స‌మ్మర్‌లో మెగా (బ్ర‌ద‌ర్) సెంటిమెంట్‌

Updated By ManamMon, 04/30/2018 - 22:29
mega heroes

megaబాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాల్లో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఒక‌టి. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాల్లో భావోద్వేగాలు స‌రిగ్గా పండితే చాలు.. ఆ సినిమా క‌చ్చితంగా విజ‌య‌తీరాల‌కు చేరుతుంది. ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించిన చిత్రం 'రంగ‌స్థ‌లం'. త‌ను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య త‌న క‌ళ్ళ‌ముందే చ‌నిపోతే.. అత‌ని హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు త‌న‌ ఆశయాన్ని ఓ స్త్రీతో (రంగ‌మ్మ‌త్త‌) నెర‌వేర్చిన ఓ తమ్ముడి కథే ఈ చిత్రం. రామ్‌చ‌ర‌ణ్‌లోని న‌టుడ్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ సినిమా.. ఈ వేస‌వి ఆరంభంలో విడుద‌లై అత‌ని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఒక్క‌ చ‌ర‌ణ్ అనే కాదు.. మెగా ఫ్యామిలీకి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రికీ 'బ్ర‌ద‌ర్ సెంటిమెంట్' ఉన్న సినిమాలు భ‌లేగా క‌లిసొచ్చాయి. ముఖ్యంగా ప‌రాజ‌యాల్లో ఉన్న‌ప్పుడో లేదంటే స‌రైన విజ‌యం కోసం ఎదురుచూస్తున్న‌ప్పుడో మెగా ఫ్యామిలీకి ఈ బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ సినిమాలు అచ్చొచ్చాయి. మ‌రో విష‌య‌మేమిటంటే.. వేస‌విని టార్గెట్‌గా చేసుకుని వ‌చ్చిన ఈ త‌ర‌హా చిత్రాలైతే.. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. కాస్త ఆ వివ‌రాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏమిటో నిరూపించిన చిత్రాల్లో ‘గ్యాంగ్ లీడర్’ది ప్ర‌త్యేక స్థానం. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో.. అన్నయ్యల క్షేమం కోసం ఆరాటపడే తమ్ముడి పాత్ర‌లో చిరు న‌ట‌న అభిమానుల్ని ఫిదా చేసింది. 'రాజా విక్ర‌మార్క‌', 'స్టూవ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్' వంటి వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత.. ఈ సినిమా విజ‌యం చిరుకి నూత‌న ఉత్తేజాన్నిచ్చింది. 1991 వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి ముందు, త‌రువాత కూడా కొన్ని బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ఉన్న చిత్రాల్లో (‘ఊరికిచ్చిన మాట’, ‘ఆలయశిఖరం’, ‘మగధీరుడు’, ‘అన్నయ్య’) చిరు సంద‌డి చేశారు.

ఇక పవన్ కల్యాణ్ విష‌యానికి వ‌స్తే.. 'పులి', 'తీన్ మార్‌', 'పంజా' వంటి మూడు ప‌రాజ‌యాల త‌రువాత విజ‌యాన్ని అందించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. చెడు దారిలో వెళ్తున్న త‌మ్ముడ్ని మార్చి.. ప్రయోజకుడిని చేసే అన్న‌గా ఇందులో సంద‌డి చేశారు ప‌వ‌న్‌. 2012 వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా.. ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు.. ‘తమ్ముడు’ (1999) చిత్రం కోసం అన్న‌య్య ల‌క్ష్యాన్ని నెర‌వేర్చే త‌మ్ముడిగా సంద‌డి చేసి విజ‌యాన్ని అందుకున్నారు ప‌వ‌న్‌.

మ‌రో మెగా హీరో అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. అత‌ని కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రేసుగుర్రం’ కూడా బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో కూడిన చిత్ర‌మే. 'ఇద్ద‌ర‌మ్మాయిల‌తో' వంటి బిలో యావ‌రేజ్‌ త‌రువాత బ‌న్నీ హీరోగా న‌టించిన ఈ సినిమా.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలో భారీ విజ‌యం సాధించింది.

మొత్తానికి.. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇలా మెగా ఫ్యామిలీలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రికి 'బ్ర‌ద‌ర్ - స‌మ్మ‌ర్ సెంటిమెంట్' బాగా వ‌ర్క‌వుట్ అయింద‌నే చెప్పాలి.                  - మ‌ల్లిక్ పైడి

English Title
mega sentiment in summer
Related News