jr ntr

టాలీవుడ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

Updated By ManamTue, 03/20/2018 - 14:33

TDP MLC Rajendra Prasad Fire On Tollywood Over AP Special Status

అమరావతి: టాలీవుడ్‌‌పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వరు? అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమిళ నటుల్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ టాలీవుడ్‌పై నిప్పులు చెరిగారు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులే అన్న సంగతి మీకు తెలుసా? తెలియదా? అంటూ ఆయన సూటి ప్రశ్న సంధించారు. ఏసీ రూముల్లో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ. మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదని.. హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికొస్తారని రాజేంద్రప్రసాద్ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఏజ్ బార్ అయిన నటులూ.. మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆయన మాటల్లోనే..
"టాలీవుడ్‌కు చెందినటువంటి ఆంధ్రా కళాకారులు రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు పాల్గొనడం లేదు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులు.. అగ్ర హీరోలు కాదా?.. మరి టాలీవుడ్ నటులకు ఏమైంది?. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమైంది..? ఏం మాయరోగం దాపరించింది?. చావ చచ్చిపోయిందా?. మేం టికెట్ల రూపంలో చెల్లించే వందల కోట్ల రూపాయిల కనక వర్షం మత్తులో మీరు మునిగిపోయారా? ఆ మత్తులో నుంచి మీరు బయటికి రారా?. చివరికి పక్కరాష్ట్రంలోని మన సోదర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం అంతా మద్దతు పలికారు. మీరు కూడా అదే తెలంగాణలోనే ఉన్నారు కదా.? అక్కడే బానిస బతుకులు బతుకుతున్నారు?" అని రాజేంద్రప్రసాద్ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

తన్ని తరిమేస్తారని భయమా?
మా ఆంధ్రోళ్లకు మద్దతు పలికితే మీ ఆస్తులు లాక్కుని తన్ని తరిమేస్తారని మీకు భయమా? భయముందా?. సీఎం కేసీఆరే మద్దతి పలికారు కదా అలాంటప్పుడు మీకు ఆ భయమెందుకు?. మీ సినిమాల టికెట్లు కొనడానికి.. కోట్ల రూపాయిలు కురిపించడానికి.. అవార్డులివ్వడానికేనా?. ఎవరికైనా అవార్డులు రాకపోతే లొల్లి.. లొల్లిపెట్టేస్తారు అదేదో భూమి, ఆకాశం బద్ధలైపోయినట్లు ట్వీట్స్.. రిట్వీట్స్.. ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఇంటర్వ్యూలు.. తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లిబుచ్చితారే.. మన ఆంధ్రకు రివార్డులు, నిధులు రావట్లేదు అవన్నీ మీ చెవులకు ఎక్కట్లేదా?. మీ కళ్లకు కనపడట్లేదా?. మీరు ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా?. ఇంతకంటే ఇంకా కఠినంగా మాట్లాడగలను కాకపోతే సంస్కారం నాకు అడ్డొస్తోంది" అని తీవ్ర ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇప్పటికైనా బయటికి రండి..
"ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. బయటికి వచ్చి ఆంధ్రా ప్రజల తరఫున మీ గళం విప్పండి. మీరు మాట్లాడకపోతే మా ఐదు కోట్ల ఆంధ్రా ప్రజలు మీ సినీ పరిశ్రమ కళాకారుల్ని వెలివేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇందులో నో డౌట్!." అని ఆయన చెప్పుకొచ్చారు.తెలంగాణలో ఎన్టీఆర్ సైకిల్ ఎక్కాల్సిందేనా?

