ల్యాండ్‌మార్క్ జ‌ర్నీ (స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamWed, 05/02/2018 - 15:56
heroes

land markప్ర‌తి ప్ర‌యాణంలోనూ కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. సినిమా వాళ్ళ‌కి కూడా.. అలాంటి మైలురాళ్ళు వాళ్ళ ప్ర‌యాణంలో సినిమాల సంఖ్య ప‌రంగానూ లేదంటే సంవ‌త్స‌రాల ప‌రంగానూ ఉంటాయి. అలా సంవ‌త్స‌రాల ప‌రంగా.. ఒక్కో మైలురాయికి చేరుకుంటున్న కొంద‌రి సినీ ప్ర‌ముఖుల ప్ర‌యాణం గురించి టూకీగా..

చిరంజీవి@ 40 
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌ట ప్ర‌స్థానం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఓ అధ్యాయం. 1978 సెప్టెంబ‌ర్‌లో  విడుద‌లైన 'ప్రాణం ఖ‌రీదు'తో న‌టుడిగా తొలి అడుగులు వేసిన చిరంజీవి.. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు చేసినా.. ఆ త‌రువాత క‌థానాయ‌కుడిగానే ఎదిగారు.1983లో వ‌చ్చిన 'ఖైదీ'తో స్టార్‌డమ్ పొందారు. ఆ త‌రువాత ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించారు. 'ప‌సివాడి ప్రాణం, య‌ముడికి మొగుడు, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, గ్యాంగ్ లీడ‌ర్‌,  ఘ‌రానా మొగుడు, చూడాల‌ని ఉంది, ఇంద్ర‌' వంటి ఇండ‌స్ట్రీ హిట్స్‌తో దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కుడిగా త‌న ప్ర‌భావం చూపించారు. 2008 నుంచి రాజ‌కీయాలపై దృష్టిపెట్టిన చిరు.. గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన 'ఖైదీ నంబ‌ర్ 150'తో దాదాపు తొమ్మిదేళ్ళ త‌రువాత‌ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. రికార్డు స్థాయిలో వ‌సూళ్ళు ఆర్జించిన ఈ సినిమాతో మెగా స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. ఈ ఏడాదితో చిరు సినీ జీవితం నాలుగు ద‌శాబ్దాలు పూర్తిచేసుకుంటోంది. ప్ర‌స్తుతం చిరు.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో బిజీగా ఉన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఎ.క‌రుణాక‌ర‌న్ @ 20
తెలుగు తెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌చ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే ప్ర‌భావం చూపించాయి. వాటిలో 'తొలి ప్రేమ' ఒక‌టి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌ను కీల‌క మ‌లుపు తిప్పిన ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు క‌రుణాక‌ర‌న్‌. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్నారు. స్వ‌ల్ప‌ విరామం త‌రువాత‌ త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడికి మేన‌ల్లుడైన సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ప్ర‌స్తుతం 'తేజ్ ఐ ల‌వ్ యు' సినిమా చేస్తున్నారు ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్‌. ఈ జూలై 24కి 'తొలి ప్రేమ' విడుద‌లై 20 ఏళ్ళు పూర్తికానున్నాయి. అంటే ద‌ర్శ‌కుడిగా క‌రుణాక‌ర‌న్ ప్ర‌యాణం మొద‌లై రెండు ద‌శాబ్దాలు పూర్త‌వుతోంది అన్న‌మాట‌. 

