స్వరాష్ట్రంలోనూ తప్పని తిప్పలు

Updated By ManamFri, 02/09/2018 - 01:38
photo

photoఅది కార్మికశాఖ కార్యాలయం. తమ గోడును చెప్పుకోవడానికి   కార్మికులు అక్కడకు వస్తుంటారు. వారంతా  వివిధ సంస్థలలో, ఖార్కానాలలో, షాపులలో, వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేసే వర్కర్లు. వివిధ ఏజెన్సీల ఆధినంలో ఆసుపత్రులు, హాస్టల్స్‌లలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. యాజమాన్యాల పరిధిలో పని చేసే వర్కర్లు, భవంతులు, వివిధ నిర్మాణాలలో పని చేసే నిర్మాణ కార్మికులు. సమస్యలు వచ్చినప్పుడు, ఏజెన్సీలతో, యాజ మాన్యాలతో వివాదాలు తలెత్తినప్పుడు, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు అందనప్పుడు కార్మికశాఖను ఆశ్రయిస్తుంటారు.  గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఓరుగల్లుకు పెద్ద పరిశ్రమగా పేరొందిన కమలాపూర్ పేపర్ (బిల్డ్) పరిశ్రమ మూతబడింది. వందలాది మంది వర్కర్లు రోడ్డునపడ్డారు. ఉపాధి లేదు. కుటుంబ పోషణ భారమైంది. ఉపాధి కోసం పరిశ్రమలను తెరిపించి సమస్యలు పరిష్కరించాలని వారి వేడుకోలు. ఇదే పరిశ్రమకు చెందిన ఓ కార్మికుడు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వాధినేతలు, కార్మికశాఖ  కార్మికుల గోస చూసి మొసలికన్నీరు గార్చింది. కానీ ఫలితం మాత్రం సున్నా. ఇక వివిధ ప్రాంతాలలో, సంస్థలలో ఏజెన్సీల ఆధీనంలో పని చేసే వర్కర్ల స్థితి మరీ అధ్వానం. నిర్మాణ కార్మికులకు ఉన్న అనుకూల చట్టాలు సైతం నిరుపయోగంగానే మారుతున్న పరిస్థితి. ఇలాంటి వర్కర్లు తమ గోడు వినడానికి అధికారులు ఎవరూ  లేకపోవడంతో కార్మికశాఖ కార్యాలయానికి వచ్చిన వర్కర్లు నిత్యం కార్మికశాఖ కార్యాలయం చుట్టుపక్కల కనిపిస్తుంటారు. ఓ ఇద్దరు బాధిత కార్మికులు...
‘‘ఏంటన్నా ఈ పరిస్థితి’’ అన్నాడో కార్మికుడు. ‘‘ఓ కథ చెప్తా వింటావా..? స్వామి’’ అన్నాడు మరో కార్మికుడు. ‘వినకుంటే ఏం చేస్తా.. ఎలాగో మన కథ ప్రభుత్వం గానీ, ప్రభుత్వాధికారులుగానీ వినట్లేదు...’’ ‘ఇంతకీ ఆ కథ ఏంటన్నా’ అన్నాడు. ఆ బాధిత కార్మికుల కథ సంభాషణ ఈ విధంగా మొదలైంది....
‘‘ఓ పూజారి.. తండ్రి చనిపోతే హస్తికలు గంగలో కలుపేందుకు కాశీకి బయలు దేరుతాడు. కాలి నడక కదా? మార్గ మధ్యలో బస చేసేందుకు  ఓ ఇంటిని ఆశ్రయించాడు. ఆ ఇల్లు కుమ్మరి వారిది. తన ప్రయాణ వివరాలు వివరించి ఈ రాత్రికి చోటివ్వమని కోరతాడు. ఆ కుమ్మరి పూజారికి చోటిస్తాడు. కుండలు తయా రు చేసుకొని బతికే వృత్తి కదా? ఆ కుండల పక్కనే పడుకోవడానికి మాత్రమే చోటుంది. సరే అనుకున్న పూజారి నిద్రకు ఉపక్రమి స్తాడు. నిద్రలోకి జారుకుం టూనే కళలు కంటున్నాడు. రేపు తను చేయాల్సిన పను లను మననం చేసుకో సాగాడు. పొద్దునే లేచి కాశీకి చేరుకోవాలి. తన కార్యక్ర మాలన్నీ ముగించుకోని తిరగి మా ఊరు చేరాలి. తన తండ్రి ఇచ్చిన ఆస్తిలోంచి ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి. ఓ పాడి గేదను కొనాలి. ఓ పాలేరును కూడా పెట్టుకోవాలి. దర్జాగా బతకాలి. కలిసోస్తే మంచి పెండ్లాన్ని చేసుకోవాలి. హాయిగా బతకాలనే కలలు కనసాగాడు పూజారి..’’ అలా చెప్పుకొస్తుండగా,  ‘‘ అన్ని బాగానే  ఉన్నాయి కదా! అన్నా ... ఏంటి సంగతి?’’ అన్నాడు అప్పటి వరకూ ఆసక్తిగా కథ విన్న కార్మికుడు. ‘ఇందులో ఏముంది స్వామీ ముందుంది ముసుర్ల పండుగా..’ అంటూ మిగిలిన కథను కొనసాగించాడు. ‘కలలో సుందరమైన జీవితాన్ని ఊహించుకున్న పూజారి తన అందమైన పెండ్లాం అన్నీ ఉన్న తరువాత కూడా ఏమైనా నా మాట వినకుంటే నా కాలితో ఈ..లా.. లాగి.. తన్నాలి..’’ అని కల కన్నాడు. కలలో తన భార్యను తన్నిన తన్నుకు కుమ్మరి ఇంటి యజమాని శ్రమించి తయారు చేసుకున్న కుండలన్నీ పగిలిపోయాయి. పూజారి కల చెదిరింది. నిద్ర వదిలింది. పూజారికి, కుమ్మరికి తగాద ఏర్పడింది. ఎట్టకేలకు కుమ్మరికి, పూజా రికి రెంటికీ చెడ్డ చందంగా పరిస్థితి మారింది’’ అంటూ ‘‘ఇంతకీ కథలోని నీతి అర్ధమైందా.. స్వామి..’’ అన్నాడు. ‘‘ఎందుకు అర్ధం కాలేదన్నా...! కథలోని పూజారి లాగ మారింది మన పరిస్థితి’’ అన్నాడు అప్పటిదాక ఆసక్తిగా కథ విన్న కార్మికుడు.

