే కోరు కున్నప్పటికీ నెహ్రూను ప్రధాన మంత్రిని చేశారు. 4. ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది నెహ్రూ, కాం గ్రెస్‌లే నన్నది అబద్ధం. 2,500 ఏళ్ల క్రితమే మన దే శంలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి. బౌద్ధ సంఘాల లో ప్రజాస్వామ్యం, వోటు విధానం అమలు జరిగేవి.


దేశవిభజనకు కాంగ్రెసే కారణమనడం అర్థస త్యం మాత్రమే. అందులో ముస్లింలీగ్ పాత్రా, బ్రిటిష్ పాత్రా అంతే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకర సత్యం ఏ మిటంటే, దేశసమగ్రతా పరిరక్షకుడిగా ప్రధాని ప్రస్తు తించిన సర్దార్ పటేల్ సైతం దేశ విభజనను కోరుకు న్నాడు. అంతేకాదు, భావజాలపరంగా ప్రధానికి, పరి వార్‌కు ఎంతో దగ్గరైన శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా దేశవిభజనను అభిలషించాడు. దేశవిభజనను వ్యతిరే కించినా కాంగ్రెస్‌లోని మెజారిటీ నిర్ణయానికి తలవం చిన గాంధీ మాటల్లో చెప్పాలంటే, హిందూవాదులు పైకి దేశవిభజనను ఖండించినా మనసులో స్వాగతిం చారు. రాజ్ మోహన్ గాంధీ రచించిన ‘మోహన్ దా స్’, ‘వల్లభ్ భాయ్ పటేల్’ అనే రచనలను పరిశీలిస్తే యథార్థాలు బోధపడతాయి. ‘వల్లభ్ భాయ్ పటేల్’ (ఎమెస్కో ప్రచురించిన టంకశాల అశోక్ తెలుగు అనువాదం)లో ఇలా ఉంది: ‘‘సమస్యకు విభజన మినహా మధ్య వర్తిత్వాలో, ఉదారంగా వ్యవహరించ డమో పరిష్కారం కాదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన వల్లభ్ భాయ్, ఆ విషయమై ఇంకా బయటకు మాత్రం మాట్లాడలేదు... (అఖం డభారతానికి) భి న్నంగా ఏదైనా అపుడే మాట్లాడితే, అసమ్మతిదారుగా ఉండిన గాంధీ తిరుగుబాటుదారుగా మారవచ్చు. అందువల్లనే పంజాబ్‌కు సంబంధించిన పటేల్ తీర్మానం దేశవిభజనకు కూడా దారులు వేసింది గాని, ఆ రెండవ విభజన గురించి ఏ ప్రస్తావనా చేయలేదు’’. దేశవిభజన విషయంలో పటేల్ చాలారోజులు గుంభ నంగా ఉండిపోగా, మొదటిసారి దానిపై బహిరంగంగా మాట్లాడింది నెహ్రూ. ఆ తర్వాత కొన్ని రోజులకు పటేల్ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ, ‘‘ముస్లింలీగ్ విభజనను కోరుకున్నట్లయితే వారిపై కాంగ్రెస్ బల ప్రయోగం చేయబోదు. కానీ (దేశవిభజనకు పర్యవ సానంగా) బెంగాల్, పంజాబ్ కూడా విభజనకు గురవుతాయి’’ అంటాడు. కనుక పటేల్ దేశవిభజనను అంగీకరిం చడమే కాదు, దాని పర్యవసానమైన పంజాబ్ విభజ నకు స్వయంగా తీర్మానం ప్రతిపాదించాడని స్పష్టం.


