మహిళలు వర్సెస్ మహిళలు

Updated By ManamThu, 10/18/2018 - 04:53
sabarimala
  • పలుచోట్ల మహిళాభక్తుల అడ్డగింత.. వారిని అడ్డుకున్నదీ మహిళలే..!

  • వెనుదిరిగిన ఏపీ.. కేరళ భక్తురాళ్లు.. తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు

  • సాయంత్రం తెరుచుకున్న ఆలయం.. పోలీసుల అదుపులో నిరసనకారులు

  • టీవీఛానళ్ల మహిళా రిపోర్టర్లపై దాడులు.. ఇవన్నీ రాజకీయాలే: కేరళ మంత్రి

sabarimalaతిరువనంతపురం:  నెలవారీ పూజల కోసం శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తెరుచుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత రాజ్యవేులింది. కొంతమంది మహిళలు సుప్రీంకోర్టు తీర్పు అండతో ఆలయానికి రావడానికి ప్రయత్నించడం, మిగిలినవారు వారిని అడ్డుకుని తిప్పి పంపేయడంతో పాటు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పంబ వద్ద పోలీసులు 21 మంది భక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వెయ్యిమంది పోలీసులు ఆలయం పరిసరాల్లో భద్రతా ఏర్పా ట్లు చూశారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెరుచుకున్న ఆలయం.. ఈనెల 22వ తేదీన మళ్లీ మూతపడుతుంది. ఈ ఐదు రోజుల పాటు అయ్యప్పకు నెలవారీ పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఎలాగైనా అయ్యప్పను దర్శించుకుని పూజలు చేయాలని కొంతమంది 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రయత్నించగా, మిగిలిన వయసు మహిళా భక్తులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇది రెండు వయోవర్గాల మహిళల మధ్య పోరాటంలా కనిపించింది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి అనే భక్తురాలు కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. నిరసనకారులు అడ్డుకోవడంతో ఆమె తన కుటుంబ సభ్యులను వదిలి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని వందల మీటర్ల వరకు పోలీసులు రక్షణగా వచ్చారు గానీ, తర్వాత ఆలయం సమీపించేకొద్దీ తమ ఖర్మకు వదిలేశారని ఆమె తెలిపారు. నిరసనకారులను చూసి ఆమె వద్ద ఉన్న పిల్లలు ఏడవడంతో, ఇక తాను వెనుదిరగక తప్పలేదని మాధవి చెప్పారు. అలాగే, కేరళకు చెందిన లిబీ సిఎస్ అనే మహిళా జర్నలిస్టు ముందుగానే తాను శబరిమలకు వెళ్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన నిరసనకారులు.. ముందే ఆమెను అడ్డుకోవాలని నిర్ణయించి, ఆలయం వైపు నడుస్తుండగా ఆపేశారు. శబరిమలకు 4.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబా నది వద్దే కొంతమంది నిరసనకారులు ఆమెను చుట్టుముట్టగా, వారి బారి నుంచి పోలీసులు ఆమెను రక్షించి ముందుకు పంపారు. కానీ, బేస్ క్యాంపు వద్ద ఆమె వస్తున్న బస్సులోకి వెళ్లిన భక్తులు.. అయ్యప్ప మంత్రం జపిస్తూ, శతాబ్దాలుగా ఉన్న ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించవద్దని కోరారు. 

