ప్రపంచం చూపు భారత్‌వైపు

Updated By ManamSun, 09/09/2018 - 22:38
venkaiah-naidu
  • మోదీ నేతృత్వంలో పురోభివృద్ధిలో దేశం.. షికాగోలో తెలుగువారితో ఉప రాష్ట్రపతి వెంకయ్య

venkaiah-naiduషికాగో: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని కొనియాడారు. ప్రపంచ హిందూ కాంగ్రెస్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన షికాగోలో తెలుగు వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  సందర్బంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉన్నా యని, కానీ అందుకు విరుద్ధంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)లు కూడా భారత్ వృద్ధి రేటుపై సానుకూల నివేదికలు వెలువరుస్తున్నాయని చెప్పారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను 35-40 మంది రాయబారులు కలిశారని, వారందరూ కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపించారని చెప్పారు. విదేశాల్లోని తెలుగువారు కూడా భారత పురోభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశానికి వందల మంది తెలుగువారు హాజరయ్యారు.

వారు జాతీయవాదులు కాదు..
మూక దాడుల్లో పాల్గొనేవారు, విద్వేశాన్ని రెచ్చగొట్టేవారు జాతీయవాదులు కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లేముందు పీటీఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. మూక దాడుల ఘటనలను రాజకీయం చేయొద్దని, ఈ ఘటనలను కొన్ని రాజకీయపార్టీలకు అంటగట్టడం విచారకరమని అన్నారు. ‘‘సమాజం వైఖరిలో మార్పు రావాల్సి ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ వల్ల ఈ ఘటనలు చోటు చేసుకోవడం లేదు. దాడుల ఘటనను ఒక పార్టీకి అంటగడితే.. ఆ దాడుల సమస్య తీవ్రత తగ్గిపోతుంది. అలా జరగకూడదు’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

హిందూ కాంగ్రెస్‌లో ‘ఐక్యత లడ్డూలు’
అమెరికాలోని షికాగోలో జరుగుతన్న ‘ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్‌సీ) సమావేశాలకు హాజరైన ప్రతినిధులకు నిర్వాహకులు అనూహ్యమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ప్రతినిధులకు గిఫ్ట్‌బాక్స్ కింద అందించిన లడ్డూలకు ఐక్యత లడ్డూలు అని పేరు పెట్టారు. ఆ బాక్స్‌లో రెండు లడ్డూలు ఉండగా.. ఒక దానికి ‘మృదువైన’ లడ్డూ, రెండో దానిని ‘కఠినమైన’ లడ్డూ అని పేరు పెట్టారు. హిందువులు ఐక్యంగా ఉంటూనే.. అవసరమైన సందర్భంలో మృదువుగా, కఠినంగా ఉండాలని సూచిస్తూ వాటికి ఆ పేర్లు పెట్టామని నిర్వాహకులు తెలిపారు.  అలాగే.. హిందువులు ఐక్యంగా లేరనే విషయాన్ని కూడా పరోక్షంగా గుర్తు చేస్తూ దాని అవసరాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేశామని చెప్పారు. ‘మృదువైన లడ్డూను తొందరగా చితక్కొట్టి తినవచ్చు. కానీ..హిందువులు భవిష్యత్తులో గట్టి లడ్డూలా ఉండాలి. దానిని విడదీని తినడం చాలా కష్టం. ఆ ఉద్దేశంతోనే వినూత్న తరహాలో లడ్డూలను పంచాం’ అని నిర్వాహకులు తెలిపారు. 

English Title
The world is towards India
Related News