సహనశీలత హిందూత్వ లక్షణం

Updated By ManamMon, 09/10/2018 - 22:32
venkaiah
  • ఆ పదాన్ని అస్పృశ్యతగా మార్చే ప్రయత్నం

  • హిందూత్వ విలువలను రక్షించాలి

  • మాతృభాష.. సంస్కృతిని కాపాడుకోవాలి

  • ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • ప్రపంచ హిందూ మహాసభల ముగింపు

venkaiah-naiduషికాగో: ‘హిందూ’ అనే పదాన్ని ‘అస్పృశ్యం’గా, ‘సహించలేనిది’గా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి దురభిప్రాయాలను దూరం చేయాలంటే స్వామి వివేకానంద లాంటివాళ్లు నేర్పిన నిజమైన హిందూత్వ విలువలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న రెండో ప్రపంచ హిందూ మహాసభల ముగింపు సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారతదేశం విశ్వజనీన సహనశీలతను నమ్మిందని, అన్ని మతాలను ఆమోదించిందని ఆయన చెప్పారు. మొత్తం 60 దేశాల నుంచి 250 మంది వక్తలతో పాటు 2500 మంది ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. స్వామి వివేకానంద 1893లో ఇదే నగరంలో చేసిన చారిత్రక ఉపన్యాసం 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్రపంచ హిందూ మహాసభలను నిర్వహించారు. పంచుకోవడం, సంరక్షించడం (షేర్ అండ్ కేర్) అనేవి హిందూ తత్వంలోని మూలసూత్రాలని వెంకయ్యనాయుడు చెప్పారు. హిందూమతం గురించి బోలెడంత తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని అన్నారు. అసలైన దృక్కోణం ఏమిటన్నది తెలిస్తే అప్పుడు ఇలాంటి తప్పుడు సమాచారాలు ప్రచారం కాకుండా ఉంటాయని, తప్పుడు అభిప్రాయాలు కూడా దూరం అవుతాయని ఆయన అన్నారు. సమాజంలోకి కొన్ని బలహీనతలు చొచ్చుకొచ్చాయని, వీటిని  సంస్కర్తలే దూరం చేయాలని సూచించారు. ఇతరుల అనుభవాల గురించి కూడా తెలుసుకుని, వాళ్ల తత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలని వెంకయ్య నాయుడు తెలిపారు. భారతీయ సంస్కృతి, మతం ఇతర వర్గాలలోని సుగుణాలను తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాయని గుర్తుచేశారు. ప్రపంచమంతా వసుధైక కుటుంబం అన్న భావన హిందూ మతంలోనే ఉందని, అలాగే ప్రపంచంలోని సజీవ, నిర్జీవ పదార్థాలన్నింటిలో భగవంతుడు ఉన్నాడని చెబుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతుందని ఆయన తెలిపారు. ప్రకృతితో కలిసిమెలిసి ఎలా బతకాలో కూడా హిందూమతం చెబుతుందన్నారు. ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని కాపాడుకోవడమే అసలైన జాతీయత అని ఉప రాష్ట్రపతి వివరించారు. మహిళలను గౌరవించడం, వారికి సాధికారత కల్పించడం హిందూమతంలోని మరో కీలకాంశమని వెంకయ్యనాయుడు చెప్పారు. 

1893 సెప్టెంబరు 11వ తేదీన స్వామి వివేకానంద షికాగోలో తన ప్రసంగంలో చెప్పినట్లుగా.. భారతదేశం ఈ ప్రపంచానికే సహనం, విశ్వ ఆమోదాలను నేర్పించిందని అన్నారు. విజ్ఞాన మాధుర్యాన్ని ఈ ప్రపంచానికి అందించగలిగినది భారతదేశమేనని తెలిపారు. భారతీయులుగా మనమంతా నేర్చుకున్న విలువలు.. మన వ్యక్తిగత అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలుస్తాయని, దాంతోపాటు సమష్టి పురోగతికి ఉపయోగపడతాయని అన్నారు. ప్రకృతి వనరులు, పర్యావరణాన్ని కాపాడే విలువలు కూడా ఉన్నాయన్నారు. మరింత భరణీయ విశ్వాన్ని సృష్టించడానికి సహాయపడతామని తెలిపారు. ఒకప్పుడు భారతదేశానికి ‘విశ్వగురువు’గా పేరుండేదని గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేనన్ని మార్పులకు గురవుతున్న ప్రపంచంలో మనకు ఒక మంచి చుక్కాని, ఆధ్యాత్మిక దిక్సూచి కావాలని.. వాటిని భారతదేశం ఈ ప్రపంచానికి ఇవ్వగలదని చెప్పారు. చేదుతో నిండిపోయిన ఈ ప్రపంచానికి భారతదేశం వివిధ పుష్పాల నుంచి వేర్వేరు తేనెటీగలు సేకరించిన విజ్ఞాన మాధుర్యాన్ని అందించగలదని విశ్లేషించారు. ఈ ప్రపంచం ఎప్పుడు సంఘర్షణలకులోనైనా, ముక్కలు చెక్కలవుతుందన్న భయాలు తలెత్తినా, విద్వేషం, నిర్హేతుకమైన పక్షపాతాలకు లోనైనా భారతదేశమే ఈ ప్రపంచానికి లేపనం పూస్తుందని, రెండు వేల ఏళ్లకు పైగా తన సాంస్కృతిక ప్రపంచపు పరిమళాలను అందిస్తోందని వెంకయ్య నాయుడు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ‘ప్రపంచ హిందూ మహాసభలు’ అంటున్నారని, కానీ అసలు హిందూయిజం అంటే ఏంటని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లుగా హిందూమతాన్ని నిర్వచించడం అసాధ్యం కాకపోయినా, చాలా కష్టమేనని, దాన్ని తగినంతగా వివరించడం కూడా కష్టమేనని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఇతర మతాల్లా కాకుండా.. హిందూ మతం ఏ ప్రవక్తనూ నమ్మదని, ఏ ఒక్క దేవుడినీ పూజించదని, ఎవరో ఒకరికి సాగిలబడదని, ఏదో ఒక తత్వాన్ని మాత్రమే నమ్మదని, ఒకే రకమైన మతాచారాలు, కార్యక్రమాలను అమలుచేయదని అన్నారు.  ప్రపంచంలోని ఏ మతం.. ఏ తెగకు సంబంధించిన సంకుచిత సంప్రదాయాలతో అది సంతృప్తి చెందదని స్పష్టం చేశారు. అది ఒక జీవన మార్గమని మాత్రమే చెప్పగలం తప్ప మరేమీ కాదని రాధాకృష్ణన్ చెప్పిన అంశాలను వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిందువులు ప్రతి మతాన్నీ స్వాగతిస్తారని అన్నారు. సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను, తమ సంస్కృతిని కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. మాతృభాషను మరువద్దని పిలుపునిచ్చారు. తదుపరి ప్రపంచ హిందూ మహాసభలు 2022 నవంబరులో బ్యాంకాక్‌లో జరుగుతాయి. సభ ముగింపు సందర్భంగా చేసిన ప్రకటనలో, 2018 సెప్టెంబరు 11వ తేదీని ‘స్వామి వివేకానంద డే’గా ఇల్లినాయిస్ గవర్నర్ ప్రకటించారు. 

English Title
Endurance is a Hindutva trait
Related News