venkaiah naidu

సహనశీలత హిందూత్వ లక్షణం

Updated By ManamMon, 09/10/2018 - 22:32
 • ఆ పదాన్ని అస్పృశ్యతగా మార్చే ప్రయత్నం

 • హిందూత్వ విలువలను రక్షించాలి

 • మాతృభాష.. సంస్కృతిని కాపాడుకోవాలి

 • ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

 • ప్రపంచ హిందూ మహాసభల ముగింపు

venkaiah-naiduషికాగో: ‘హిందూ’ అనే పదాన్ని ‘అస్పృశ్యం’గా, ‘సహించలేనిది’గా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి దురభిప్రాయాలను దూరం చేయాలంటే స్వామి వివేకానంద లాంటివాళ్లు నేర్పిన నిజమైన హిందూత్వ విలువలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. అమెరికాలోని షికాగోలో జరుగుతున్న రెండో ప్రపంచ హిందూ మహాసభల ముగింపు సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారతదేశం విశ్వజనీన సహనశీలతను నమ్మిందని, అన్ని మతాలను ఆమోదించిందని ఆయన చెప్పారు. మొత్తం 60 దేశాల నుంచి 250 మంది వక్తలతో పాటు 2500 మంది ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. స్వామి వివేకానంద 1893లో ఇదే నగరంలో చేసిన చారిత్రక ఉపన్యాసం 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్రపంచ హిందూ మహాసభలను నిర్వహించారు. పంచుకోవడం, సంరక్షించడం (షేర్ అండ్ కేర్) అనేవి హిందూ తత్వంలోని మూలసూత్రాలని వెంకయ్యనాయుడు చెప్పారు. హిందూమతం గురించి బోలెడంత తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని అన్నారు. అసలైన దృక్కోణం ఏమిటన్నది తెలిస్తే అప్పుడు ఇలాంటి తప్పుడు సమాచారాలు ప్రచారం కాకుండా ఉంటాయని, తప్పుడు అభిప్రాయాలు కూడా దూరం అవుతాయని ఆయన అన్నారు. సమాజంలోకి కొన్ని బలహీనతలు చొచ్చుకొచ్చాయని, వీటిని  సంస్కర్తలే దూరం చేయాలని సూచించారు. ఇతరుల అనుభవాల గురించి కూడా తెలుసుకుని, వాళ్ల తత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలని వెంకయ్య నాయుడు తెలిపారు. భారతీయ సంస్కృతి, మతం ఇతర వర్గాలలోని సుగుణాలను తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాయని గుర్తుచేశారు. ప్రపంచమంతా వసుధైక కుటుంబం అన్న భావన హిందూ మతంలోనే ఉందని, అలాగే ప్రపంచంలోని సజీవ, నిర్జీవ పదార్థాలన్నింటిలో భగవంతుడు ఉన్నాడని చెబుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతుందని ఆయన తెలిపారు. ప్రకృతితో కలిసిమెలిసి ఎలా బతకాలో కూడా హిందూమతం చెబుతుందన్నారు. ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని కాపాడుకోవడమే అసలైన జాతీయత అని ఉప రాష్ట్రపతి వివరించారు. మహిళలను గౌరవించడం, వారికి సాధికారత కల్పించడం హిందూమతంలోని మరో కీలకాంశమని వెంకయ్యనాయుడు చెప్పారు. 