Updated By ManamThu, 03/01/2018 - 17:45

jr ntrతెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ. పల్లెల నుంచి పట్టణాల వరకూ పటిష్టమైన క్యాడర్ కలిగిన పార్టీ. తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో విజయదుందుభి మోగించిన పార్టీ నేడు తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించాల్సిన గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. నాయకత్వ లేమితో ముందుండి నడిపించే నాయకుడి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. తెలుగు రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందనేది జగమెరిగిన సత్యం. బలమైన క్యాడర్ ఉన్నా వారందరికీ భరోసానిచ్చే స్థాయి నేత పార్టీలో కనిపించడం లేదు. పైగా టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలనే కొత్త డిమాండ్‌ను మోత్కుపల్లి వంటి సీనియర్ నేతలు తెరపైకి తెస్తున్నారు. మరోపక్క.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం చంద్రబాబు రాజధాని, రాష్ట్ర సమస్యల పరిష్కారం పేరుతో తెలంగాణలో పార్టీ పరిస్థితిని పూర్తి స్థాయిలో చక్కబెట్టలేకపోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవంతో మనగలగాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఎవరా నాయకుడు? ఎవరంతటి సమర్థుడు? చంద్రబాబు ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? ఇవే ప్రశ్నలు తెలంగాణ తెలుగు తమ్ముళ్ల మదిలో మెదులుతున్నాయి. 

తాజాగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. మోత్కుపల్లి చెప్పినట్లు తెలుగుదేశాన్ని టీఆర్‌ఎస్‌లో చేస్తే ఆత్మహత్యలేనన్న సంకేతాన్ని కార్యకర్తలు పార్టీ అధినేతకు బలంగా వినిపించారు. ఇదే సమావేశంలో తెలంగాణలో పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే వాదన కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ కార్యకర్త కూడా తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్‌ ముందుండి నడిపించాలని లోకేశ్ ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించాలన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. లోకేశ్‌కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించాలనే వారూ లేకపోలేదు.

జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌లలో ఎవరు మేలు అనే అంశంపై చర్చ జరుగుతుండగానే చంద్రబాబు ఈ అంశంపై తన అభిప్రాయాన్ని చెప్పేశారు. తమ రెండు కుటుంబాలకు చెందిన వారెవరికీ పార్టీ పగ్గాలు అప్పగించేది లేదని కార్యకర్తలకు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన నేతలతోనే పార్టీ బలోపేతం కావాలని, పార్టీని కాపాడుకునేందుకు పొత్తు అనివార్యం అని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ బాధ్యతలు అప్పగించే విషయంలో చంద్రబాబు ఈ మాటకు కట్టుబడి ఉంటారా లేక పునరాలోచిస్తారా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు నమ్మకం పెట్టుకున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దేవెందర్ గౌడ్ వంటి సీనియర్ నేతలు పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తారో వేచిచూడాలి.తెలుగుదేశంలోకి పురంధేశ్వరి కొడుకు..?

Updated By ManamMon, 02/12/2018 - 20:55

 daggubati purandeswariతన తండ్రి ఎన్టీఆర్ స్టాపించిన తెలుగుదేశం పార్టీలో తమకు చోటు లేకపోవడం దగ్గుబాటి పురంధేశ్వరి పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకున్నారనే అక్కసుతో తనభర్తతో కలిసి పార్టీ నుంచి బయటకు వచ్చారు పురంధేశ్వరీ. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పురంధేశ్వరి.. రాష్ట్ర విభజన తర్వాత భర్తతో కలిసి తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.. అయితే వీరి రాకను చంద్రబాబు అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తనకు దక్కని అదృష్టాన్ని తన కుమారుడికి దక్కేలా చేయాలని పురంధేశ్వరీ పావులు కదుపుతున్నారట.

తమ కుటుంబానికి పట్టున్న పర్చూరు నుంచి తనయుడు చెంచురామ్‌ను అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆమె భావిస్తున్నారట. సోదరుడు బాలకృష్ణ ద్వారా పురంధేశ్వరీ తెర వెనుక నుంచి ఈ వ్యవహారం చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. తమ కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు తదితర అంశాలు చంద్రబాబుకు తెలియజేయాల్సిందిగా పురంధేశ్వరి.. బాలయ్యతో చెప్పినట్లు పొలిటికల్ టాక్.. ఈ అంశాన్ని బావ.. అల్లుడు లోకేశ్ వద్ద బాలయ్య ప్రస్తావించినట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.