అలాగే, హిందూమహాసభ నాయకుడైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశవిభజనలో భాగంగా బెంగాల్ విభజనను కోరుకోగా, ముస్లింలీగ్‌కు చెందిన నాటి బెంగాల్ ముఖ్యమంత్రి షాహిద్ సుహ్రావర్దీ అఖండ బెంగాల్‌ను కోరుకున్నాడన్న వాస్తవం ఇప్పుడు వినడానికి వింతగానే ఉంటుంది. ‘మోహన్ దాస్’ అనే రచ నలో రాజ్ మోహన్ గాంధీ ఇలా రాస్తారు: ‘‘సుహ్రావర్దీ, శరత్ చంద్రబోస్ (సుభాష్ చంద్రబోస్ అన్న) సహా బెంగాల్‌లోని ప్రముఖ రాజకీయవాదులు కొంతమంది సమైక్య, స్వతంత్ర బెంగాల్‌ను కోరుకుం టున్నారు. బెంగాల్‌లోని అనేకమంది కాంగ్రెస్ వాదు లు, హిందూమహాసభకు చెందిన శ్యామా ప్రసాద్ ముఖర్జీయే కాకబీ నెహ్రూ, పటేల్, వర్కింగ్ కమిటీ లోని ఇతర సభ్యులు ఆ ఆలోచనను తిరస్కరించారు. కానీ గాంధీ ఆ దిశగా ఒక ప్రయత్నం చేద్దామను కున్నాడు.’’ (ఎమెస్కో ప్రచురించిన కల్లూరి భాస్కరం తెలుగు అనువాదం). ఇదే పుస్తకంలో రచయిత ఇంకా ఇలా అంటారు: (గాంధీ బెంగాల్‌లో ఒక ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ) ‘‘కొంతమంది హిందూ జాతీయవాదులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పైకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, అతి పెద్ద ముస్లిం జనాభా భారతదేశంనుంచి వేరు పడుతున్నందుకు రహస్యం గా సంతోషిస్తున్న సంగతినీ తను గుర్తించినట్టు మా ట్లాడాడు: ‘‘ఈ సమావేశంలో ఉన్న హిందువులు భారత్ తమ దేశమనీ, ఇక్కడ హిందువులకు అత్యున్న త హోదా ఉంటుందని నొక్కి చెప్పదలచుకుంటే, దానర్థం కాంగ్రెస్ ఎలాంటి తప్పూ చేయలేదనే. మీరు రహస్యంగా కోరుకుంటున్నదే వర్కింగ్ కమిటీ చేసింది.’’


ఇక, ‘పటేల్ తొలి ప్రధాని అయుంటే కాశ్మీర్ సమస్య తలెత్తేది కా’దన్న ప్రధాని వ్యాఖ్యలోనూ ని జం లేదు. అసలు చారిత్రక పరిస్థితులు, పరిణామా లపై తగిన అధ్యయనం లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి ఉబుసుపోక వ్యాఖ్యలు చేయడమే విడ్డూరం. ఆయా కాలాలలోని పరిస్థితులు, పరిణామాలు, వాటి లో వ్యక్తుల పాత్రల మధ్య అన్యోన్య సంబంధం ఉం టుంది. అవి సొంత తర్కాన్ని అనుసరిస్తాయి. ఈ ము ప్పేట సంబంధం నుంచి వ్యక్తులను వేరుచేసి వారిపై తీర్పు చెప్పడం అశాస్త్రీయమవుతుంది. చేదునిజం ఏమిటంటే, భారత యూనియన్‌లో వందలాది సంస్థా నాల విలీనానికి ప్రధానబాధ్యుడైన పటేల్ అజెండాలో మొదట కాశ్మీర్ లేనేలేదు. ‘సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్’ పుస్తకం నుంచే ఉదహరించుకుంటే, గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్‌తో మాట్లాడుతూ దేశంలోని సంస్థానాలను ఆపిల్ పళ్లతో పోల్చిన పటేల్‌కు, ‘‘కాశ్మీ ర్ ఆపిల్ కూడా తనకు కావాలా అన్న ప్రశ్నపై స్పష్టత లేదు...కాశ్మీర్ విలీనానికి ఏ చర్యలూ తీసుకోని వల్లభ్ భాయ్, కనీసం యథాతథస్థితి ఒప్పందానికి కూడా అంగీకరించలేదు.’’ గాంధీ, నెహ్రూలు భారత్‌లో కాశ్మీర్ విలీనాన్ని కోరుకుంటుండగా పటేల్ మాత్రం కాశ్మీర్ పాకిస్థాన్‌లో విలీనమైనా తనకు అభ్యంతరం లేనట్టు మాట్లాడడం మరింత విస్తుగొలుపుతుంది. ‘‘ఒకవేళ పాకిస్థాన్‌తో విలీనంలోనే తమ రాష్ట్రప్రయో జనాలున్నట్లు అక్కడి పాలకుడు భావించినట్లయితే నేనందుకు అడ్డురాబో’’నని పటేల్ అంటాడు. కాశ్మీర్ పై పటేల్ ఉపేక్షాభావం 1947 సెప్టెంబర్ 13 వరకూ కొనసాగింది. ఆ రోజున కూడా రక్షణమంత్రి బల్ దేవ్ సింగ్‌కు లేఖ రాస్తూ, ‘‘ఒకవేళ (కాశ్మీర్) వేరే డొమినియన్‌లో చేరదలచుకుంటే’’ ఆ వాస్తవికస్థితిని తాను గుర్తించగలనని అంటాడు. హిందువులు అధిక సంఖ్యలో ఉన్న జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో కలుపు కోడానికి జిన్నా సిద్ధమైన తర్వాతే, కాశ్మీర్ పట్ల పటేల్ వైఖరి మారింది. దేశవిభజనకు దారితీసిన ఆనాటి అసాధారణ పరిస్థితులను, ఒత్తిడులను దృష్టిలో ఉం చుకోకుండా ఈనాటి హిందుత్వవర్గాల కొలమానంతో చూస్తే, కాశ్మీర్ పాకిస్తాన్‌లో కలసినా అభ్యంతరం లేదన్న పటేల్ దేశద్రోహి అయుండేవాడు. చారిత్రక ఘటనలపై అనాలోచితంగా తీర్పు చెప్పబోతే పర్యవ సానాలు ఇలాగే ఉంటాయి.  
‘‘పదిహేను కాంగ్రెస్ కమిటీలు పటేల్ నాయ కత్వాన్ని కోరుకున్నప్పటికీ నెహ్రూను ప్రధానిని చేశా’రన్న మోడీ విమర్శలో కూడా అసత్యం పాలే ఎక్కువ. నెహ్రూ-పటేల్ మధ్య స్పష్టమైన పని విభ జన ఉండేది. ఎక్కువ జనాకర్షణ ఉన్న నెహ్రూ ఎన్నిక ల సారథ్యం వహిస్తే, పటేల్ సంస్థాగత వ్యవహారాలకే పరిమితమయ్యేవాడు. కనుక పార్టీలో పటేల్‌కే  మద ్దతు ఉండేది. అయినా సరే, ఆయన గాంధీ మాటకు  కట్టుబడి పార్టీ అధ్యక్షపదవిని నెహ్రూకు విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. నెహ్రూకు, తనకు మధ్య ఈ అసమస్థితితో పటేల్ ఎప్పుడో సమాధానపడ్డాడు. ఇందుకు తన వయసు, అనారోగ్యం వంటి కారణాలు కూడా తోడయ్యాయి. నెహ్రూ కన్నా తను పద్నాలు గేళ్లు పెద్దే కాక, 1947కు ముందే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కనుక తను ప్రభుత్వాధినేత కావాలని ఆయన కోరుకోలేదు సరికదా, నెహ్రూ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాడు కూడా. ‘వల్లభ్ భాయ్ పటేల్’ గ్రంథం నుంచి ఉదహరించుకుంటే తనతో చెప్పకుండా కాశ్మీర్ వ్యవహారాలలో గోపాలస్వామి అయ్యంగార్‌కు నెహ్రూ పాత్ర కల్పించినందుకు పటేల్ రాజీనామాకు సిద్ధపడడం, దాంతో తనే రాజీనామా రాజీనామా చేస్తానని నెహ్రూ అనడం సంభవించాయి. అప్పుడు పటేల్ ఇచ్చిన సమాధానం నాయకత్వం పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తుంది: ‘‘ఎవరైనా నిష్ర్కమించవలసివస్తే అది నేనే కావాలి. క్రియాశీలంగా పనిచేసే దశను నేను ఎప్పుడో దాటిపోయాను. ప్రధానమంత్రిని ఈ దేశనాయకునిగా అందరూ గుర్తి స్తున్నారు. తను చిన్నవాడు కూడా. నన్ను ఎంచుకోవా లా లేక తననా అనే ప్రశ్న ఉత్పన్నమైతే ఆ సమాధానం తనకే అనుకూలంగా ఉండాలనటంలో సందేహం లేదు. కనుక, ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదు.’’