1893 సెప్టెంబరు 11వ తేదీన స్వామి వివేకానంద షికాగోలో తన ప్రసంగంలో చెప్పినట్లుగా.. భారతదేశం ఈ ప్రపంచానికే సహనం, విశ్వ ఆమోదాలను నేర్పించిందని అన్నారు. విజ్ఞాన మాధుర్యాన్ని ఈ ప్రపంచానికి అందించగలిగినది భారతదేశమేనని తెలిపారు. భారతీయులుగా మనమంతా నేర్చుకున్న విలువలు.. మన వ్యక్తిగత అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలుస్తాయని, దాంతోపాటు సమష్టి పురోగతికి ఉపయోగపడతాయని అన్నారు. ప్రకృతి వనరులు, పర్యావరణాన్ని కాపాడే విలువలు కూడా ఉన్నాయన్నారు. మరింత భరణీయ విశ్వాన్ని సృష్టించడానికి సహాయపడతామని తెలిపారు. ఒకప్పుడు భారతదేశానికి ‘విశ్వగురువు’గా పేరుండేదని గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేనన్ని మార్పులకు గురవుతున్న ప్రపంచంలో మనకు ఒక మంచి చుక్కాని, ఆధ్యాత్మిక దిక్సూచి కావాలని.. వాటిని భారతదేశం ఈ ప్రపంచానికి ఇవ్వగలదని చెప్పారు. చేదుతో నిండిపోయిన ఈ ప్రపంచానికి భారతదేశం వివిధ పుష్పాల నుంచి వేర్వేరు తేనెటీగలు సేకరించిన విజ్ఞాన మాధుర్యాన్ని అందించగలదని విశ్లేషించారు. ఈ ప్రపంచం ఎప్పుడు సంఘర్షణలకులోనైనా, ముక్కలు చెక్కలవుతుందన్న భయాలు తలెత్తినా, విద్వేషం, నిర్హేతుకమైన పక్షపాతాలకు లోనైనా భారతదేశమే ఈ ప్రపంచానికి లేపనం పూస్తుందని, రెండు వేల ఏళ్లకు పైగా తన సాంస్కృతిక ప్రపంచపు పరిమళాలను అందిస్తోందని వెంకయ్య నాయుడు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ‘ప్రపంచ హిందూ మహాసభలు’ అంటున్నారని, కానీ అసలు హిందూయిజం అంటే ఏంటని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లుగా హిందూమతాన్ని నిర్వచించడం అసాధ్యం కాకపోయినా, చాలా కష్టమేనని, దాన్ని తగినంతగా వివరించడం కూడా కష్టమేనని ఆయన అన్నారు. ప్రపంచంలోని ఇతర మతాల్లా కాకుండా.. హిందూ మతం ఏ ప్రవక్తనూ నమ్మదని, ఏ ఒక్క దేవుడినీ పూజించదని, ఎవరో ఒకరికి సాగిలబడదని, ఏదో ఒక తత్వాన్ని మాత్రమే నమ్మదని, ఒకే రకమైన మతాచారాలు, కార్యక్రమాలను అమలుచేయదని అన్నారు.  ప్రపంచంలోని ఏ మతం.. ఏ తెగకు సంబంధించిన సంకుచిత సంప్రదాయాలతో అది సంతృప్తి చెందదని స్పష్టం చేశారు. అది ఒక జీవన మార్గమని మాత్రమే చెప్పగలం తప్ప మరేమీ కాదని రాధాకృష్ణన్ చెప్పిన అంశాలను వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిందువులు ప్రతి మతాన్నీ స్వాగతిస్తారని అన్నారు. సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను, తమ సంస్కృతిని కాపాడుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. మాతృభాషను మరువద్దని పిలుపునిచ్చారు. తదుపరి ప్రపంచ హిందూ మహాసభలు 2022 నవంబరులో బ్యాంకాక్‌లో జరుగుతాయి. సభ ముగింపు సందర్భంగా చేసిన ప్రకటనలో, 2018 సెప్టెంబరు 11వ తేదీని ‘స్వామి వివేకానంద డే’గా ఇల్లినాయిస్ గవర్నర్ ప్రకటించారు. 



వివేకానందుడు నడయాడిన నేలలో..

Updated By ManamTue, 09/04/2018 - 22:36
 • ఏడు నుంచి షికాగోలో ప్రపంచ హిందూ మహాసభలు