  అయితే తాను గుడిమెట్లు ఎక్కాలని, సుప్రీంకోర్టు తనకు కల్పించిన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని లిబీ వాదించారు. దాంతో అప్పటివరకు శాంతంగా ఉన్న భక్తులు.. ఆమెను దించకపోతే బస్సును తగలబెట్టేస్తామని బెదిరించడంతో ఆమె దిగక తప్పలేదు. శబరిమలకు వెళ్లడానికి ప్రధాన మార్గమైన నెలక్కల్ వద్ద వందలాది మంది నిరసనకారులు గుమిగూడారు. అక్కడే వారు 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను అడ్డుకోసాగారు. చాలామంది మహిళా భక్తులు కూడా అక్కడ వారితో పాటు ఉన్నారు. ఫైర్‌బ్రాండ్ హిందూ నాయకురాలు కేపీ శశికళ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా నెలక్కల్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజామున కొన్ని బస్సులను ఆపడానికి ప్రయత్నిస్తున్న భక్తులను పోలీసులు చెదరగొట్టారు. భక్తులను పైకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ఏ ఒక్కరినీ తాము అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. ట్రావన్‌కూర్ దేవస్వోం బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రయర్ గోపాలకృష్ణన్ సహా 50 మందిని పోలీసులు నెలక్కల్, పంబా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన పూజారి కుటుంబ సభ్యులతో పాటు పాండలం రాజకుటుంబ వారసులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, వెంటనే అక్కడకు కొందరు బీజేపీ నేతలు చేరుకుని అయ్యప్ప నామజపం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు కె. సురేంద్రన్, ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్ తదితరులు కూడా నిరసన వ్యక్తం చేసినవారిలో ఉన్నారు. అయ్యప్ప భక్తులకు సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. సుధాకరన్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి నెలక్కల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై పట్టనంతిట్టలోని జిల్లా ప్రధాన కార్యాలయంలో నిరాహార దీక్ష చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క. సుధాకరన్ నెలక్కల్ వద్ద తమ పార్టీ కార్యకర్తలకు నేతృత్వం వహించారు. ఒకవైపు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా, పంబా నదికి సమీపంలో తమిళనాడుకు చెందని 40, 45 ఏళ్ల జంటను కేఎస్‌ఆర్టీసీ బస్సు నుంచి శబరిమల ఆచార సంరక్షణ సమితికి చెందిన కొందరు దింపేశారు. తాము పంబా వరకే వెళ్తున్నాం తప్ప శబరిమలకు కాదని వారు చెప్పినా, ముందుకు వెళ్లనివ్వలేదు. తర్వాత పోలీసులు వారిని సురక్షితంగా తీసుకెళ్లారు. 

మహిళా రిపోర్టర్లపై దాడులు
వివిధ టీవీ చానళ్లకు చెందిన మహిళా రిపోర్టర్లకు కూడా ఆటంకాలు తప్పలేదు. కొంతమంది ముసుగులు ధరించి, చేత ఆయుధాలు పట్టుకుని మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. రిపబ్లిక్ టీవీకి చెందిన పూజా ప్రసన్నపై కర్రలతో దాడి చేయగా, న్యూస్ మినిట్‌కు చెందిన సరితా ఎస్ బాలన్‌ను వెన్ను మీద తన్నారు. ఓ మహిళా భక్తురాలు ఆమె మీద నీళ్ల బాటిల్ విసిరేసందుకు ప్రయత్నించారు. ఎన్డీటీవీ సిబ్బందిని ప్రత్యక్ష ప్రసారం చేయనివ్వకుండా అడ్డుకున్నారు. రిపోర్టర్ స్నేహా మేరే కోషీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సీఎన్‌ఎన్-న్యూస్ 18, ఆజ్‌తక్ తదితర చానళ్ల సిబ్బందికీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దాదాపు వంద మందితో కూడిన గుంపు తమ చానల్‌కు చెందిన కారును ధ్వంసం చేసి, దక్షిణాది బ్యూరోచీఫ్ పూజా ప్రసన్నపై దాడి చేశారని రిపబ్లిక్ టీవీ తెలిపింది. 

అన్నీ రాజకీయ ప్రేరేపితమే: మంత్రి
నిరసనల పట్ల కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిరసనలన్నీ రాజకీయ ప్రేరేపితవేునని రాష్ట్ర ఆధ్యాత్మిక ట్రస్టుల శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మండిపడ్డారు. నవంబరు 17 నుంచి మూడు నెలల పాటు సాగే మండలం-మకరవిలక్కు ఉత్సవ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నాయని, వారి ఎజెండా తమకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.

English Title
Women vs. Women
Related News