నెహ్రూ-పటేల్ మధ్య విభేదాలు జగమెరిగినవే కానీ, అవి నాయకత్వస్పర్థకు సంబంధించినవి మాత్రం కావు. గాంధీ మరణం తర్వాత అవి కూడా సద్దుమణిగి, పటేల్ మరణించేవరకూ ఇరువురి మధ్య వెనకటి కన్నా ఎక్కువ సుహృద్భావం వెల్లివిరిసింది. రాజ్యాంగసభలో పటేల్ ప్రసంగిస్తూ మొదటిసారి నెహ్రూను ‘నా నాయకు’డని సంబోధించడమే కాదు, ఇంకా ఇలా అంటాడు: ‘‘జాతీయ వ్యవహారాలన్నింటి విషయంలో నేను ప్రధానమంత్రితో నిలుస్తాను. పాతిక సంవత్సరాలకు పైగా మేమిద్దరం మా గురువు పాదాల వద్ద కూర్చుని, భారతదేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించాము. మహాత్ముడు లేని ఈ రోజున మేమిద్దరము కలహించుకోవటం ఆలోచనలకే అతీతమైన విషయం.’’ కనుక, నెహ్రూ-పటేల్ మధ్య ఉన్న సుహృద్ సంబంధాలను మరుగుపుచ్చి, విభేదాలను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ ఇరువురి మధ్యా అగాధం ఉన్నట్టు చిత్రించడం చరిత్రపట్ల విజ్ఞతను ప్రతిబింబించదు. ప్రధాని చివరి వ్యాఖ్యకు వస్తే, తొలి ప్రధానిగా ప్రజాస్వామిక విధివిధానాలకు నెహ్రూ చేసిన దోహ దాన్ని తక్కువ చేయడానికి వేల ఏళ్లనాటి గణరాజ్యా లను ప్రస్తావించడంలో కూడా చారిత్రక స్పృహ లోపించింది. గణరాజ్యాల నాటి ప్రజాస్వామ్యానికి, ఆధునిక ప్రజాస్వామ్యానికి మధ్య ఏకవ్యక్తి కేంద్రిత రాచరికదశ ఒకటి ఉందనీ, ఆధునికకాలంలో తిరిగి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యాన్నే మనం అంది పుచ్చుకున్నామనే సంగతిని ప్రధాని విస్మరించారు. తక్షణ రాజకీయప్రయోజనాలకోసం చరిత్రకు మసి పూయడం చరిత్రకు చేస్తున్న నష్టం అయితే, తగినంత అధ్యయనం లేకుండా చరిత్రలోకి తలదూర్చి ఆక్షేపణలకు తావివ్వడం ప్రధాని వ్యక్తిగతంగా తనకు తాను చేసుకుంటున్న నష్టం.
- కల్లూరి భాస్కరం 

English Title
What is the history of Patel?
Related News