 • ఈ నెల 9 వరకు మూడు రోజులుపాటు నిర్వహణ

 • 80 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరు

 • కీలక ఉపన్యాసం చేయనున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్

 • పాల్గొననున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

world-hindu-congressవాషింగ్టన్:  అది 1893వ సంవత్సరం. అమెరికాలోని షికాగోలో సెప్టెంబరు 11-27 మధ్య ప్రపంచ మత మహాసభలు జరిగాయి.  ఈ సభల్లో భారత ప్రతినిధిగా హాజరైన స్వామి వివేకానంద.. హిందూ మతం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇతర మతాల్లోని అసహనాన్ని వేలెత్తి చూపారు. తన మతంలోని పరమత సహనాన్ని వెలుగెత్తిచాటారు. ఇప్పుడే అదే చోట.. ఈ నెల 7-9 మధ్య ప్రపంచ హిందూ మహాసభలు జరగనున్నాయి. దీనికి 80 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ‘‘సమిష్ఠిగా ఆలోచిద్దాం.. ధైర్యంగా సాధిద్దాం’’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు. మహాసభల నిర్వాహకుడు ఐఐటీ గ్రాడ్యుయేట్ అయినస్వామి విజ్ఞాననంద్ సోమవారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ మహాసభ వివరాలను వెల్లడించారు. హిందూ సమాజాన్ని మరింత సంఘటిత పరిచేందుకు, సమాజం ప్రయోజనాలపైనా, ప్రపంచవ్యాప్తంగా ఇతర మతాల్లోని పీడితుల గురించి చర్చించడమే లక్ష్యంగా సభలను నిర్వహిస్తున్నామని విజ్ఞాననంద్ తెలిపారు. అంతేకాని.. ఇది మతరమైన కార్యక్రమంగా భావించకూడదని చెప్పారు. ‘‘ఇది మతపరమైనది కాదు. తత్వజ్ఞాన సంబంధమైనది కాదు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రపంచంలోని అన్ని సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక్కడ చర్చిస్తాం. మూడు రోజుల సమావేశాల్లో 250 మంది ప్రసంగిస్తారు’’ అని విజ్ఞాననంద్ తెలిపారు. mohan bhagawathసమావేశాల్లో ఆర్థికం, విద్య, మీడియా, వ్యవస్థలు, రాజకీయాలు, మహిళలు, యువత అంశాలపై చర్చలు ఉంటాయన్నారు. విలువలు, సృజనాత్మకత, ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంలో ఔత్సాహిక స్ఫూర్తిపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ మనోభావాలను పంచుకునేందకు, వెల్లడించేందుకు ‘వరల్డ్ హిందూ కాంగ్రెస్’ ఒక పరికరంగా ఉపయోగపడుతుందని సమావేశాల సమన్వయకర్త అభయ ఆస్థాన  పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. 21వ శతాబ్దంలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైనా చర్చిస్తామన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తోపాటు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా, శ్రీశ్రీ రవిశంకర్, సురినాం ఉపాధ్యక్షుడు అశ్విన్ అధిన్, ఆర్‌ఎస్‌ఎస్ జాయింట జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబళే, ఎంఐటీ ప్రొఫెసర్ ఎస్‌పీ కొథారి, పారిశ్రామికవేత్త రాజు రెడ్డి, స్వామి పరమాత్మనంద సరస్వతి తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. వీరితో పాటు ప్రముఖ ఆర్థిక వేత్తలు అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అధ్యక్షుడు ముఖేశ్ అఘి, నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, మహింద్రా గ్రూప్ ప్రెసిడెంట్ దిలీప్ సుందరం, వాల్‌మార్ట్ ప్రతినిధి డేనియల్ బ్రాంట్, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్‌కు ఎందిన రాజేశ్ సుందరం, ఎమర్సన్ ఎలక్ట్రిక్‌కు చెందిన ఈద్ మోన్సేర్ హాజరవుతారన్నారు. ప్రముఖ కళాకారులు అనుపమ్‌ఖేర్, వివేక్ అగ్నిహోత్రి, మధూర్ భండార్కర్ తదితరులు పాల్గొన్నారు.

తొలిసారి అమెరికాకు వెంకయ్య
ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత వెంకయ్యనాయుడు తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. వివేకానందుడి బోధనల సమకాలీనత, ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవి ఎలా మార్గదర్శిగా నిలవనున్నాయో అనే అంశంపై వెంకయ్యనాయుడు ప్రసంగించారు.  



ఫిరాయింపుదార్లపై కఠినం

Updated By ManamTue, 09/04/2018 - 22:36
 • ఎన్నికల వివాదాలకు కోర్టులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి

 • పార్టీ ఫిరాయిస్తే రాజీనామా.. దానిని రాజ్యాంగబద్ధం చేయాలి

 • అన్ని కులాలవారికీ ‘కోటా’ అందాలి.. దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు

 • పార్టీలు, సభ్యులు ఆలోచించాలి.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 • ఈ నెల 11తో పదవిలో ఏడాది.. ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ

venkaiahన్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని ఎగువసభ అయిన రాజ్యసభ గౌరవాన్ని పునరుద్ధరించడమే ప్రస్తుతం తనముందున్న ప్రధాన కర్తవ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సభలో తప్పుగా వ్యవహరించినవారిపై చర్యలకు సంబంధించి నిబంధనల్లో మార్పులు  తేవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 11తో ఉప రాష్ట్రపతి పదవి చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన మంగళవారం పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ ఫిరాయించినవారిపై సదరు పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆ వివాదాన్ని మూడు నెలల్లోగా పరిష్కరించేలా ఎన్నికల అధికారికి అధికారం ఇవ్వాల్సి ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంబంధ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని వీడిన అభ్యర్థులు చట్టసభల్లో తమ సభ్యత్వాన్ని కూడా వదులుకోవాల్సి ఉందన్నారు. చట్టసభకు కూడా రాజీనామా చేయడం కనీస నైతిక బాధ్యత అని, కానీ దీనిని కొందరు పాటిస్తున్నారని, కొందరు పాటించడం లేదని అన్నారు. కాబట్టి ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టంలో సంబంధిత చట్టసభ సభ్యుడిపై చర్యలకు ఎలాంటి కాలపరిమితి లేదు. అలాగే.. పార్టీ సభ్యుల్లో రెండింట మూడో వంతు మంది పార్టీ ఫిరాయిస్తే.. వారిపై చర్యలకు ఎలాంటి అధికారం లేదు. ఈ నేపథ్యంలో ఇలా పార్టీని ఫిరాయించిన వారి సంరక్షణకు సంబంధించి చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. అయితే ఇది ఏకాభిప్రాయ సాధనద్వారానే చేపట్టాలన్నారు. రాజ్యసభ నిబంధనల సవరణకు సంబంధించి నియమించిన కమిటీ ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించిందని, తుది నివేదిక వచ్చే నెలలో సమర్పిస్తుందన్నారు.
venkaiah