చెంచురామ్‌కి టికెట్ ఇవ్వడం ద్వారా దశాబ్దాలుగా ఉన్న మనస్పర్థలు తొలగడంతో పాటు నందమూరి, దగ్గుబాటి కుటుంబాల అండ తెలుగుదేశానికి దక్కుతుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారట. కుటుంబపరంగానూ.. రాజకీయం గానూ తనకు లబ్ధి చేకూర్చే ఈ అవకాశాన్ని చంద్రబాబు వంటి రాజకీయ మేధావి వదులుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.భద్రాద్రి సీతారాముల సేవలో జూ.ఎన్టీఆర్

Updated By ManamFri, 11/10/2017 - 12:48

NTRసినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ సతీసమేతంగా శుక్రవారం ఉదయం భద్రాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు ఆలయ సిబ్బంది ఆహ్వానం ప‌లికారు. ఎన్టీఆర్ కుటుంబం ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. దర్శనానంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ సిబ్బంది వారికి అందజేశారు. ఈ సందర్భంగా క్షేత్ర విశిష్టతను ఎన్టీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పోటీపడ్డారు. 

 

NTRరామాయణంలోని పాత్రలను ఇతివృత్తంగా తీసుకుని ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుళ’ దసరా కానుకగా విడుదలై ఘనవిజయం సాధించింది. గురువారం ఆ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆలయ దర్శనానికి వచ్చారు.  బాలనటుడిగా ఎన్టీఆర్‌ ‘రామాయణం’ చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. 

 

Photogallery:భద్రాద్రి సీతారాముల సేవలో ఎన్టీఆర్సినీ స్టార్లు వర్సెస్ సినీ విమర్శకులు

Updated By ManamTue, 09/26/2017 - 18:51

టాలీవుడ్‌లో సరికొత్త వార్ నడుస్తోంది. సినీ విమర్శకులకు, సినీ స్టార్లకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ జయోత్సవంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు తార్కాణం. సినిమా అనేది ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్ లాంటిదని, సినిమా నిర్మాతలు, ఇతరులు ఆ పేషెంట్ బంధువులని, ప్రేక్షకులు వైద్యులని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. పేషంట్ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లు చెప్పడం కంటే ముందు దారినపోయే దానయ్య(విమర్శకులు) చెప్పడమేంటని ఎన్టీఆర్ ప్రశ్నించాడు. ఈ సమస్య ప్రతీ సినీ నిర్మాతకు ఎదురవుతోందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. డాక్టర్, పేషెంట్‌ కథతో జూనియర్ ఎన్టీఆర్ వర్ణించిన తీరు సినీ విమర్శకులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. సినిమాలో నటించడం ఎన్టీఆర్ వృత్తి. సినిమాలు నిర్మించడం నిర్మాతల వృత్తి. సినిమా సమీక్ష రాయడం కూడా విమర్శకుల వృత్తి అని ఈ స్టార్లంతా ఎందుకు గుర్తించలేకపోతున్నారని సినీ విశ్లేషకులు వాదిస్తున్నారు. సినీ సమీక్షలను నమ్ముకుని ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ తీవ్రంగా ఖండించాడు. సినీ విశ్లేషకులు కూడా ప్రేక్షకుల్లో ఒక భాగమని, వాళ్లేమీ గ్రహాంతరవాసులు కాదన్న విషయాన్ని సినీ పెద్దలు గుర్తించాలని సూచించాడు. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ నటనను ఎవరూ విమర్శించలేదని, దర్శకుడు బాబీ లోపాలనే మాత్రమే ఎత్తిచూపారని.. వాటిని ఎందుకు స్వీకరించలేకపోతున్నారని కత్తి మహేశ్ ప్రశ్నించాడు. రివ్యూ రైటర్స్‌పై హీరోలు, దర్శకులు విరుచుకుపడటం ఇవాళ కొత్తేమీ కాదు. దర్శకుడు తేజ రివ్యూ రాసేవారిని ఓ ఇంటర్వ్యూలో చీల్చిచెండాడాడు. రివ్యూలు రాస్తున్న వారెవరికీ సినిమా సమీక్షే చాతకాదన్నాడు.