అల్లు అర్జున్ @15
సినిమా సినిమాకి త‌న స్థాయిని పెంచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు 100వ చిత్రం 'గంగోత్రి'(2003)తో హీరోగా తొలి అడుగులు వేసిన బ‌న్ని.. రెండో చిత్రం 'ఆర్య'తో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నారు. ఆ త‌రువాత 'బ‌న్ని, దేశ‌ముదురు, ప‌రుగు, జులాయి, రేసు గుర్రం, స‌రైనోడు' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌తో స్టార్ హీరోగా ఎదిగారు. ప్ర‌తి సినిమాలోనూ లుక్స్ ప‌రంగా తీసుకునే శ్ర‌ద్ధ.. అలాగే పాత్ర‌ల ఎంపిక ప‌రంగా తీసుకునే జాగ్ర‌త్త‌లు.. బ‌న్నికి యువ‌త‌లో ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చాయి. ఈ ఏడాదితో  హీరోగా ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద‌పు ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నారు బ‌న్ని. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ మొద‌లైన వేస‌విలోనే.. త‌న త‌దుప‌రి చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో సంద‌డి చేయ‌నున్నారు. మే 4న రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. యారోగెంట్‌ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌డం కోసం బ‌న్ని మేకోవ‌ర్ అయిన విధానం ఇప్ప‌టికే అభిమానుల‌ని ఫిదా చేసేసింది.

క‌ల్యాణ్ రామ్ @ 15
బాబాయ్ బాల‌కృష్ణ న‌టించిన 'బాల‌గోపాలుడు' చిత్రంలో బాల‌న‌టుడిగా సంద‌డి చేసిన‌ క‌ల్యాణ్ రామ్‌.. 'తొలి చూపులోనే' (2003) చిత్రంతో హీరోగా అడుగులు వేశారు. అయితే తొలి విజ‌యాన్ని అందుకుంది మాత్రం 'అత‌నొక్క‌డే' (2005) చిత్రంతోనే. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. మూడేళ్ళ క్రితం రిలీజైన 'ప‌టాస్‌'తో గుర్తుండిపోయే విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. గ‌త ఏడాది త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ హీరోగా 'జై ల‌వ కుశ' చిత్రాన్ని నిర్మించిన క‌ల్యాణ్ రామ్‌.. ఇటీవ‌లే 'ఎం.ఎల్‌.ఎ'గా సంద‌డి చేశారు. అతి త్వ‌ర‌లో 'నా నువ్వే' చిత్రంతో మ‌రోసారి ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ అక్టోబ‌ర్ 9కి హీరోగా క‌ల్యాణ్ రామ్ కెరీర్ మొద‌లై ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పూర్తి కానుంది.

నాని @ 10
ఓ యువ‌ క‌థానాయ‌కుడు వ‌రుస‌గా ఏడు చిత్రాల‌తో విజ‌యాలు అందుకోవ‌డం అంటే సాదాసీదా విష‌యం కాదు. అయితే.. దాన్ని సుసాధ్యం చేసి వార్త‌ల్లోకెక్కారు నేచుర‌ల్ స్టార్ నాని. మేటి ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేయ‌డంతో మొద‌లైన నాని ప్ర‌యాణం.. 'అష్టా చమ్మా' రూపంలో న‌టుడిగా చేసిన తొలి ప్ర‌య‌త్నంతో మ‌లుపు తిరిగింది. ప్రారంభంలో కొన్ని అడుగులు త‌డ‌బ‌డినా.. గ‌త మూడేళ్ళుగా నిల‌క‌డ‌గా ప్ర‌యాణం సాగిస్తున్నారు ఈ యంగ్ హీరో. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'ఎంసీఏ' వ‌ర‌కు వ‌రుస‌గా ఏడు విజ‌యాలు అందుకుని వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రో వైపు నాగార్జున వంటి సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడితో మ‌ల్టీస్టార‌ర్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సెప్టెంబ‌ర్ 5తో క‌థానాయ‌కుడిగా నాని ప్ర‌యాణం ద‌శాబ్దం పూర్తిచేసుకోనుంది.

వీరితో పాటు.. సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల (20), క‌థానాయ‌కుడు మంచు విష్ణు (15 ), ద‌ర్శ‌కులు శ్రీ‌కాంత్ అడ్డాల (10), ప‌రశురామ్ (10) త‌దితరులు త‌మ త‌మ కెరీర్స్‌లో మైలురాయికి చేరుకుంటున్నారు. అలాగే త‌మ సినీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు.                              -మ‌ల్లిక్ పైడి

English Title
special article: land mark journey
Related News