పార్టీ ఫిరాయింపుదార్లపై చర్యలకు ఎలాంటి కాలపరిమితి లేకపోవడంతో కొన్నిసార్లు వారిపై చర్యలకు ఐదేళ్లు కూడా పడుతోందని అన్నారు.  ఇది సమంజసం కాదని, అయితే ఈ నిబంధనను అన్ని పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంలో లోపాలను సరిచేయాల్సిన ఉందన్నారు. శాసన మండళ్ల ఏర్పాటు పైనా పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందని, ఇవి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికకాని వారికి పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయనే అపవాదు ఉందన్నారు. అయితే మండళ్లపై తనకంటూ ప్రత్యేక అభిప్రాయం లేదన్నారు. క్రమశిక్షణ ఉండటం అందరికీ ముఖ్యమని అన్నారు. చైనా విధానాలను తాను అంగీకరించనని, కానీ క్రమశిక్షనే వారిని ఈ స్థాయికి తెచ్చిందని గుర్తించుకోవాలన్నారు.  క్రమశిక్షణ అంటే సానుకూల జీవన విధానం అని, అది అన్నింటా ఉపయోగపడుతుందన్నారు. అది ఒక్క పార్లమెంట్ వ్యవహారాలకే పరిమితం కాదన్నారు. చట్టసభల్లో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం లభించాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గంలోని కొన్ని కులాల వారికే అధిక ప్రయోజనాలు అందుతున్నాయనే భావన మిగతా కులాలలో ఉందన్నారు. ‘‘రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. వాటిని ముట్టుకోకూడదు. అయితే అన్ని కులాలవారికి కోటా ఫలితాలు అందాలి. అన్ని సామాజిక వర్గాలు, అందులోని వర్గాలు, ఉప వర్గాల వారికి దామాషా పద్ధతిలో రిజర్వేషన్ సౌకర్యం కలగాలి. దీనిని ప్రజలే కోరుకుంటున్నారు. ఈ అంశంపై రాజకీయపార్టీలు, చట్టసభ సభ్యులు ఆలోచన చేయాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు. తన హయాంలో రెండు ముఖ్యమైన ఘటనలు జరిగాయని, ఒకటి శరద్‌యాదవ్ సభ్యత్వం రద్దు, రెండోది చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానానికి అనుమతించకపోవడమని పేర్కొన్నారు. ఈ రెండింటిపై నిర్ణయాలపై తనకు సంతృప్తి కలిగిందన్నారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 60 ప్రాంతాలను సందర్శించానని, 313 కార్యక్రమాల్లో పాల్గొన్నానని, మొత్తం 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో పర్యటించానని, 56 వర్సిటీలో, 21 సాంకేతిక పరిశోధన కేంద్రాల్లో ప్రసంగించానని, ‘‘భారత్ అనుసంధానం’’ కార్యక్రమంలోనే భాగంగా పర్యటించనన్నారు.



ఓటమిని ఓడించిన వ్యక్తి

Updated By ManamThu, 08/30/2018 - 00:09
 • వాజ్‌పేయి సంతాప సభలో ఉపరాష్ట్రపతి  

imageహైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారి వాజ్‌పేయి ఓటమితో యుద్ధం చేసి, ప్రతిసారి విజయం సాధించిన గొప్ప వ్యక్తి అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. భారతీయ విద్యాభవన్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అటల్ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘ఒప్పుకోను పరాజయం.. కొత్తదారి నా ధ్యేయం.. కాలం తలరాతను చెరిపేస్తా.. సరికొత్త గీతాన్నే పాడేస్తా’నంటూ ఓ మధ్య తరగతి ఉపాధ్యాయుడి బిడ్డ స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయక వ్యక్తిగా అటల్ చిరస్థాయిగా నిలిపోతారన్నారు.

ఓటమితో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అటల్.. ఒక్కో అవరోధాన్ని అధిగమిస్తూ, రాజనీతికి నిలువుటద్దంలా ఎదిగారని కొనియాడారు. కర్తవ్య నిర్వహణలో బాధ్యత.. మాటలతో కట్టిపడేసే చతురత.. దేశ ప్రయోజనాల విషయంలో దృఢత్వం ఉన్న వ్యక్తిత్వం వాజ్‌పేయి సొంతమన్నారు. వాజ్‌పేయి సమర్థతను జవహర్‌లాల్ నెహ్రు ముందగానే గుర్తించారని చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, ప్రజ్ఞా ప్రభ ప్రతినిధి నందకుమార్, రాజ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



హరికృష్ణ మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం

Updated By ManamWed, 08/29/2018 - 11:31

Venkaiah Naidu, Harikrishnaన్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డుప్రమాదంలో మృతిచెందారని తెలిసి చింతిస్తున్నాను. ఎన్టీఆర్‌ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.



దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలి

Updated By ManamSat, 08/25/2018 - 06:31
 • కేన్సర్ వ్యాధి నివారణలో ముందుండాలి

 • పొగాకు వినియోగం వల్లే ఈ వ్యాధి ముప్పు

 • వాతావరణ మార్పుతో పర్యావరణ సమస్య

 • శాస్త్రవేత్తల సమావేశంలో వెంకయ్య నాయుడు

venkaiahవిశాఖపట్నం: కేన్సర్ వ్యాధిని అరికట్టడంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శాస్త్ర సాంకేతిక అణుశక్తి రంగాలలో గణనీయమైన పురోభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. భారతదేశం గర్వించే విధంగా హోమీ జహంగీర్ బాబా గొప్ప అణు పరిశోధనలు చేశారని చెప్పారు. భారత్‌లో 22 అణు రియాక్టర్లు, 6,780 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపారు. శుక్రవారం విశాఖ  ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో బాబా అటమిక్ పరిశోధనా కేంద్రం, హోమీ  బాబా కేన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా శాస్త్రవేత్తలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. భారత పరిశోధనా ఫలాలు సామాన్యులు, రైతులకు చేరాలన్నారు. దేశంలోని 58 విశ్వ విద్యాలయాలను సందర్శించానని, 29 స్నాతకోత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. రైతులతో పరస్పరం చర్చించి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని సూచించారు. భారత దేశ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. ప్రజలు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతీది ప్రభుత్వం పనే మనకెందుకులే అనే ధోరణ విడనాడాలని హితవు పలికారు. భారత ప్రధాన మంత్రి స్వచ్చభారత్, బేటి బచావో, బేటిపడావో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావని అన్నారు. పరిశోధనలకు, అభివృద్ధికి  ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రకృతిలో వస్తున్న మార్పుల వలన హుద్ హుద్, సునామీ వంటి విపత్తులు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భారత వైద్య పరిశోధనా సంస్థ ప్రతి రోజు సుమారు 12 నుంచి 13 లక్షల కొత్త కేన్సరు రోగులను గుర్తిస్తోందన్నారు. ప్రారంభదశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ, గ్రామీణ భారతదేశంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సకాలంలో చికిత్స అందించాలని చెప్పారు. పొగాకు వినియోగం వలన కేన్సర్ బారిన పడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది తల, మెడ కేన్సరు వ్యాధితో బాధపడుతున్నారన్నారు. కేన్సరు నివారణకు స్పష్టమైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఆధునిక జీవనశైలిలో మార్పులు రావాలని చెప్పారు. బార్క్ వంటి సంస్థలు తక్కువ వ్యయం, సాంకేతిక పరిజ్ఞాన పరికరాల అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వెంకయ్య నాయుడు తెలియజేశారు. నేడు దేశంలో ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఆంధ్రా నాటు కోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, చింతచిగురు కూరలను, ఆంధ్రా పచ్చళ్లును విస్మరించి, మంచురియా, జంక్ పుడ్‌లకు ఆశక్తి చూపడం వలన వ్యాధులు పెరిగి పోతున్నాయని చెప్పారు. 



ఆ బాధ్యత యువ ఆర్కిటెక్చర్లదే...

Updated By ManamThu, 08/23/2018 - 17:18
School of Planning and Architecture

విజయవాడ: పర్యావరణ సమతుల్యత పాటించేలాగా భవన నిర్మాణాలను చేపట్టాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్చర్లదేనని భారత ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు హితవు పలికారు. స్ధానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో గురువారం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్  మూడవ స్వాతకోత్సవ వేడుకలలో వెంకయ్యనాయుడు, గవర్నర్ నరహింహన్‌తో కలసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, గురువును ఎన్నడూ మరవరాదన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిని ప్రేమించాలని, ప్రకృతితో కలసి అడుగులు వేయాలన్నారు. భావి భారతదేశ భవిష్యత్ ఆర్కిటెక్చర్లపై ఆధారపడి ఉందని, పర్యావరణ హితంగా భవన నిర్మాణాలకు రూపకల్పన చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. సంతోషమైన వాతావరణంలో భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు. 

