30 ఏళ్ళ ‘యముడికి మొగుడు’ 

Updated By ManamSun, 04/29/2018 - 15:07
ym

ymమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో ‘యముడికి మొగుడు’ ఒక‌టి. త‌న‌ కెరీర్‌లో తొలిసారిగా చేసిన‌ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. ఇందులో కాళిగా, బాలుగా రెండు భిన్నమైన పాత్రల్లో చిరు నటన మెగాభిమానుల‌నే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఒక విధంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ నటించిన ‘రాముడు భీముడు’, ‘యమగోల’ సినిమాలను మిక్స్ చేసి ఈ కథను రూపొందించినట్టుగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ భావ‌న క‌ల‌గకుండా త‌న న‌ట‌న‌తో మైమ‌ర‌పించారు చిరు. ఇక యమలోకంలో చిరు చేసిన సందడికి  ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నారాయణరావు, సుధాకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. విజ‌య శాంతి, రాధ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో రావుగోపాల రావు, స‌త్య‌నారాయ‌ణ‌, కోట శ్రీ‌నివాస‌రావు, అల్లు రామ‌లింగ‌య్య, గొల్ల‌పూడి, సుధాక‌ర్, హ‌రి ప్ర‌సాద్‌, ప్ర‌సాద్ బాబు, అన్న‌పూర్ణ‌, వై.విజ‌య త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు.  

ఈ చిత్రం కోసం రాజ్ - కోటి అందించిన సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. 'అందం హిందోళం', 'వాన‌జ‌ల్లు గిల్లుతుంటే', 'బ‌హుశా నిన్ను బంద‌రులో చూసి ఉంటా', 'క‌న్నె పిల్ల‌తోటి', 'ఎక్కు బండెక్కు మావ‌', 'నో నో నాట్య‌మిదా'.. ఇలా ప్ర‌తీ పాట అప్ప‌ట్లో యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించింది. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాని.. తమిళంలో ‘అతిశయ పైరవి’ (1990) పేరుతో రజనీ కాంత్ హీరోగా రీమేక్ చేసారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’ ఏప్రిల్ 29, 1988న విడుదలై.. నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.  

English Title
30 years for 'yamudiki mogudu'
Related News