hindhu congress

ఆధిపత్యం.. చెలాయించరు 

Updated By ManamSat, 09/08/2018 - 22:30
  • ప్రపంచాన్ని సుసంపన్నం చేయడమే లక్ష్యం

  • సంఘటితంతోనే హిందూ సమాజం పరిఢవిల్లుతుంది

  • షికాగోలో ప్రపంచ హిందూ కాంగ్రెస్ ప్రారంభం

  • హాజరైన వివిధ దేశాల 2,500 మంది ప్రతినిధులు

hindhu congressషికాగో: ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన హిందువులకు ఏ కోశాన లేదని, సమాజానికి మేలు చేసేందుకే హిందూ సమాజం కృషి చేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఐక్యంగా ఉండాలని, మానవజాతిని మరింత సుసంపన్న చేసేందుకు కృషి చేయాలని పిలపునిచ్చారు. అమెరికాలోని షికాలో శనివారం రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్ ప్రారంభమైంది. దీనికి ప్రపంపవ్యాప్తంగా 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1893లో షికాగో ప్రపంచ మత సదస్సుల్లో వివేకానందుడు ప్రసంగించి 125 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సమావేశాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. ప్రపంచమంతటినీ ఓ బృందంగా చేయడమనే ఆలోచన వెనుక ఉన్నతమైన ఆలోచన ఉందని, ఏకాభిప్రాయాన్ని సాధించడమనే భావనను ఆమోదించాలా చేయడమే దీని ఉద్దేశమని అన్నారు. ‘‘సింహం అడవికి రారాజు. అవి గుంపుగా ఉన్నప్పుడు వాటిని ఎవరూ ఏమీ చేయలేదు. కానీ.. సింహం ఒక్కటే ఉంటే అడవి కుక్కలు దానిని చీల్చి చెండాడుతాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి. ప్రపంచాన్ని మరింత సుసంపన్నం చేయాలని కోరుకుంటున్నాం. అంతేగానీ.. పెత్తనం చెలాయించాలని అనుకోవడం లేదు. వలసవాదం లేదా విజయనినాదం ఆధారంగా మా ప్రభావం ఉండదు’’ అని భాగవత్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఒక సిద్ధాంతం ఉండటం మంచిదని అన్నారు. తాను మాత్రం ఆధునిక భావాలను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ సానుకూల భవిష్యత్తు వైఖరిని కలిగి ఉన్నవాడిని అన్నాను. హిందువుల ధర్మం అత్యంత పురాతనమైనదని, అదే సమయంలో అత్యంత ఆధునికమైనదని అన్నారు. సమాజంగా ముందడుగు వేస్తేనే హిందూ సమాజం వర్దిల్లుతుందని, ‘ఐక్యంగా ఆలోచించు.. ధైర్యంగా సాధించు’ అనే సిద్ధాంతాన్ని తాను గాఢంగా విశ్వసిస్తానని అన్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే బదులు.. ఐక్యతతో, ఏకాభిప్రాయంతో ముందడుగు వేయాల్సి ఉంటుందని అన్నారు. మహాభారతంలో కృష్ణుడు, ధర్మరాజు ఎప్పుడూ కూడా ఆయా అంశాలపై చర్చించి ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు వెళ్లారని అన్నారు.

రాజకీయాలనేవి యోగా వంటి కార్యక్రమం కాదని, రాజకీయాలు రాజకీయాలేనని పేర్కొన్నారు.  ప్రస్తుతం మనం కలిసికట్టుగా పని చేయా ల్సిన పరిస్థితుల్లో ఉన్నామన్నారు. హిందూ సమాజంలో అత్యంత ప్రతిభా వంతులైన వ్యక్తులు ఎందరో ఉన్నారని, కానీ వారు ఎప్పుడూ ఒక్కచోటికి చేరలేరని, ఇదే హిందూ సమాజంలోని అత్యంత పెద్ద సమస్య అని పేర్కొ న్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను, వాటి మౌలిక  సూత్రా లను, వేదసారాన్ని హిందువుల మర్చిపోయారని, అందువల్లే వేల ఏళ్లుగా అనేక బాధలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.  హిందువులందరూ ఏకం కావాలని, అందుకోసం ఏదో ఒక సంస్థలో తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా భాగవత్ పేర్కొన్నారు. క్రిమికీటకాలను కూడా చంపొద్దని హిందూ ధర్మం చెబుతుందని, కానీ వాటిని నియం త్రించొచ్చని సూచిస్తుందని అన్నారు. అలాంటి హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఇతరులను వ్యతిరేకించాలని సూచించదని అన్నారు. క్రిమికీటకాలనే మనం ఏమి చేయకుండా కాపాడుతున్నప్పుడు.. ఇతరులకు హాని తలపెట్టాలని హిందూ ధర్మం ఎలా సూచిస్తుందని సూచించారు. అయితే.. హిందూ ధర్మంపై దాడి చేసేవారిని ఎదుర్కోవాల్సిందేనని, కానీ వారికి ఎలాంటి హాని తలపెట్టకూడదని అన్నారు. హిందూ కాంగ్రెస్ చైర్మన్ ఎస్‌పీ కొఠారి మాట్లాడుతూ.. సభను నిర్వహించకూడదని అనేక విజ్ఞప్తులు వచ్చాయని అన్నారు. అయినా ఆ విజ్ఞప్తులను తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని చెప్పారు.

సేవే పరమార్థం: సురినామ్ ఉపాధ్యక్షుడు
ఇతరులకు సేవ చేయటా న్నే హిందువులు జీవిత పరమార్థంగా భావి స్తారని సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు అశ్విన్ అధిన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌సీ తలపెట్టిన బృహత్తర కార్య క్రమాన్ని హిందువులు మధ్యలోనే త్యజిస్తారని తాను అనుకో వడం లేదని, త్యాగానికి హిందువుల ప్రతీకలని అభిప్రాయపడ్డా రు. శాంతి, సామరస్యం, ఆత్మ వంటి భావనలు సామాన్యులకు అంత సులభంగా అర్ధంకావని, కానీ.. వాటిని క్షేత్రస్థాయికి ఆచరణ రూపంలో తీసుకెళ్లినప్పుడు ప్రజలే వాటిని అనుసరిస్తారని అన్నారు. కార్య క్రమంలో బాలీవుడ్ నటుడు అనుప్‌ఖేర్, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తదితరుల పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో కొందరు వ్యక్తులు గందరగోళం సృష్టించారు. మతపరమైన మైనారిటీలపై భారత ప్రభుత్వం అణిచివేత విధానాలను అనుసరిస్తోందని, దీనిని సమావేశానికి హాజరైన పెద్దలందరూ వ్యతిరేకించాలంటూ నినాదాలు చేశారు.

Related News