డీజే సినిమా విడుదల తర్వాత కూడా దర్శకుడు హరీష్ శంకర్ సినీ సమీక్షకులను ఏకిపారేశాడు. సినిమా అనేది ఒక వినోదమని, ప్రేక్షకులు ఆశించేది ఇవ్వడానికి తాము ప్రయత్నిస్తామని హరీశ్ శంకర్ చెప్పాడు. ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చని, అందులో ఎలాంటి తప్పు లేదని తెలిపాడు. కానీ ఈ దర్శకుడికి కళ్లు నెత్తికెక్కాయంటూ రాయడానికి మీరెవరని ప్రశ్నించాడు. కళ్లు నెత్తికెక్కాయని మీరెలా నిర్ణయిస్తారంటూ హరీశ్ శంకర్ సూటిగా ప్రశ్నించాడు. వివరణాత్మక విమర్శ అందిస్తే తామూ లోపాలను తెలుసుకుని మెరుగైన రీతిలో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తామని హరీశ్ శంకర్ చెప్పాడు. ఈ విమర్శకులపై విమర్శల పర్వం కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు.

తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కూడా రివ్యూ రైటర్ల తీరును తప్పుబట్టారు. సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత రివ్యూలు ఇవ్వాలని హీరో విశాల్ చెప్పాడు. దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని కూడా రివ్యూలు అర్హత కలిగిన వ్యక్తులు మాత్రమే రాయాలని తెలిపారు. కానీ రివ్యూ రైటర్స్‌కు ఉండాల్సిన అర్హతలేంటనే విషయంపై ఏ ఒక్కరికీ స్పష్టత లేదు. ఇలా సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్న ప్రతిసారి రివ్యూ రైటర్స్‌కు, సినీ ప్రముఖులకు మధ్య ఈ కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.మూడు వారాలు .. మూడు సినిమాలు..

Updated By ManamMon, 09/25/2017 - 18:38

'ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్' చిత్రాల‌తో సంద‌డి చేసింది. తాజాగా ఎన్టీఆర్‌కి జోడీగా 'జైల‌వ‌కుశ‌'లో మెరిసింది. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ రాశి న‌టిస్తోంది. కాగా, రాశి న‌టించిన మూడు చిత్రాలు అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల‌కి సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'రాజా ది గ్రేట్‌', 'విల‌న్‌', 'ఆక్సిజ‌న్‌'.

ర‌వితేజ హీరోగా న‌టించిన 'రాజా ది గ్రేట్' అక్టోబ‌ర్ 12న రిలీజ్ కానుంది. ఇందులో రాశి అతిథి పాత్రలో మెర‌వ‌నుంది. ఇక 'విల‌న్' విష‌యానికొస్తే.. ఇదో మ‌ల‌యాళ చిత్రం. మోహ‌న్‌లాల్‌, విశాల్‌, హ‌న్సిక‌తో క‌లిసి రాశి ఖ‌న్నా ఇందులో న‌టించింది. వ‌చ్చే నెల 19న ఈ సినిమా మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. వీటితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 'ఆక్సిజ‌న్' కూడా అక్టోబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ నెల 27న రానున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా న‌టించాడు. వ‌రుస‌గా మూడు వారాల పాటు వివిధ భాష‌ల్లో సంద‌డి చేయ‌నున్న రాశికి వీటిలో ఏ సినిమా స‌క్సెస్‌ని అందిస్తుందో చూడాలి.
Related News