venkaiah

నేడు ఎక్కడ చూసినా నగరాలు కాంక్రిట్ జంగిల్స్‌గా మారిపోతున్నాయని మానవాళి మనుగడకే అవి ప్రశ్నార్ధకంగా నిలుస్తున్నాయన్నారు. దేశం నాది అనే భావన ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలన్నారు. భవన నిర్మాణాల ఆకృతుల రూపకల్పన సమయంలో వెలుతురుకు, గాలికి తగిన ప్రాధాన్యత కలిగించేలాగా పర్యావరణ సమతూల్యత పాటించే విధంగా సూచనలు చేయాల్సి ఉందన్నారు. ఈరోజులలో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నా తగిన భద్రతా చర్యలు పాటించకపోవడం జరుగుతోందన్నారు. ఆనంద, అభివృద్ధి నగరాల నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.  21వ శతాబ్దంలో ఆర్కిటెక్చర్ల బాధ్యత ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నో అత్యున్నత స్ధాయి విద్యాసంస్ధలు ఈ ప్రాంతంలో నెలకొల్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అదే సమయంలో తన కల సాకారం అవడం జరిగిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ స్ధాయిలోని ప్రముఖ విద్యాసంస్ధలైన ఐఐటీ, ఎయిమ్స్ వంటి ఎన్నో ఉన్నతమైన విద్యాసంస్ధలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం, నిర్మాణాలు జరగడం జరుగుతోందన్నారు. విద్యార్ధి నాయకుడిగా విజయవాడతో తనకు వీడదీయరాని అనుబంధం ఉందని గత రోజులను గుర్తుచేసుకున్నారు.

స్కూల్ ఆఫ్  ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ జాతీయ స్ధాయి గ్రాడ్యూయేషన్ కార్యక్రమం విజయవాడ నగరంలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు వేదికగా నిలవడం జరుగుతుందన్నారు. నేటి యువ విద్యార్ధులు బ్యూటీ మరియు డ్యూటీ అనే ఒక సమాంతర వ్యవస్ధగా వారి విధి నిర్వహణలో పనితనాన్ని చూపాల్సిన అవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఐఐటీ, నిట్ వంటి ఉన్నత విద్యాసంస్ధలు మొదటి జనరేషన్ విజ్ఞానానికి చెందిన విద్యాసంస్ధలుగా నిలిస్తే, రెండవ జనరేషన్‌లో ఆర్కిటెక్చర్ విద్యాసంస్ధలు ఉన్నత విద్యాసంస్ధలుగా నిలుస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలన వస్తున్నారని తాను కూడా గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నుండి పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా బాధ్యతలను నిర్వహించడం జరిగిందని  చలోక్తి విసిరారు. 

ఏపీలో 2008 లో ప్రారంభించబడిన ఈ స్పా సంస్ధకు 2014 లో భవన నిర్మాణాలకు తాను శంకుస్ధాపన చేశానని, ఈరోజు ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.  నిరంతర పర్యవేక్షణతోనే అది సాధ్యమైందన్నారు. సుస్ధిరమైన భవన నిర్మాణాల పట్ల దృష్టి సారించాలని, పచ్చదనం, సాంప్రదాయాల సమ్మేళనంగా నగర నిర్మాణాలు  ఉండాలన్నారు.

ప్రకృతి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల వల్లే విశాఖపట్నం, చెన్నై, కేరళలో సంభవించిన సంఘటనలు ప్రకృతి విలయానికి తార్కాణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచీకరణలో భాగంగా నూతన అవిష్కరణలను ఛాలెంజ్‌గా యువ ఆర్కిటెక్చర్లు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గతాన్ని మరవవద్దని, భవిష్యత్తును విస్మరించవద్దని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చేపట్టబోయే నిర్మాణాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 

ఈ స్నాతకోత్సవం సందర్భంగా జాతీయ స్ధాయిలో బంగారు పతకాలు సాధించిన 10 మందికి, ఉత్తమ పరిశోధన పత్రాలు రూపొందించిన 12 మంది విద్యార్ధులకు, 2017,2018 సంవత్సరాలలో పట్టభద్రులైన  గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన 280 మందికి డిగ్రీ పట్టాలను కార్యక్రమంలో అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, 2017,2018 సంవత్సరాలలో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆర్కిటెక్చర్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపన్యాసకులు తదితరులు పాల్గొన్నారు. 



ఎన్డీయే విజయం

Updated By ManamFri, 08/10/2018 - 01:03
 • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

