అమెరికానే ‘అభివృద్ధి చెందుతున్న దేశం’

Updated By ManamSat, 09/08/2018 - 22:30
trump
  • భారత్, చైనాలకు సబ్సిడీలను నిలిపేస్తాం

  • ఆ రెండు దేశాలు వేగంగా పురోగమిస్తున్నాయి

  • విరాళాల సేకరణ సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

trumpషికాగో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. భారత్, చైనాలకు తమ దేశం అందిస్తున్న సబ్సిడీలను నిలిపివేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ‘అభివృద్ధి చెందుతున్న దేశమని’, కాబట్టి అది ఇతరుల కన్నా ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. ఉత్తర డకోటాలోని ఫార్గో నగరంలో  నిర్వహించిన పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్ని దేశాలను మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా పరిగణిస్తున్నాం. కొన్ని దేశాలు ఇంకా ఎలాంటి పరిణతి సాధించలేదు. అలాంటి దేశాలకు మనం సబ్సిడీలు అందిస్తున్నాం. ఇదంతా గమ్మత్తయిన అంశం. ఈ జాబితాలో ఇండియా, చైనా కూడా ఉన్నాయి. కానీ అవి పురోభివృద్ధిలో ఉన్నాయి. ఆ దేశాలు తమంతతాముగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పిలుపుచుకుంటాయి. ఈ కేటగిరీలో అవి సబ్సిడీలు పొందుతున్నాయి. మన డబ్బును వాటికి చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా గమ్మత్తయిన వ్యవహారం. దీనిని  మేం ఆపేస్తాం. దీనిని ఆపేయాల్సిందే. వాస్తవానికి అమెరికానే అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ కేటగిరీలోనే అమెరికాను చేర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే.. మనం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇతరులకన్నా అత్యంత వేగంగా పురోభివృద్ధిలో పయణించాల్సి ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మరింత దారుణంగా తయారైందని, అందులోని వ్యక్తులు చైనాకు అనుకూలంగా ఉన్నారని అన్నారు. చైనా ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అనుమతి ఇస్తున్నారనే విషయాన్ని డబ్ల్యూటీవోలోని కొందరు వ్యక్తులకు తెలియనే తెలియదని అన్నారు. తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు  పెద్ద అభిమానినని, అయినా వాణిజ్యంలో పారదర్శకంగా వ్యవహరించాలని  ఆయనకు సూచించానని అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు. కొన్ని ధనిక దేశాలకు అమెరికా రక్షణగా ఉంటోందని, కాబట్టి ఆ దేశాలు అమెరికాకు ఎంతోకొంత మొత్తం చెల్లింపులు చేయాల్సిందేనని అన్నారు. ఈ అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. 

English Title
America's 'developing country'
Related News