 ‘‘తెలంగాణోస్తే అన్నీ మారు తాయి. మన జీవితాలు బాగు పడ్తాయి. కొత్త పరిశ్రమలొస్తా యి. మన పిల్లలందరికీ  ఉద్యోగ,  ఉపాధి అవకాశాలు బోలేడు అనుకున్నాం. కలలు కన్నాం. కానీ మన కలలు కూడా కథలోని పూజారి కల’’గానే  ఉన్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడినా కొత్త పరిశ్రమలు మాటలతోనే నిర్మితవువుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. ఉన్న పరిశ్రమలు సైతం మూలనపడుతున్నాయి. మూత పడిన పరిశ్రమలను తెరిపించడానికి, రోడ్డున పడ్డ మనలాంటి కార్మికులను ఆదుకోవడానికి దిక్కు లేకుండా పోయింది. కార్మిక చట్టాల అమలు సైతం మూలనపడింది. ఏజెన్సీల ఆధీనంలో ఏండ్ల తరబడి పని చేసే వారిని ఏజెన్సీ కాంట్రాక్టర్లు అడ్డగోలుగా తొలగిస్తున్నా కనీసం చెప్పుకుం దామన్నా వినే నాధుడే లేడు’’ అంటూ నిట్టూర్చాడు అప్పటి దాకా కథ విన్న కార్మికుడు. ‘‘తెలంగాణ ప్రభుత్వంలో కూడా మన బతుకులు మారడానికి పోరాటాలు తప్పవన్నా’’ అనుకుంటూ ఆ ఇద్దరు కార్మికులు ముందుకు సాగారు. ఈ స్థితి తెలంగాణలోని  కార్మికుల జీవితాలకు దర్పణం. వీరిది మాత్రమే కాదు. తెలంగాణ ప్రభుత్వం మీద  ఆశలు పెట్టుకున్న, కలలు కన్న అనేక ఉద్యోగ కార్మికుల వాస్తవ స్థితి. సామాన్యుల దుస్థితి. మరి ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ వీరిని ఏ ధరికి చేరుస్తాడో..  వేచి చేడాల్సిందే! ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పనలో తీవ్ర అలసత్వం సాగుతోంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు. కార్మిక చట్టాలు అమలు కాక కార్మిక వర్గం ఆందోళనలు తప్పవనే స్థితికి నెట్టబడుతున్నారు. ప్రభుత్వ పాలనా లోపాలను ప్రశ్నించినా పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. హక్కులు అడిగితే అహంకారపూరితంగా పాలకులు వ్యవహరించడం రాష్ట్రంలో అనేక ఉదాహరణలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సభలు, సమావేశాలు, నిరసనలు తెలిపే హక్కుకు భంగం కలిగించడం సర్వసాధరణంగా మారింది. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రం, స్వపరిపాలకుల పాలనలోనూ ఆందోళనలు, పోరాటాలు అనివార్యంగా ముందుకొస్తున్నాయి. ఇప్పటికే వివిధ వర్గాలు ఆందోళనలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఉద్యమాలు తీవ్రతరం కావడం ఖాయమని గమనించాలి.

                     - రాజేందర్ దామెర
                       8096202751 

English Title
Wrong in the state
Related News