 • హరివంశ్ నారాయణ్ సింగ్ గెలుపు.. జేడీ(యూ) అభ్యర్థికి 125 ఓట్లు 

 • కాంగ్రెస్ నేత హరిప్రసాద్‌కు 105 ఓట్లు.. సభలో రెండుసార్లు ఓటింగ్ నిర్వహణ

 • కొంతమంది సభ్యుల తప్పులే కారణం.. రాజ్యసభకు హాజరైన అరుణ్ జైట్లీ

imageన్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయేదే పై చేయి అయ్యింది. జేడీ(యూ) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ 125 ఓట్లు సాధించి గెలిచారు. ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్‌కు విపక్షాలన్నీ ఐక్యంగా ఉండి మద్దతు పలికినా 105 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఇద్దరు సభ్యులు ఓటింగ్ నుంచి దూరంగా ఉన్నారు. తొలిసారి డివిజన్ ఓటింగ్ చే పట్టినపుడు కొంతమంది సభ్యులు సరిగా ఓట్లు వేయకపోవడంతో మరోసారి నిర్వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కొంతమంది తాము ఓట్లు వేయలేకపోయామని చెప్పడంతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వారికి స్లిప్‌లు అందించారు. ఇవన్నీ అయిన తర్వాత తుది ఫలితం ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా తన స్థానం నుంచి లేచి వెళ్లి హరివంశ్ సింగ్‌ను అభినందించారు. హరివంశ్ సింగ్ నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారని, మంచి రచయిత అని, ఆయనంటే మాజీ ప్రధాని చంద్రశే ఖర్‌కు ఎంతో ఇష్టమని మోదీ చెప్పారు.  రిజర్వు బ్యాంకు లో ఉద్యోగం వచ్చినా ఆయన కాదన్నారని గుర్తుచేశారు. సభలో సభ్యులందరికీ ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానన్నారు. సభలో చిత్రమైన పరిస్థితి ఉంటుందని, ఇక్కడ ఆటగాళ్ల కంటే అంపైర్లకు ఎక్కువ సమస్యలు వస్తాయని అనడంతో సభలో నవ్వులు విరిశాయి. కొత్త డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్ష సభ్యులకు సమస్యలు లేవనెత్తడా నికి తగిన అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ అన్నారు. హిందీ భాషాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పీజే కురియన్ పదవీకాలం జూలై 1న ముగియడంతో అప్పటినుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. హరివంశ్ పేరును రాంప్రసాద్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు ప్రతిపాదించారు. ఆయన గెలిచినట్లు వెంకయ్య నాయుడు ప్రకటించిన తర్వాత అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కలిసి డిప్యూటీ చైర్మన్ కుర్చీ వరకు హరివంశ్‌ను తోడ్కొని వెళ్లారు. 

మోదీకి సీఎం అభినందన
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి విజయం పట్ల ప్రధాని నరేంద్రమోదీని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ అభినందించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల రాజకీయ చాతుర్యానికి ఇది నిదర్శనమన్నారు. ప్రతిపక్షాల ఐక్యత ఏమాత్రం ఉందో దీంతో తెలిసిపోయిందన్నారు. 

వైఎస్‌ఆర్‌సీపీ, ఆప్, పీడీపీ దూరం..
వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు మద్దతు పలకాలని నిర్ణయించుకోవడంతో ఒక దశలో అధికార పక్షానికి ఎదురుదెబ్బ తప్పదేమో అన్న సూచనలు కూడా కనిపించాయి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, పీడీపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో హరిప్రసాద్‌కు నిరాశ తప్పలేదు. తమను మద్దతివ్వాల్సిందిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కోరలేదని.. అయితే తాము ఎన్డీయే అభ్యర్థికి కూడా ఓటు వేయదలచుకోలేదని చెబుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. రాష్ట్రాన్ని మోసం చేసినందుకు తాము ఎన్డీయే, కాంగ్రెస్ రెండింటిలో దేనికీ మద్దతు ఇవ్వబోమని వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి బీజేపీ ద్రోహం చేసిందని.. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందు పరచకుండా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేవలం నోటిమాటగా చెప్పారని, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి తీరని ద్రోహం చేసిందని ఆయన అన్నారు. కీలక రాజ్యాంగ పదవులు ఏవైనా ఏకగ్రీవం కావాలనేది తమ అభిప్రామయని చెప్పారు.  డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 230 మంది సభ్యులు ఓటు వేశారు. సభలో ఉండి ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ గెలుపును వెంకయ్యనాయుడు ఖరారు చేయగా, ఆపై పలువురు సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  ఎన్డీయేలో భాగస్వామిగా లేని టీఆర్‌ఎస్ ఆఖరి క్షణంలో బీజేపీ మద్దతుతో నిలబడిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలికింది. ఆయనకు అనుకూలంగా టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభలో ఉన్న ఆరుగురు ఎంపీలూ ఓటు వేశారు. బీజేపీ నుంచి 73, ఎన్డీయేలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన 20 మంది, అన్నాడీఎంకే నుంచి 13, బీజేడీ నుంచి 9, టీఆర్‌ఎస్ నుంచి 6, నామినేటెడ్ సభ్యులు నలుగురు ఉన్నారు. తొలుత తృణమూల్ లేదా ఎస్పీ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్షాల కూటమి భావించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆ బాధ్యతను కాంగ్రెస్కు అప్పగించాయి. దీంతో సీనియర్ నేత హరిప్రసాద్ను ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించింది. మరోవైపు భాజపా సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా.. జేడీయూ నేత హరివంశ్ నారాయణ్‌కు మద్దతిచ్చింది. అంతేగాక.. ఎన్డీయే మిత్రపక్షాలు కూడా హరివంశ్‌కు మద్దతిచ్చేలా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. కాగా.. జేడీయూ అభ్యర్థి నిర్ణయంపై తొలుత శివసేన అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ తర్వాత హరివంశ్‌కు మద్దతిస్తామని ప్రకటించింది. టీడీపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు ఓటేశారు. భారత పార్లమెంటు వ్యవస్థలో 26 ఏళ్లుగా రాజ్యసభ ఉపసభాపతి ఏకగ్రీవంగా జరిగింది. అయితే 26 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఎన్నికలో జేడీయూ ఎంపీ హరివంశ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1956 జూన్ 30న జన్మించిన హరివంశ్ నారాయణ్సింగ్ రాంచీలోని బనారస్ యూనివర్శిటీ నుంచి పట్టభద్రులయ్యారు. రాజ్యసభకు 41 ఏళ్ల తర్వాత కాంగ్రెస్సేతర ఉపసభాపతిగా హరివంశ్ నారాయణ్‌సింగ్ ఎన్నికవడం విశేషం. ప్రధాని మోదీతో పాటు హరివంశ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, టీఆర్‌ఎస్ ఎంపీ కేకే అభినందించారు.

సభకు జైట్లీ
మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడంతో చాలాకాలం నుంచి విశ్రాంతిలో ఉన్న సభా నాయకుడు అరుణ్ జైట్లీ.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ సభకు వచ్చారు. హరివంశ్ సింగ్‌కు అభినందనలు చెప్పే సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్.. ఆయన కు అభినందనలు చెప్పారు. అయితే, ఓటింగ్ కోసం జైట్లీ వచ్చి ఉండచ్చు గానీ ఆయనకు మరికొంత విశ్రాంతి అవసరమని, కొంతకాలం విశ్రాంతి తీసుకుని వస్తే మంచిదని సూచించడంతో ఇరుపక్షాల నేతలు కాసేపు నవ్వుకున్నారు.



ఎంపీల‌కు క్విజ్‌..చాక్లెట్లు..!

Updated By ManamMon, 08/06/2018 - 13:13
venkaiah-naidu and members

న్యూఢిల్లీ : స్కూల్ విద్యార్థుల‌కు నిర్వహించిన విధంగానే నూతనంగా ఎన్నికైన రాజ్యసభ స‌భ్యుల‌కు వివిధ అంశాల‌పై క్విజ్ నిర్వహించి, చాక్లెట్లు పంచిపెట్టారు.  మొన్న (శ‌నివారం) రాజ‌ధానిలో ఇటీవ‌ల ఎంపికైన‌, నామినేట్ అయిన స‌భ్యుల కోసం ఓరియంటేష‌న్ కార్యక్రమం జ‌రిగింది. ఈ సందర్భంగా స‌భ్యుల‌కు వివిధ అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. 

సీనియ‌ర్ ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్ స‌భకు సంబంధించిన వివిధ అంశాల‌పై స‌భ్యుల‌కు ప్రశ్నలు వేసి, స‌రైన స‌మాధానాలు ఇచ్చిన వారికి చాక్లెట్లు పంచిపెట్టారు. దాదాపు 40 మంది స‌భ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు దాదాపు గంట‌పాటు పార్లమెంట్ విధి విధానాలపై స‌భ్యుల‌కు విశ‌దీక‌రించారు.  స‌భా కార్యక్రమాలను పక్కదారిప‌ట్టించేందుకు కొంద‌రు స‌భ్యుల మూక‌స్వామ్యం ప్రయత్నాల‌ను సాగనివ్వబోన‌ని స్పష్టం చేశారు. ప్రజల ఎజెండాను గౌర‌వించాల‌ని కోరారు.



వెంకయ్యకే మా మద్దతు

Updated By ManamSun, 08/05/2018 - 01:00
 • ఆయనపై పూర్తి విశ్వాసముంది

 • టీఆర్‌ఎస్, బీజేడీ, ఎస్పీ ప్రకటన  

imageన్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుపై తమకు పూర్తి విశ్వా సం ఉందని టీఆర్‌ఎస్, బీజేడీ, ఎస్పీ ప్రకటించాయి. రాజ్యసభలో వెంకయ్యనా యడు తీరు బాగోలేదంటూ.. ఆయనకే ఓ లేఖ రాయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తుండటంతో ఇలా స్పందించాయి. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ శనివారం వెంకయ్యనాయుడుకు ఓ లేఖ రాసినట్లుగా తెలిసింది. బీజేడీ, ఎస్పీ కూడా వెంకయ్యపై విశ్వాసముందని పేర్కొంటూ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి.

వెంకయ్య తీరు బాగోలేదంటూ ఆయనకే ఓ లేఖ రాయలని కాంగ్రెస్ నిర్ణయించిందని, ఇందుకోసం విపక్షాల మద్దతు కోరుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారంనాటి బీఏసీ సమావేశంలోనే వెంకయ్య నిలదీయగా.. అదేం లేదని  సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సమాధానమిచ్చారు. ఈ నేప థ్యంలో ఈ మూడు పార్టీలు వెంకయ్యపై విశ్వాసముందని ప్రకటించాయి.





Related News